ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి దూకుడు రాష్ట్రంలో టీడీపీకే కాదు, కేంద్రంలో ఎన్డీఏకి కూడా కంటగింపుగా మారింది. అందుకే మెల్లగా జగన్ పై విమర్శనాస్త్రాలను సంధించాలని చూస్తోంది కమలదళం. వాస్తవానికి ఏపీలో చంద్రబాబు చావుదెబ్బ తినడం బీజేపీకి సంతోషకరమైన విషయమే. అదే సమయంలో జగన్ తిరుగులేని మెజార్టీతో సూపర్ హీరోగా అవతరించడంతో బీజేపీకి చిక్కొచ్చిపడింది.
ఐదుగురు ఎంపీలతో రాజీనామా చేసి బీజేపీని గడగడలాడించిన చరిత్ర జగన్ ది. అలాంటిది 22మంది ఎంపీలు లోక్ సభలో ఒకే గొంతుతో ప్రత్యేకహోదా నినాదం చేస్తే ఎలా ఉంటుంది? వీరికి మద్దతుగా టీఆర్ఎస్ ఎంపీలు కూడా జతకలిస్తే పరిస్థితి ఏంటి? సభ ఆటంకం లేకుండా జరగగలదా..? సస్పెన్షన్లతో ఎంపీలను అడ్డుకుంటే ఏపీలో కాంగ్రెస్ లాగే, బీజేపీ కూడా తమకి తామే సమాధికట్టుకున్నట్టు అవుతుంది. అందుకే ప్రధాని మోదీ సహా.. కమలదళం జగన్ ని చూసి టెన్షన్లో పడ్డారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. జగన్ దూకుడు చూస్తుంటే.. పార్లమెంట్ తొలి సమావేశాల్లోనే ఏపీ ప్రత్యేకహోదా కోసం పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. జగన్ ని బుజ్జగించలేరు, ప్రత్యేకహోదా అంశాన్నుంచి తప్పించుకోనూ లేరు. చంద్రబాబు లాంటి స్వార్థపరులు సీఎంగా ఉంటే.. బీజేపీ ఎలాగోలా మేనేజ్ చేసేది. హోదాకంటే ప్యాకేజీయే గొప్ప అని చెప్పించుకునేది. కానీ ఇక్కడున్నది జగన్. హోదా మినహా ఇంకేం చెప్పినా వినేది లేదని భీష్మించుకు కూర్చునే రకం.
అందుకే ఏపీ విషయంలో కేంద్రం పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. దీనికితోడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తే మాకేం అభ్యంతరం లేదని ప్రకటించడంతో బీజేపీకి ఈ విషయం సవాల్ గా మారింది. దీనికితోడు రాబోయే ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో బీజేపీని విస్తరించాలని టార్గెట్ గా పెట్టుకున్నారు పెద్దలు. అలా చేయాలంటే ఆఖరి నిమిషంలోనైనా ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే. కానీ అప్పటివరకు జగన్ ఆగేలా కనిపించడం లేదు. దేశంమొత్తం బీజేపీ క్లీన్ స్వీప్ చేసినా, ఏపీ మాత్రం పార్లమెంట్ లో కమలానికి చుక్కలు చూపించడం ఖాయం.