రాజకీయాల్లో అతి దూకుడు తనంతో ఇప్పటికే గట్టి సెల్ఫ్ గోల్స్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి. స్టీఫెన్ సన్ కు వెళ్లి నోట్లు అందించడంలో ముందూ వెనుకా చూసుకోకుండా రేవంత్ రెడ్డి కేసుల్లో ఇరుక్కున్నారు. ఆ కేసులు ఎప్పుడు పామై కరుస్తాయో చెప్పలేని పరిస్థితుల్లో కొనసాగుతూ ఉన్నారు. అన్నీ ఉన్నా.. ఆ కేసులు రేవంత్ రెడ్డికి మైనస్ పాయింట్ గా మారాయి.
ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలను విమర్శించగానే.. వారు నోట్ల బ్యాగులు మోసిన నువ్వా నీతులు చెప్పేది? అనే ప్రశ్న వేస్తున్నారు. దీంతో రేవంత్ మాత్రమే కాదు, కాంగ్రెస్ కూడా కిక్కురుమనలేని పరిస్థితి! ఎమ్మెల్యే ఓటును కొనడానికి వెళ్లి వీడియోల్లో చిక్కుకున్న నేత గారు ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలను విమర్శిస్తే అది ప్రహసనమే అవుతుంది.
అలాంటి సెల్ఫ్ గోల్స్ స్పెషలిస్ట్ అయిన రేవంత్ రెడ్డి, ఒక చానల్ అధిపతితో జరిపిన సమావేశం మరో సెల్ఫ్ గోల్ అయ్యింది. ప్రస్తుతం ఆ చానల్ అధిపతి, రేవంత్ రెడ్డిల వీడియో సంభాషణ వైరల్ గా మారింది. ఈ వీడియోను రేవంత్ అంటే పడని వారు, తెలుగుదేశం అంటే పడని వారే ఎక్కువ వైరల్ చేస్తున్నారు!
ఈ వీడియో ద్వారా తెలుగుదేశం పార్టీపై తన ప్రేమనంతా రేవంత్ రుజువు చేసుకున్నాడు. ఇంకా చంద్రబాబుకు ఏజెంట్ లానే రేవంత్ రెడ్డి స్పందిస్తున్నారు తప్ప.. పీసీసీ ప్రెసిడెంట్ లా కాదని స్పష్టం అవుతోంది. తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ ఒక మీడియాధినేతను కలిస్తే అయితే గియితే తమ రాష్ట్ర రాజకీయం గురించి మాట్లాడతాడు, లేకపోతే రాహుల్ గాంధీ గురించి మాట్లాడతాడు. అంతే కానీ.. లోకేష్ కు రాజకీయాలు ఎలా నేర్పించాలి, ఏం చేస్తే లోకేష్ రాజకీయంగా బాగుపడతాడు.. అనే టాపిక్ గురించి డిస్కషన్ చేయడు.
కానీ.. పీసీసీ అధ్యక్షుడిగా నియమితం అయ్యాకా కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, బ్యాగుల మోసిన బుద్ధి పోకపోవడంతో రేవంత్ రెడ్డి అలా స్పందించి, సెల్ఫ్ గోల్ చేసుకున్నాడు. కాలు తొక్కే నాడే కాపురం చేసే కళ తెలుస్తుందన్నట్టుగా ఇప్పుడే రేవంత్ తన బాధంతా లోకేష్ గురించి ఉందని చాటుకుని.. రాబోవు రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ ను ఏ మేరకు ఉద్ధరించగలరో చాటుకున్నట్టున్నారు!