వైసీపీ యాక్షన్ – టీడీపీ ఓవరాక్షన్

భూమి గురించి తెలిసిన వారికే విలువ ఏంటో అర్ధమవుతుంది. ఏది ఎంత విస్తరించినా భూమి మాత్రం పెరగదు, అది అలాగే ఉంటుంది. మారుతున్న కాలానికి తగినట్లుగా భూముల విలువ పెరిగి నయా జమీందార్లు అయిపోవచ్చు.…

భూమి గురించి తెలిసిన వారికే విలువ ఏంటో అర్ధమవుతుంది. ఏది ఎంత విస్తరించినా భూమి మాత్రం పెరగదు, అది అలాగే ఉంటుంది. మారుతున్న కాలానికి తగినట్లుగా భూముల విలువ పెరిగి నయా జమీందార్లు అయిపోవచ్చు. అందుకే అధికారంలో ఉన్న వారు కానీ, ఆ పలుకుబడిని ఉపయోగించుకునే వారు కానీ భూముల మీదనే పడిపోతారు. 

విశాఖలో భూ దందా ఏళ్లకు ఏళ్లుగా సాగుతోంది. నిజానికి ఈ అక్రమాల మీద వైసీపీ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటున్నారు కానీ ఇవి నాలుగేళ్ల క్రితమే బయటపడ్డాయి. తెలుగుదేశం ఏలుబడిలోనే విశాఖలో పెద్ద ఎత్తున భూములు కబ్జాకు గురి అయ్యాయని ఆ ప్రభుత్వంలోనే మంత్రిగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఆయన ఆరోపణలు కూడా నాడు సొంత పార్టీ నేతల మీదనే ఉన్నాయని చెబుతారు. 

ఇక నాడు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్‌రాజు కూడా విశాఖలో భూములు పెద్ద ఎత్తున ఆక్రమణలకు గురి అవుతున్నాయని వాపోయారు. దీని మీద టీడీపీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు నాడు విశాఖలో పెద్ద ఎత్తున ఉద్యమించాయి. నాడు విపక్ష నేత వైఎస్ జగన్ విశాఖ వచ్చి మరీ భూ దందాల మీద భారీ బహిరంగ సభను నిర్వహించి చంద్రబాబు సర్కార్ మీద యుద్ధమే ప్రకటించారు. 

మొత్తానికి చంద్రబాబు ప్రభుత్వం నాడు సిట్ పేరిట ఓ విచారణ తూతూ మంత్రంగా జరిపించి ఆ నివేదికను బయట పెట్టకుండానే అధికారం నుంచి తప్పుకుంది. తాము అధికారంలోకి వస్తే అంగుళం జాగా కూడా కబ్జా కాకుండా కాపాడుతామని, భూ ఆక్రమణలు చేసిన వారి నుంచి వెనక్కు తీసుకుంటామని, కఠిన చర్యలు కూడా ఉంటాయని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు.

ఇక వైసీపీ ప్రభుత్వం విశాఖను రాజధాని నగరంగా ప్రకటించింది. దాంతో విశాఖలో అణువణువూ గాలించేందుకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. రాజధానిని ప్రభుత్వ స్ధలాలలోనే ఏర్పాటుచేస్తామని సెంట్ జాగా కూడా ప్రైవేటుగా కొనే ప్రసేక్త లేదని మంత్రి అవంతి శ్రీనివాసరావు సహా వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. మరి చూస్తే విశాఖలో ప్రభుత్వ స్ధలాలు ఎక్కడ ఉన్నాయి. 

చక్కగా రెవిన్యూ రికార్డులలో మాత్రం కనిపిస్తున్నాయి, కానీ గ్రౌండ్ లెవెల్‌లో మాత్రం అవి అన్యాక్రాంతమైపోయాయి. ఏనాడో వాటి మీద హక్కుభుక్తాలను వదిలేసుకుని అధికారులు సైతం చోద్యం చూస్తున్న పరిస్థితి ఉంది. దాంతో వైసీపీ జేసీబీలు అక్రమ భూముల మీదకు జోరుగా వెళ్లడంతోనే విశాఖరో రాజకీయ కాక రాజుకుంది. 

తెలుగుదేశం పాలనలో చాలామంది భూములను కబ్జా చేశారని, ఆ వివరాలు అన్నీ కూడా సిట్ నివేదికలో ఉన్నాయని మంత్రి అవంతి చెబుతున్నారు. నివేదిక ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరి వద్ద కూడా ప్రభుత్వ భూమి ఉండడానికి వీలులేదని ఆయన అంటున్నారు. మరో వైపు చూసుకుంటే విశాఖలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదంతా కక్ష సాధింపు చర్యలుగా పేర్కొంటూ యాగీ చేస్తున్నారు. 

అధికారం ఉందన్న అహంకారంతో తమ మీద రాజకీయ దాడులు చేస్తున్నారని వారు అంటున్నారు. చిత్రమేంటి అంటే తెలుగుదేశం నాయకుల వాదనలకు జనంలో మద్దతు లేకుండా పోతోంది, అదే విధంగా మేధావులు, ప్రజా సంఘాలు కూడా విశాఖలో పెద్ద ఎత్తున భూములు కబ్జా అయ్యాయని బలంగా నమ్ముతున్నారు. విశాఖలో దాదాపుగా అయిదు నుంచి పది వేల ఎకరాల విలువైన భూములు కబ్జాకు గురి అయ్యాయని అంటున్నారు. 

విశాఖకు రాజధాని తరలివస్తుందని చెబుతున్న వైసీపీ సర్కార్ కబ్జా కోరుల నుంచి భూములను ముందు తీసుకోవాలని కూడా పలువురు కోరుతున్నారు. కబ్జాకు గురి అయిన భూములను ప్రభుత్వం తీసుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదని సీపీఎం అంటోంది. నిజానికి ఆ పార్టీ 2017లో కబ్జా భూముల మీద పెద్ద ఎత్తున విశాఖలో ఆందోళనలు నిర్వహించింది. 

విశాఖలో లక్ష కోట్ల రూపాయల విలువ చేసే భూములు కబ్జాకు గురి అయ్యాయని సీపీఎం నాయకుడు సిహెచ్ నరసింగరావు చెబుతున్నారు. వాటి వివరాలు అన్నీ కూడా అధికారుల వద్ద ఉన్నాయని, ప్రభుత్వం చిత్తశుద్ధితో భూ కబ్జాలను వెలికి తీస్తే ప్రజలు కూడా హర్షిస్తారని కూడా ఆయన అంటున్నారు. రాజకీయాలకు అతీతంగా వారూ వీరూ తేడా లేకుండా భూములను స్వాహా చేసిన వారి పని పట్టాలని కూడా డిమాండు వస్తోంది. దీని మీద వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. 

తమ ప్రభుత్వానికి తరతమ భేదాలు లేనే లేవని, ఎవరు కబ్జాకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని అంటున్నారు. ఇక గత ఏడాదిగా వరసపెట్టి తెలుగుదేశం నాయకుల భూ కబ్జాలను వెలికితీయడంలో వైసీపీ సర్కార్ విజయం సాధించింది. అదే సమయంలో తెలుగుదేశం నాయకులు ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అంటూ పెట్టిన ఏడుపులు, పెడబొబ్బలకు మాత్రం సాటి రాజకీయ పక్షాల నుంచి కూడా మద్దతు కరవు అయింది. 

అంతే కాదు, సీపీఎం లాంటి పార్టీలు కబ్జాలలో చిక్కుకున్న భూములను వెనక్కు తీసుకోమంటున్నారు. దాంతో ప్రతిపక్ష తెలుగుదేశానికి నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. విశాఖ అర్బన్ జిల్లాలోని పది మండలాలలో భూములను పెద్ద ఎత్తున రాజకీయ పలుకుబడితో కాజేశారన్న నివేదికలు ఉన్నాయి. దీనికి సంబంధించి గత తెలుగుదేశం ప్రభుత్వమే ఇద్దరు తాశీల్దార్లు, ముగ్గురు సర్వేయర్ల మీద నాడు చర్యలు తీసుకుంది. 

విశాఖ, భీమిలీ, గాజువాక, అనకాపల్లిలలో విలువైన భూములను మింగేశారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక, సింహాచలం దేవస్ధానం భూములతో పాటు, ప్రభుత్వ డి ఫారం పట్టా భూములు కూడా రాజకీయ కామందులు మేసేశారు అన్న నివేదికలు ఉన్నాయి. ఈ వివరాలు మొత్తం ప్రభుత్వం దగ్గర ఉండడంతోనే  అసలైన సినిమా ముందుంది అంటున్నారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. 

నిజానికి ఇప్పటిదాకా ప్రభుత్వం తీసుకున్న చర్యలు స్వల్పమే, రానున్న రోజులలో పెద్ద ఎత్తున భూ ఆపరేషన్ విశాఖలో జరిగితే వేలాది ఎకరాలు ప్రభుత్వ ఖాతాకు వచ్చి చేరుతాయని అంటున్నారు. అదే జరిగితే అసలైన రాజకీయ యుద్ధమే విశాఖలో చూడాల్సి ఉంటుందన్నది వాస్తవం.