బాలీవుడ్ లో రామాయణం ఆధారంగా రూపొందే ఒక సినిమాలో సీత పాత్రను ధరించడానికి నటి కరీనా కపూర్ పన్నెండు కోట్ల రూపాయల పారితోషికం కోరిందనే వార్తలపై భిన్నాభిప్రాయాలు వినిపించాయి. ఈ అంశంలో కరీనాను నిందించడానికి కూడా నెటిజన్లు వెనుకాడలేదు. కొంతమంది సినీ ప్రియులు అక్కడికేదో తమ జేబుల్లోంచి కరీనాకు రెమ్యూనిరేషన్ ఇస్తున్నంత స్థాయిలో రియాక్ట్ అయ్యారు. ఆమెను ట్రోల్ చేశారు. రచ్చరచ్చ చేశారు.
ఆమె పారితోషికం ఆమె ఇష్టం. ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. అది ఆ హీరోయిన్ కూ, నిర్మాతలకూ మధ్య సంబంధించిన అంశం. అయితే నెటిజన్లు తమకు నచ్చని అంశాల గురించి రచ్చరచ్చ చేసి సంతృప్తి పొందడం సోషల్ మీడియాలో రొటీనే. ఆఖరికి ఈ అంశాన్ని కూడా వారు వదల్లేదు. ఈ నేపథ్యంలో కరీనా స్పందించింది. ఇక్వల్ పే డిమాండ్ ను ఆమె ఈ సందర్భంగా తెరపైకి తీసుకు వచ్చింది.
స్త్రీ, పురుషులకు సమానవేతనం అడగడానికి ఈ సందర్భాన్ని తన ఉపయోగించుకుంటున్నట్టుగా కరీనా చెబుతోంది. ఈ విషయంలో మరో మాట లేదని ఆమె అంటోంది. రామాయణాన్ని సీత కోణంలో చెప్పాలనేది ఆ సినిమా మేకర్ల ఆలోచన అని, అలాంటప్పుడు ఆ పాత్రే ప్రధానం అని, ఆ ప్రధాన పాత్రను చేస్తున్నప్పుడు పన్నెండు కోట్ల పారితోషికం కోరడంలో వింత ఏమీ లేదని కరీనా అంటోంది.
ప్రధాన పాత్రధారికి ఎక్కువ రెమ్యూనిరేషన్ అయినప్పుడు.. తను ఈక్వల్ పే డిమాండ్ చేయడంలో తప్పేముందని కరీనా ప్రశ్నిస్తోంది. పన్నెండు కోట్ల పారితోషికం విషయంలో వెనక్కు తగ్గేది లేదని ఇలా వివరణ ఇస్తోంది. బాలీవుడ్ లో ఇప్పుడు ఈక్వెల్ పే నినాదం రేగుతోంది.
ఇటీవలే దీపికా పదుకునే ఇలాంటి డిమాండ్ తో భన్సాలీ సినిమా నుంచి వైదొలిగింది. ఇది వరకూ పలు సినిమాల విషయంలో హీరోల కన్నా ఎక్కువ రెమ్యూనిరేషన్ పొందింది దీపిక. ఇప్పుడు అలాంటి డిమాండ్ తో ఆమె భన్సాలీ సినిమా నుంచి బయటకు వచ్చిందనే వార్తలున్నాయి. ఇప్పుడు కరీనా కూడా ఈక్వెల్ పే డిమాండ్ ను రైజ్ చేస్తోంది.