టీమిండియా క్రికెట్ జట్టుకు త్రీ ఫార్మాట్స్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కొహ్లీ త్వరలోనే ఈ బాధ్యతల నుంచి పాక్షికంగా తప్పుకోనున్నాడని తెలుస్తోంది. ప్రత్యేకించి వైట్ బాల్ క్రికెట్ కెప్టెన్సీ నుంచి కొహ్లీ తప్పుకోనున్నట్టుగా సమాచారం. ఈ విషయంలో బీసీసీఐ తో చర్చలు జరిపిన ఈ లెజెండరీ ప్లేయర్ త్వరలోనే స్వయంగా ఇందుకు సంబంధించి ప్రకటనను చేయనున్నాడు.
టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే కొహ్లీ వైట్ బాట్ క్రికెట్ కెప్టెన్సీని వదలుకునే ప్రకటనను చేయవచ్చని సమాచారం. టెస్టుల వరకూ కొహ్లీ కెప్టెన్ గా కొనసాగే ఆసక్తితోనే ఉన్నాడని తెలుస్తోంది. పరిమిత ఓవర్ల మ్యాచ్ లకు కెప్టెన్ గా రోహిత్ శర్మ నియామకం కావడం లాంఛనంగానే కనిపిస్తోంది.
కొహ్లీ విజయవంతమైన కెప్టెనే అయినప్పటికీ.. వైట్ బాల్ క్రికెట్ లో కొహ్లీ కెప్టెన్సీలో జరిగిన అద్భుతాలు లేవు. టీ20 ప్రపంచకప్ ను కానీ, వన్డే ప్రపంచకప్ ను కానీ కొహ్లీ సేన సాధించలేకపోయింది. అలాగే ఇన్నేళ్లుగా కెప్టెన్ గా ఉంటూ తన జట్టుకు ఐపీఎల్ ట్రోఫీని సాధించలేకపోతున్నాడు అనే విమర్శను కూడా ఎదుర్కొంటున్నాడు కొహ్లీ. మరోవైపు వ్యక్తిగతంగా కూడా కొహ్లీ ఫామ్ గొప్పగా లేదు.
టెస్టులు, వన్డేలు అన్నీ కలిపి 50 ఇన్నింగ్స్ లుగా ఒక్క సెంచరీ కూడా లేదు కొహ్లీ ఖాతాలో. సెంచరీల్లో సచిన్ రికార్డులన్నింటినీ బద్ధలు కొడతాడనిపించిన కొహ్లీ ఇన్ని ఇన్నింగ్స్ లలో కనీసం ఒక్క సెంచరీని కూడా కొట్టలేకపోవడం అతడి బ్యాటింగ్ సామర్థ్యాన్ని కూడా ప్రశ్నార్థకంగా మారుస్తోంది. ఐసీసీ ర్యాంకింగ్స్ లో కొహ్లీ బ్యాటింగ్ ర్యాంకు క్రమక్రమంగా పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్ మీద కొహ్లీ దృష్టి సారించాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.
ఒక ఫెయిల్యూర్ అయితే కొహ్లీపై విమర్శల జడి మరింత పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవడమే సముచితం అని కొహ్లీ భావిస్తున్నట్టుగా ఉన్నాడు. ఇప్పటికే తన ఉద్దేశాలను కొహ్లీ బీసీసీఐకి చేరవేశాడని, రోహిత్ శర్మతో కూడా మాట్లాడాడు అని.. టీ20 ప్రపంచకప్ తర్వాత కొహ్లీ ఆ బాధ్యతలను శర్మకు అప్పగించి, కేవలం బ్యాట్స్ మన్ గా జట్టులో కొనసాగనున్నాడని, టెస్టుల్లో కెప్టెన్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.