కుల ‘క‌ట్టుబాట్లు’ దాట‌లేక‌పోతున్న బీజేపీ!

క‌ర్ణాట‌క‌లో పార్టీ బ‌త‌కాలంటే లింగాయ‌త్ ల‌కే అగ్ర‌తాంబూలం ఇవ్వాలి, గుజ‌రాత్ లో ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే పటిదార్ల‌కే ప్రాధాన్య‌త‌ను ఇవ్వాలి.. అధికారం నిల‌బెట్టుకోవ‌డం అనే స‌వాల్ ఇప్పుడు బీజేపీకి గ‌ట్టిగా ఎదుర‌వుతోంది. ఇన్నాళ్లూ గెలిచింది కాదు,…

క‌ర్ణాట‌క‌లో పార్టీ బ‌త‌కాలంటే లింగాయ‌త్ ల‌కే అగ్ర‌తాంబూలం ఇవ్వాలి, గుజ‌రాత్ లో ఎన్నిక‌లు వ‌స్తున్నాయంటే పటిదార్ల‌కే ప్రాధాన్య‌త‌ను ఇవ్వాలి.. అధికారం నిల‌బెట్టుకోవ‌డం అనే స‌వాల్ ఇప్పుడు బీజేపీకి గ‌ట్టిగా ఎదుర‌వుతోంది. ఇన్నాళ్లూ గెలిచింది కాదు, ఇప్పుడు గెలిచి నిల‌వ‌డం ప్ర‌తిష్ట‌గా మారుతోంది. ఈ క్ర‌మంలో ఎక్క‌డిక్క‌డ కుల స‌మీక‌ర‌ణాల మీద బీజేపీ దృష్టి సారించింది.

త‌మది బ‌రాబ‌ర్ హిందువుల పార్టీ అని బీజేపీ నేత‌లు చెబుతూ ఉంటారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నా ఎక్క‌డా.. మైనారిటీ మ‌తాల‌కు చెందిన వారు ముఖ్య‌మంత్రులుగా లేరు. కొన్ని రాష్ట్రాల్లో అయితే క‌నీసం మంత్రివ‌ర్గంలో కూడా చోటు లేదు. మొన్న‌టి వ‌ర‌కూ గుజ‌రాత్ సీఎంగా ఉండిన రూపానీ జైన్. ఇంకో ఈశాన్య రాష్ట్రంలో బౌద్ధ ముఖ్య‌మంత్రి ఒక‌రున్నారు. ఇప్పుడు జైన్ కు కూడా వీడ్కోలు ఇచ్చారు. అక్క‌డ క‌డ‌వ‌ ప‌టేల్ ను పీఠం ఎక్కించారు.

అధికారాన్ని నిల‌బెట్టుకోవ‌డానికి కుల స‌మీక‌ర‌ణ‌ల‌నే న‌మ్ముకుంటోంది క‌మ‌లం పార్టీ. ఈ విష‌యంలొ మ‌రో మార్గం తోస్తున్న‌ట్టుగా లేదు. రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు మోడీనే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అన్న‌ట్టుగా బీజేపీ ప్ర‌చారం చేసుకుంటోంది. చాలా రాష్ట్రాల‌కు ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డం లేదు. మోడీనే అక్క‌డ ముఖ్య‌మంత్రి అవుతార‌న్న‌ట్టుగా ప్ర‌చారం సాగుతుంది.

అధికారంలోకి వ‌స్తే ఆ త‌ర్వాత ఎవ‌రినో తెర మీద‌కు తీసుకురావ‌డం జ‌రుగుతూ  వ‌స్తోంది. అయితే ఈ సంప్ర‌దాయం మొద‌ట్లో వ‌ర్క‌వుట్ అయ్యిందేమో కానీ, ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎదుర‌యిన అనుభ‌వాల దృష్ట్యా  ప్ర‌జ‌లు ఆమోదించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఫ‌లానా వ్య‌క్తి త‌మ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి అని బీజేపీ ప్ర‌క‌టించిన చోట కాస్తో కూస్తో సానుకూల ఫ‌లితాలు వ‌స్తున్నాయి. అది లేదంటే.. క‌థలో మ‌లుపులు తప్ప‌డం లేదు.

ఇక ముఖ్య‌మంత్రుల మార్పులను ప్ర‌జ‌లు ఎలా తీసుకుంటారో త్వ‌ర‌లోనే తెలిసిపోనుంది. క‌ర్ణాట‌క‌లో య‌డియూర‌ప్ప‌ను, గుజ‌రాత్ లో రూపానీని దించే క్ర‌మంలో కుల స‌మీక‌ర‌ణాల‌కు  చాలా ప్రాధాన్య‌త‌ను ఇచ్చారు. ఎంత మ‌తం పేరు చెప్పినా.. కులానికి క‌ట్టుబ‌డాల్సిన ప‌రిస్థితుల్లో క‌నిపిస్తోంది బీజేపీ. మ‌తంలో ఐక్య‌త అంటూ.. పిలుపులు ఇస్తున్నా, త‌న వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి కుల స‌మీక‌ర‌ణాల మీదే రాజ‌కీయం చేస్తోంది.