టీమిండియా మెంట‌ర్ గా మ‌హేంద్ర‌సింగ్ ధోనీ!

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి అనూహ్య‌మైన బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది బీసీసీఐ. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సంద‌ర్భంగా టీమిండియాకు ధోనీ మెంట‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్టుగా బీసీసీఐ ప్ర‌క‌టించింది.  జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌తో పాటు.. ఈ…

టీమిండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి అనూహ్య‌మైన బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది బీసీసీఐ. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ సంద‌ర్భంగా టీమిండియాకు ధోనీ మెంట‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌బోతున్న‌ట్టుగా బీసీసీఐ ప్ర‌క‌టించింది.  జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌తో పాటు.. ఈ ఆస‌క్తిదాయ‌క‌మైన నిర్ణ‌యాన్ని బీసీసీఐ వెలువ‌రించింది. 2019 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ద‌గ్గ‌ర నుంచి టీమిండియాకు దూర‌మై, ఆ త‌ర్వాత అన్ని క్రికెట్ ఫార్మాట్ లకూ రిటైర్మెంట్ ను ప్ర‌క‌టించిన ధోనీ, ఇలా మ‌ళ్లీ టీమిండియాకు చేర‌వ‌వుతున్నాడు.

అలాగే జ‌ట్టు ఎంపిక‌లో కూడా బీసీసీఐ ఒక ఆస‌క్తిదాయ‌క‌మైన నిర్ణ‌యాన్ని తీసుకుంది. అదే స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ కు 15 మంది స‌భ్యుల జ‌ట్టులో స్థానం క‌ల్పించింది. 34 యేళ్ల అశ్విన్ టీమిండియా త‌ర‌ఫున వైట్ బాల్ క్రికెట్ ఆడ‌క సంవ‌త్స‌రాలు గ‌డిచిపోయాయి. చివ‌రి సారి అశ్విన్ కు ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ లో టీమిండియా త‌ర‌ఫున 2017లో చోటు ల‌భించింది. ఆ త‌ర్వాత టెస్టు క్రికెట్ కే ప‌రిమిత‌మ‌య్యాడు అశ్విన్. అది కూడా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఇండియా- ఇంగ్లండ్ సీరిస్ లో అశ్విన్ కు చోటు ద‌క్క‌డం లేదు.

నాలుగు టెస్టుల విష‌యంలోనూ అశ్విన్ ప‌ట్టించుకోలేదు కెప్టెన్ కొహ్లీ. జ‌డేజా ప్ర‌ద‌ర్శ‌న అంతంత‌మాత్రంగా ఉన్నా.. అత‌డికే అవ‌కాశాలు ఇస్తున్నారు. అశ్విన్ ను ప్రేక్ష‌కుడిని చేశారు.  మ‌రి టెస్టుల్లోనే అశ్విన్ ను ప్రేక్ష‌కుడిగా చేసిన త‌రుణంలో అత‌డిని టీ20 ప్ర‌పంచ‌క‌ప్ జ‌ట్టులో కూర్చ‌డం గ‌మ‌నార్హం.

ఇక ధోనీని మెంట‌ర్ గా ప్ర‌క‌టించ‌డంలో కూడా.. శాస్త్రి ప్రాధాన్య‌తను త‌గ్గించి వేసిన‌ట్టే. త్వ‌ర‌లోనే శాస్త్రి కోచ్ ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల్సి ఉంటుంది. 60 యేళ్ల‌లోకి ప‌డ్డ వారు టీమిండియా కోచ్ ప‌ద‌వికి అన‌ర్హులు. ప్ర‌స్తుతం శాస్త్రి వ‌య‌సు 59. ఈ నేప‌థ్యంలో 60 ప‌డ‌గానే ఆయ‌న త‌ప్పుకోవాల్సి ఉంటుంది. అందులో మ‌రో మాట ఉండ‌దు. అప్పుడు కొహ్లీ లాబీయింగ్ కూడా ప‌ని చేయ‌దు. శాస్త్రితో పాటు.. అత‌డు తెచ్చుకున్న టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ అద‌న‌పు కోచ్ లు కూడా ఇంటి దారి ప‌ట్టాల్సిందేన‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ధోనీకి బీసీసీఐ ప్రాధాన్య‌త‌ను ఇచ్చిన‌ట్టుగా ఉంది. అలాగే కొహ్లీ కెప్టెన్సీలో ఐసీసీ టోర్నీలేవీ గెల‌వ‌డం లేదు టీమిండియా. కీల‌క‌మైన సీరిస్ ల‌లో చేతులెత్తేయ‌డం అల‌వాటుగా మారింది. ఈ నేప‌థ్యంలో కూడా కొహ్లీ నిర్ణ‌యాల‌ను ప్ర‌భావితం చేయ‌డానికే ధోనీని మెంట‌ర్ గా డ‌గౌట్ లో కూర్చోబెడుతున్న‌ట్టుగా ఉన్నారు. ధోనీ ప‌ట్ల కొహ్లీకి కూడా గ‌తంలో కూడా విముఖత ఏమీ లేదు కాబ‌ట్టి.. ఈ మార్పు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ లో ఇండియాను విజేత‌గా నిలుపుతుందేమో చూడాలి!