కొన్ని నియమాలు పెట్టుకుని బతుకుదామనుకున్నా కొందరు బతకనివ్వరు. ఒకానొక దినపత్రిక ఎన్ని అవాస్తవాలు, అబద్దాలూ కూస్తున్నా చెరిగినంత కాలం చెరిగి సాటి మీడియా మీద మాటిమాటికీ అక్షరాస్త్రం ప్రయోగించడమెందుకులే అని ఒక గీత గీసుకున్నాం.
కానీ ఒక్కోసారి సహనం పరీక్షకి గురైనప్పుడు కౌంటర్ రాస్తే తప్ప పంటి బిగువున ఉన్న బరువు దిగదు.
ఆ.ప్ర ప్రభుత్వం ఆన్లైన్లో సినిమా టికెట్ల అమ్మకం తాలూకూ నిర్ణయాన్ని అధిక్షేపిస్తూ పెద్ద ఎడిటోరియల్ రాసారు ఆ పత్రికలో. అందులో కొన్ని ఆణిముత్యాలు కనపడ్డాయి.
1. టికెట్ కొంటే పెన్షన్ కట్:
“….అలాంటి వారి సినిమాలకు ఆన్‌లైన్‌లో టికెట్ బుక్ చేసుకున్న వారిని గుర్తించి వారికి పెన్షన్లు, ఇతర సదుపాయాలు నిలిపివేస్తామని జగన్ సర్కార్ హెచ్చరించే అవకాశం లేకపోలేదు!”
ఆన్లైన్లో ప్రజలు ఏ హీరో టికెట్ కొంటున్నారో ప్రభుత్వం గమనించి, ఆ హీరోలు తమకు మిత్రులో శత్రువులో లెక్కేసుకుని, తద్వారా ఆయా ప్రజలకు పెన్షన్లు, పథకాలు ఇవ్వాలో వద్దో నిర్ణయిస్తుందని ఈ వాక్యంలోని సారాంశం.
ఇంతకంటే నీతి మాలిన రాత ఇంకోటుంటుందా? ప్రజలు సినిమాలు చూసే విధానాన్నిబట్టి పథకాల కేటాయింపుంటుందా? కేవలం ప్రజలని ఏదో విధంగా నమ్మించి భయభ్రాంతుల్ని చేయడం, దాంతో పైశాచికానందం పొందాలనుకోవడం ఈ రాతలోని ఉద్దేశ్యం. కానీ ఇలాంటి రాతలు చూసి ప్రజలు నవ్వుకుంటారని ఇది రాసినవారు ఎందుకనుకోరో?
2. ప్రభుత్వ మాంసం విక్రయ కేంద్రాలు:
“….ప్రభుత్వమే సినిమా టికెట్లు విక్రయించాలనుకోవడంపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు చెలరేగాయి. అదే సమయంలో మాంసం విక్రయకేంద్రాలను కూడా ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్టు జగన్‌రెడ్డి సొంత పత్రికలో ఒక వార్త వచ్చింది. దీంతో ప్రభుత్వం చేయాల్సింది ఏమిటి? చేస్తున్నది ఏమిటి? అని నెటిజన్లు మండిపడ్డారు. బార్బర్‌షాపులు, మసాజ్‌సెంటర్లు కూడా ప్రభుత్వమే నిర్వహిస్తే పోలా? అని చలోక్తులు విసురుతున్నారు. మొత్తంమీద ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుండగా సినీపరిశ్రమ ప్రతినిధులు మాత్రం మౌనవ్రతం పాటిస్తున్నారు. ‘పేదవాడి కోపం పెదవికి చేటు’ అని వారికి తెలుసు గనుక తమ భావాలను వ్యక్తంచేయడానికి కూడా సాహసించడం లేదు”.
అసలేవిటి ఈ అవగాహనా రాహిత్యం? మెయిన్ స్ట్రీం మీడియాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం తాలూకు మటన్ కార్పోరేషన్ ఒకటుంటుందని తెలియదా? ఎన్నో దశాబ్దాలుగా పని లేకుండా పడున్న సంస్థకి చేయాల్సిన పనిని గుర్తు చేసి నడిపిస్తోందే తప్ప ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విధానం కాదిది.
ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందట. ప్రజలంటే టీడీపీ సానుభూతిపరులొక్కరే అనుకుంటున్నారు కాబోలు.
సినీపెద్దలని ఉద్దేశిస్తూ “పేదవాడి కోపం పెదవికి చేటు” సామెతెందుకు? చిరంజీవి, సురేష్ బాబు లాంటి సినీపెద్దలు పేదవారనా?
ఏవో అక్షరాలు నింపి పేపరుని నలుపు చేయడం తప్ప అర్థవంతమైన రాత ఎక్కడుంది ఇందులో?
ఇలాంటి రాతలు చదివి, టీవీలో చూసి మంటెత్తిపోయిన కళ్యాణ్ దిలీప్ సుంకర ఏకంగా ఎనిమిదో, పదో వీడియోలు వదిలాడు. వాటికొచ్చినంత సంపూర్ణ జనాదరణ ఈ మధ్య కాలంలో దేనికీ రాలేదు. ఇక్కడ “సంపూర్ణ జనాదరణ” అంటే టీడీపీ సానుభూతిపరులనబడే అతి కొద్ది మంది ప్రజానీకాన్ని తీసివేయగా మిగిలిన యావన్మంది ప్రజలూను.
3. బడా నటులకి మార్కెట్ లేదు:
“…నిజానికి కరోనా మహమ్మారి కారణంగా సినిమా పరిశ్రమ కుదేలైంది. ఏడాదిన్నరగా పెద్దనటుల సినిమాలు విడుదల చేయలేని పరిస్థితి. నెలల తరబడి షూటింగులు నిలిచిపోవడంతో పరిశ్రమపై ఆధారపడి జీవించేవారు ఉపాధి కోల్పోయారు. కులాలను అడ్డుపెట్టుకుని బడానటులుగా చలామణి అవుతున్న వారికి మార్కెట్ లేకుండా పోయింది. కరోనాకు ముందు హీరోలుగా వెలిగిన కొంతమంది ఒక్క సినిమాలో నటించడానికే 20 కోట్లకు పైగా పారితోషికాన్ని డిమాండ్ చేసేవారు. సినిమా నిర్మాణ వ్యయంపై అదుపు లేకుండా పోయింది. నిర్మాతల గురించి ఆలోచించే తీరిక ఎవరికీ లేకుండా పోయింది. నోటికొచ్చిన పారితోషికాన్ని డిమాండ్ చేసిన వారు సైతం కరోనా పుణ్యమా అని మెత్తబడ్డారు…”
ఎవరండీ మెత్తబడింది? ఏ పెద్ద హీరో పారితోషికం రూ 30 కోట్లకి తక్కువుందో చెప్పండి? నిజానికి కరోనాతో సంబంధం లేకుండా ఈ మధ్యనే ఒక పెద్ద హీరో గారు ఒక కొత్త సినిమాకి బేరం కుదుర్చుకుంటూ తనకి రూ 80 కోట్లు ఇమ్మని డిమాండ్ చేసాడు. అంతెలా ఇచ్చుకోగలం బాబూ..అంటే, “నా లాస్ట్ సినిమా 150 కోట్లు వసూలు చేసింది. ఆ లెక్కన నాకు 80 ఇచ్చి, 40 తో సినిమా తీయండి. మీకు 30 లాభం ఎటూ పోదుగా”, అని సెలవిచ్చాడు.
ఆ ఇచ్చుకునేదేదో నిజంగా వసూలైతే ఇస్తాం ముందు కాస్త తగ్గించుకుని చెప్పండంటే “నథింగ్ డూయింగ్” అన్నాడు.
ఏం తెలుసని రాస్తున్నారో, ఎవరి కోసం రాస్తున్నారో ఈ రాతలు. ఏ మాత్రం బేసిక్ సమాచారం తెలిసినవాడైనా నవ్విపోతాడు.
4. జగన్ ధనదాహం:
“….మంచో చెడో తండ్రి హయాంలో సంపాదించిన సొమ్ముతో సంతృప్తిపడకుండా ఇంకా ఇంకా అంటూ ఆరాటపడుతున్న వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు. అంతులేని ధనదాహం ఉండటం ఒకరకంగా మానసికజాడ్యమనే చెప్పవచ్చు…”
అసలు రాష్ట్రంలో అవినీతి ప్రస్ఫుటంగా తగ్గింది జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకనే. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. రాజు సరిగ్గా ఉంటే మంత్రి, మంత్రి సరిగా ఉంటే అధికారి, అధికారి సరిగ్గా ఉంటే ఆ కింద వాడు…అందరూ పద్ధతిగా ఉంటారు. ఎక్కడా అవినీతి జరుగుతున్నట్టు కానీ, లంచాల రాయుళ్ల భాగోతాలు కానీ గత ప్రభుత్వ హయాంలో వచ్చినట్టుగా ఇప్పుడు లేవు. అయినా సరే ఏదో జరిగిపోతోందని, ఏవో చీకటి వ్యాపారాలు జరిగిపోతున్నాయని చీకటి రాతలు రాసుకోవడం ఆత్మన్యూనతకి, అసూయకి, కడుపుమంటకి నిదర్శనాలు.
ఎప్పటికీ గోబెల్స్ ప్రచారాలు చేసుకుంటూ, ఏది రాసినా నమ్మేస్తారని జనాన్ని తెలివితక్కువ దద్దమ్మలుగా భావిస్తూ రోజురోజుకి టీడీపీ చితికి కట్టెలు పేర్చుకుంటూ పోతోంది ఈ పత్రిక.
అబద్ధమాడినా అతికినట్టుండాలంటారు. అలా ఉండాలంటే అంశంలో విషయం, రాతలో తూకం ఉండాలి. అవి రెండూ లేకుండా కేవలం అసూయావేశంతో ఊహాజనిత కథనాలు రాసుకుంటుంటే నెమ్మదిగా ప్రజల భావనల్లోంచి అంతర్ధానమవ్వడం తప్ప ఏమీ ఉండదు.