తన బిడ్డకు తండ్రెవరో చెప్పడానికి ప్రముఖ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఇష్టపడలేదు. అలాగని తండ్రెవరో తెలియక కాదు, అతని పేరు ఉచ్ఛరించడానికి ఆమె మనసు అంగీకరించడం లేదు. దీన్ని బట్టి అతనిపై ఆమె ఎంత కోపంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
గత నెలాఖరులో నుస్రత్ మగబిడ్డకు జన్మనిచ్చారు. తల్లైన తర్వాత మొదటి సారి ఆమె కోల్‌కతాలోని సెలూన్ ప్రారంభానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమెని మీడియా చుట్టుముట్టింది. మీ బిడ్డకు తండ్రెవరని జర్నలిస్టు ప్రతినిధులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై ఆమె అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు.
బిడ్డకు తండ్రెవరో చెప్పాలని మహిళను మీడియా నిలదీయడం ఆమె వ్యక్తిత్వాన్ని కించపరచటమేనని నుస్రత్ జహాన్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా ప్రశ్నకు సమాధానం ఆ తండ్రికే తెలుసని నుస్రత్ బదులిచ్చారు.
తన కుమారుడి పేరు ఇషాన్ అని అన్నారు. ఇదిలా వుండగా, 2019లో టర్కీ వ్యాపారవేత్త నిఖిల్ జైన్‌ను టర్కిష్ చట్టం ప్రకారం నుస్రత్ వివాహం చేసుకున్నారు. ఇటీవల భర్తతో తెగదెంపులు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె కుటుంబ సభ్యులతో వుంటున్నారు.