తమిళ నటుడు కార్తీకి వరస విజయాలు లభిస్తున్నాయి సొంత భాషలో. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ తమిళనాట భారీ వసూళ్లను అందుకుంది. ఆ సినిమాలో ఒకానొక కీలక పాత్రలో కార్తీ కూడా నటించాడు. ఆ సినిమా హిట్ తో సొంత భాషలో విజయం దక్కిన ఉత్సాహంలో ఉన్న కార్తీకి సర్దార్ అనే సినిమా కూడా మరో విజయాన్ని జమ చేసింది.
తెలుగులోకి కూడా అనువాదం అయిన ఈ సినిమా ఇక్కడ పెద్దగా చప్పుడు చేయలేదు కానీ ఇది కూడా తమిళనాట హిట్ అనిపించుకుంటోంది. తొలి వారం ముగిసే సరికి ఈ సినిమాకు 80 కోట్ల రూపాయల వసూళ్లు దక్కినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది కార్తీ కెరీర్ లో హిట్ గా చెప్పుకోదగిన సినిమా అనే విశ్లేషణలు వస్తున్నాయి తమిళనాట నుంచి.
ఈ విజయంతో తనపై కూడా చాలా ఒత్తిడి తగ్గిందని అంటున్నాడు కార్తీ. దాదాపు 15 యేళ్ల నుంచి నటిస్తున్నా.. మంచి నటుడనే పేరున్నా.. ఒక హిట్టు.. రెండు మూడు ఫ్లాపులుగా సాగుతోంది కార్తీ కెరీర్. పలు ప్రయోగాలు, వివిధ రకాల క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నాడు. అయితే కార్తీ తనకంటూ ఒక స్టార్ డమ్ ను క్రియేట్ చేసుకోలేకపోతున్నాడు. వ్యక్తిగతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. కార్తీ నటనను ఇష్టపడే వారున్నా.. కార్తీ ఇప్పటికీ స్టార్ కాలేకపోయాడు.
ఇలాంటి క్రమంలో వరస విజయాలు ఈ హీరోకు ఊరటను ఇచ్చే అంశాలే. ఈ సినిమా తమిళ నిర్మాత తన బాల్య మిత్రుడే అని ఈ హిట్ తో అతడికి కూడా లాభాలు ఇవ్వడం కూడా తనకు మరింత మంచి అనుభూతి అని కార్తీ చెప్పుకున్నాడు. తమిళ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూళ్లు ఇంకా ఫర్వాలేదనిపించుకునే స్థాయిలో ఉన్నట్టున్నాయి.