తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఏపీ సర్కార్ గట్టి కౌంటర్ ఇచ్చింది. ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం అని ఏపీ ప్రభుత్వ వైఖరిని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తేల్చి చెప్పారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన కృష్ణా జలాల్లో సగం తెలంగాణకు దక్కి తీరాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తేల్చి చెప్పిన నేపథ్యంలో సజ్జల చెప్పిన మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇంత వరకూ కృష్ణా జలాల్లో ఏపీ 66%, తెలంగాణ 34% చొప్పున నీటి పంపకం జరుగుతోంది.
అయితే కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నీటి పంపకాల ప్రకారం కాకుండా తమ ఇష్టానుసారం చేయాలని కేసీఆర్ వైఖరి ఉందని ఏపీ ప్రభుత్వం, ప్రజానీకం భావిస్తోంది. ఈ ఏడాది నుంచి రెండు రాష్ట్రాల మధ్య సమానంగా నీటి పంపకాలు జరగాలని కేసీఆర్ తన రాష్ట్ర అధికారులను ఆదేశించడంపై ఏపీ ప్రభుత్వం మండిపడుతోంది.
కేసీఆర్ చెప్పేది చట్టం కాదని గుర్తించాలని రాయలసీమ ఉద్యమకారులు అంటున్నారు. 811 టీఎంసీల నికర జలాల్లో చెరో 405.5 టీఎంసీలను ఉపయోగించుకోవాలని తెలంగాణ కోరుకోవడం అత్యాశ అని తప్పు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ సర్కార్‌కు సుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో అన్నీ చేస్తామని తెలిపారు.
ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోం అని స్పష్టం చేశారు. జల వివాదంపై ఇప్పటికే అందరికీ లేఖలు రాశామని చెప్పారు. కేంద్రం కూడా మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతాం అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతామన్నారు.
రెచ్చగొడితే రెచ్చిపోమని సందర్భోచితంగా స్పందిస్తామని సజ్జల స్పష్టం చేశారు. హూంకరించాల్సిన అవసరం లేదన్నారు. కృష్ణా జలాల విషయంలో సమస్య పరిష్కారం కోసం మాట్లాడాలని ఆయన సూచించారు. ఈ వివాదం రెండు దేశాల మధ్య కాదని.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యేనన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తానుగా నీళ్ల పంపకాలు చేస్తానని, అందుకు తగ్గట్టు తన అధికారులకు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో, సజ్జల రామకృష్ణారెడ్డి వారి పేరు ఎత్తకుండా ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా మాటల తూటాలు పేల్చారనే అభిప్రాయాలు వ్యక్తం చేశారు.