ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెడుతూ ఏపీ సర్కార్ తీసుకొచ్చిన 81, 85 జీవోలను హైకోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
“ఇంగ్లీషు మీడియం జీవోలు రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం. 19(1)జీ అధికరణ ఉల్లంఘనే.. విద్యాహక్కు చట్టానికి కట్టుబడాల్సిందే. మాధ్యమం ఎంపిక విద్యార్థి హక్కు.. ఆ హక్కు తల్లిదండ్రులకూ ఉంది. రాష్ట్ర విద్యా చట్టం ప్రకారం మాతృభాషలోనే విద్యాబోధన. బిల్లును రాష్ట్రపతి ఆమోదించకముందే ఉత్తర్వులు సరికాదు” అని వ్యాఖ్యానించింది.
హైకోర్టు వ్యాఖ్యలను కాసేపు పక్కన పెడదాం. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఆంగ్ల విద్యను అందించాలన్న జగన్ సర్కార్ ఆశయాన్ని కూడా కాసేపు పక్కన పెడదాం. జగన్ సర్కార్ ఆలోచనల్లోని మంచీచెడుల గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఆంగ్ల మాధ్యమంపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు కొట్టి వేసిన నేపథ్యంలో, జనతా కర్ఫ్యూ నాడు చంద్రబాబు ఏం చేశాడనే విషయమై ఎల్లో మీడియా హైలెట్ చేసిన ఓ చిన్న వార్త గురించి మాట్లాడుకుందాం.
కరోనా వైరస్ కట్టడికి గత నెల 22న జనతా కర్ఫ్యూ పాటించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఆయన పిలుపుపై గౌరవంతో దేశం యావత్తు ఏకతాటిపై నిలిచింది. ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో కుటుంబ సభ్యులతో గడిపాడు.
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో స్వీయ గృహ నిర్బంధంలో చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు, మాజీమంత్రి నారా లోకేష్, భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, ముద్దుల మనవడు దేవాన్ష్ ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన మనవడు నారా దేవాన్ష్‌తో ఆడుకుంటూ సరదాగా గడిపాడు.
ఇక్కడే అసలు ట్విస్ట్…దేవాన్ష్‌కు ఆంగ్ల పాఠాలు చెబుతూ చంద్రబాబు ఓ వీడియోను విడుదల చేశాడు. జనతా కర్ఫ్యూలో “టీచర్ అవతారమెత్తిన బాబు” అంటూ ఎప్పట్లాగే ఎల్లో మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ వీడియోలో ఇంగ్లీష్‌లో పాఠ్యపుస్తకాన్ని చదవి వినిపించి, దాని అర్థం ఏమిటో వివరించాలని దేవాన్ష్‌ను బాబు ప్రశ్నించడం కనిపించింది. అంతేకాదు, ఇంగ్లీష్‌లో ఉన్న దానికి తెలుగులో బాబు అర్థం చెబుతూ మనవడికి విద్యాబుద్ధులు నేర్పడం ముచ్చటేసింది.
ఇందులో తప్పు పట్టాల్సిన అంశం ఏమీ లేదు. పైపెచ్చు తీరిక చేసుకుని మనవడి భవిష్యత్ కోసం చదువు నేర్పడం అభినందనయం. మరి బడుగు, బలహీన వర్గాలు, ఇతర ప్రజానీకం విషయానికి వస్తే మాత్రం చంద్రబాబు అండ్ కోకు ఎందుకు అసూయ అనేదే పెద్ద ప్రశ్నగా మిగిలింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంటే…బాబు, ఆయన అనుచరులు ఎందుకు పదేపదే అడ్డుకుంటున్నారు. ఈ అడ్డుకోవడం అనేది ప్రత్యక్షంగా, పరోక్షంగా…ఏ విధంగానైనా కావచ్చు. మనవడికి మాత్రం ఆంగ్ల పాఠాలు…మందికి మాత్రం తెలుగు పాఠాలా? ఇదేనా బాబు 40 ఏళ్ల రాజకీయ రాజనీతి? ఇది తగునా బాబూ? అని ప్రజానీకం ప్రశ్నిస్తోంది, నిలదీస్తోంది.
-సొదుం