ఎర్ర మన్ను దిబ్బలు అంటే ఎవరైనా కచ్చితంగా భీమిలీ వైపుగా రావాల్సిందే. అరుదైన ఈ ఎర్ర కొండలు భీమిలీ బీచ్ కి అభిముఖంగా విస్తరించి ప్రకృతి ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
వీటికి నిజానికి సినిమాల ద్వారానే ఎక్కువ ప్రాచుర్యం వచ్చింది. కె బాలచందర్, దాసరి వంటి దిగ్దర్శకులు భీమిలీ బీచ్ అందాలతో పాటు ఎర్ర మన్ను దిబ్బలను కూడా సెల్యూలాయిడ్ మీద మనోహరమైన తీరులో చూపించి అందరినీ ఈ వైపుగా చూసేలా చేశారు.
ఎర్రమన్ను దిబ్బలు తపస్సు చేసుకుంటున్న మునులుగా కనిపిస్తాయి. అక్కడ ప్రాకృతిక సౌందర్యానికి ప్లాట్ అవని వారు ఎవరూ ఉండరు. అలాంటి ఎర్ర మన్ను దిబ్బలకు ఇన్నాళ్ళకు మోక్షం కలిగింది అని చెప్పుకోవాలి.
వీటిని టూరిజం కేటగిరీలో చేర్చి అభివృద్ధి చేస్తామని మంత్రి అవంతి శ్రీనివాస్ అంటున్నారు. విశేష ప్రాధాన్యత కలిగిన ఎర్ర మన్ను దిబ్బలకు కొత్త సొబగులు అద్ది టూరిస్టులందరికీ కను విందు చేస్తామని చెబుతున్నారు. ఇందుకోసం బహు చక్కని ప్రణాళికను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఎర్ర మన్ను దిబ్బలు ఒక వైపు, నీలి సంద్రం మరో వైపు, పచ్చని కొండలు ఇంకో వైపు ఇలా టూరిజం సర్క్యూట్ గా వీటిని అభివృద్ధి చేస్తే టూరిస్టులు వెల్లువలా వస్తారని పర్యాటక శాఖ అధికారులు ఆశాభావంతో ఉన్నారు.