అయ్యో…వాళ్ల కొడుపు కొట్ట‌డానికి మ‌న‌సెలా వ‌చ్చింది?

త‌మ క‌డుపు కొట్ట‌డానికి ఏపీ విద్యాశాఖ‌కు మ‌న‌సెలా వ‌చ్చింద‌ని పారిశుద్ధ్య కార్మికులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం మాట‌ల‌కు, చేత‌ల‌కు స్ప‌ష్ట‌మైన తేడాను ప‌ట్టిచ్చే ఉదంతం ఇది. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ప‌నిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేత‌నాల్లో…

త‌మ క‌డుపు కొట్ట‌డానికి ఏపీ విద్యాశాఖ‌కు మ‌న‌సెలా వ‌చ్చింద‌ని పారిశుద్ధ్య కార్మికులు ప్ర‌శ్నిస్తున్నారు. ఏపీ ప్ర‌భుత్వం మాట‌ల‌కు, చేత‌ల‌కు స్ప‌ష్ట‌మైన తేడాను ప‌ట్టిచ్చే ఉదంతం ఇది. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ప‌నిచేసే పారిశుద్ధ్య కార్మికుల వేత‌నాల్లో విద్యాశాఖ నిర్దాక్షిణ్యంగా కోత విధించింది. ముందుగా ప్ర‌క‌టించిన‌ రూ.6 వేల‌లో రూ.5 వేలు కోత విధించి, వెయ్యి రూపాయ‌లు ఇవ్వాల‌ని ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

ప్ర‌భుత్వ పాఠ‌శాల్లో ప‌రిశుభ్ర‌త‌కు పెద్ద‌పీట వేయాల‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం భావించింది. ఇందులో భాగంగా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌తి పాఠ‌శాల‌లో పారిశుద్ధ్య కార్మికుల‌ను నియ‌మించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. 2020-21 విద్యా సంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి నుంచి నెల‌కు రూ.6 వేలు వేత‌న‌మివ్వాల‌ని ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది. దీంతో ప్ర‌ధానోపాధ్యాయులు త‌మ ప‌రిధిలో పారిశుద్ధ్య కార్మికుల‌ను నియ‌మించుకున్నారు. అప్ప‌టి నుంచి పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వ‌ర్తిస్తున్నారు.

పాఠ‌శాల ప‌నిదినాల్లో ప్ర‌తిరోజూ రెండు పూట‌లా, సెల‌వు రోజుల్లో ఒక పూట శుభ్రం చేయాల‌ని కార్మికులు ప‌నిచేస్తున్నారు. వీరికి వేత‌నాలు అమ్మ ఒడి ప‌థ‌కం నుంచి చెల్లించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వం సూచించింది. అమ్మ ఒడి నిధులు విద్యార్థుల త‌ల్లుల ఖాతాల‌కు జ‌న‌వ‌రిలోనే జ‌మ అయ్యాయి. కానీ కార్మికుల‌కు ఇంత వ‌ర‌కూ వేత‌నాలు జ‌మ‌కాని ప‌రిస్థితి.

అమ్మఒడికి ఇచ్చే రూ.15 వేలలో వెయ్యి రూపాయ‌ల‌ను ప్ర‌భుత్వం మిన‌హాయించి రూ.14 వేలు ఇస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఏప్రిల్ వ‌ర‌కూ స్కూళ్లు న‌డిచాయి. ఆ త‌ర్వాత ఈ నెల అంటే జూలై 1 నుంచి ఉపాధ్యాయులు, ఇత‌ర సిబ్బంది ప్ర‌తిరోజూ స్కూల్‌కు వెళుతున్నారు. కానీ ఇంత వ‌ర‌కూ పారిశుద్ధ్య కార్మికుల‌కు వేత‌నాలు అంద‌ని ప‌రిస్థితి. 

ఈ నేప‌థ్యంలో ఓ పిడుగు లాంటి ఉత్త‌ర్వు ప్ర‌ధానోపాధ్యాయుల‌తో పాటు పారిశుద్ధ్య కార్మికుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఇక మీద‌ట పారిశుద్ధ్య కార్మికుల‌కు రూ.6 వేల‌కు బ‌దులు వెయ్యి మాత్ర‌మే చెల్లించాల‌ని విద్యాశాఖ తాజా ఉత్త‌ర్వులు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.  ఒక‌వైపు త‌మ‌కు గౌర‌వం వేత‌నం ఇచ్చేందుకు నిధుల కొర‌త లేక‌పోయినా, కోత విధించ‌డంపై పారిశుద్ధ్య కార్మికులు మండిప‌డుతున్నారు.

ప్ర‌భుత్వ‌మే వెట్టి చాకిరి చేయించ‌డం ఏంట‌ని నిల‌దీస్తున్నారు. మ‌రోవైపు నెల‌కు రూ.6 వేలు చొప్పున ఇస్తామ‌ని చెప్పి, ఇప్పుడు వెయ్యి రూపాయాలే ఇవ్వాల‌ని నిర్ణ‌యించ‌డం ఏంట‌ని ప్ర‌ధానోపాధ్యాయులు ప్ర‌శ్నిస్తున్నారు. మిగిలిన రూ.5 వేలు ఎవ‌రు ఇవ్వా ల‌ని హెచ్ఎంలు నిల‌దీస్తున్నారు.

అమ్మ ఒడి నిధుల‌ను కూడా ఇత‌ర ప‌థ‌కాల‌కు మ‌ళ్లించ‌డం వ‌ల్లే ఈ దుస్థితి ఏర్ప‌డింద‌నే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏది ఏమైనా పారిశుద్ధ్య కార్మికుల క‌డుపు కొట్ట‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.