టీడీపీ వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్న ‘సీమ‌’

రాయ‌ల‌సీమ‌లో మ‌ళ్లీ ఉద్య‌మం పురుడు పోసుకుంటోంది. ఇది టీడీపీని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. చంద్ర‌బాబునాయుడు రాయ‌ల‌సీమ వాసి అయిన‌ప్ప‌టికీ, ఆ ప్రాంతానికి వ్య‌తిరేకిగా గుర్తింపు పొందారు. త‌న అత్త‌గారి ప్రాంత ప‌క్షపాతిగా ఆయ‌న్ను రాయ‌ల‌సీమ…

రాయ‌ల‌సీమ‌లో మ‌ళ్లీ ఉద్య‌మం పురుడు పోసుకుంటోంది. ఇది టీడీపీని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. చంద్ర‌బాబునాయుడు రాయ‌ల‌సీమ వాసి అయిన‌ప్ప‌టికీ, ఆ ప్రాంతానికి వ్య‌తిరేకిగా గుర్తింపు పొందారు. త‌న అత్త‌గారి ప్రాంత ప‌క్షపాతిగా ఆయ‌న్ను రాయ‌ల‌సీమ స‌మాజం చూస్తోంది. అందుకే రాయ‌ల‌సీమ ఆకాంక్ష‌ల‌ను, శ్రీ‌బాగ్ పెద్ద మ‌నుషుల ఒప్పందాన్ని ఖాత‌రు చేయ‌కుండా అమ‌రావ‌తిలో రాజ‌ధాని ఏర్పాటు చేశార‌నే ఆవేద‌న‌, ఆక్రోశం ఆ ప్రాంత ప్ర‌జానీకంలో బ‌లంగా వుంది.

అంతేకాదు, ప‌దేప‌దే రాయ‌ల‌సీమ‌ను కించ‌ప‌రిచేలా చంద్ర‌బాబు, టీడీపీ నేత‌లు మాట్లాడ్డంపై కూడా ఆ ప్రాంతం తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది. ఈ నేప‌థ్యంలో రాయ‌ల‌సీమ‌కు హైకోర్టు ఇస్తామ‌న్న జ‌గ‌న్ ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని చంద్ర‌బాబు అడ్డగోలుగా వ్య‌తిరేకిస్తుండ‌డం తీవ్ర ఆగ్ర‌హానికి గురి చేస్తోంది. చంద్ర‌బాబు ఏదీ ఇవ్వ‌రు, ఇచ్చే వాళ్ల‌ను అడ్డుకుంటారా? అనే ఆక్రోశం సీమ ప్రాంతంలో నెల‌కుంది. ఈ నేప‌థ్యంలో శ‌నివారం రాయ‌ల‌సీమ ఆత్మ‌గౌర‌వ ప్ర‌ద‌ర్శ‌న‌, బ‌హిరంగ స‌భ నిర్వ‌హ‌ణ‌కు ప్ర‌పంచ ఆధ్మాత్మిక క్షేత్రం తిరుప‌తి స‌న్న‌ద్ధ‌మైంది.

ఈ మ‌హాప్ర‌ద‌ర్శ‌న స్ఫూర్తితో రాయ‌ల‌సీమ అంత‌టా విస్తృతంగా నిర్వ‌హించాల‌నే ఆలోచ‌న‌లో అధికార పార్టీ వుంది. ఇందుకు ప్ర‌జాసంఘాలు, విద్యార్థి సంఘాలు, సీమ అభివృద్ధిని ఆకాంక్షించే వ్య‌క్తులు, వ్య‌వ‌స్థలు అండ‌గా నిలుస్తున్నాయి. ఈ వాతావ‌ర‌ణం రాజ‌కీయంగా మ‌రోసారి త‌మ‌ను దారుణంగా దెబ్బ‌తీస్తుంద‌నే భ‌యాందోళ‌న‌లో టీడీపీ వుంది. గత సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాయ‌ల‌సీమ‌లో 52 అసెంబ్లీ సీట్ల‌లో కేవ‌లం మూడంటే మూడే సీట్ల‌ను టీడీపీ గెలుచుకుంది.

రాయ‌ల‌సీమ ప్రాంతీయ ఉద్య‌మం ఊపందుకుంటే మాత్రం మ‌రోసారి చావు దెబ్బ తినాల్సి వ‌స్తుంద‌ని టీడీపీ నేత‌లు క‌ల‌వ‌రానికి గురి అవుతున్నారు. అమ‌రావ‌తి కోసం రాజ‌కీయంగా తాము బ‌లి కావాలా? అనే అంత‌ర్మ‌థ‌నం సీమ టీడీపీ నేత‌ల్లో మొద‌లైంది. ఇవాళ్టి తిరుప‌తి మ‌హాప్ర‌ద‌ర్శ‌న రాయ‌లసీమ‌లో రాజ‌కీయంగా ఎన్ని మార్పులు తీసుకురానుందో కాలం జ‌వాబు చెప్పాల్సి వుంది. మొత్తానికి టీడీపీ వెన్నులో సీమ వ‌ణుకు పుట్టిస్తోంది.