పాక్ క్రికెట్ బోర్డు.. కరోనా రాజకీయం

భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరిగితే నిర్వాహకులకు పండగే. స్పాన్సర్స్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు, రెండు దేశాల ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు కాబట్టి రేటింగ్ కి దిగులే ఉండదు. దాయాది పోరు…

భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరిగితే నిర్వాహకులకు పండగే. స్పాన్సర్స్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు, రెండు దేశాల ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు కాబట్టి రేటింగ్ కి దిగులే ఉండదు. దాయాది పోరు జరిగితే రెండు దేశాల క్రికెట్ బోర్డులకు కాసుల వర్షం కురుస్తుంది. అయితే 2007 తర్వాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ ఇంతవరకు జరగలేదు. టెర్రరిస్ట్ దాడుల నేపథ్యంలో ఎప్పటికప్పుడు భారత్-పాక్ క్రికెట్ సిరీస్ లు వాయిదా పడుతూనే ఉన్నాయి.

ప్రపంచ కప్, ఐసీసీ టోర్నమెంట్ లు, ఇతర దేశాలతో కలసి ఆడే సిరీస్ లు మినహా.. భారత్-పాక్ ప్రత్యేక సిరీస్ లో తలపడలేదు. దీనివల్ల భారత క్రికెట్ బోర్డుకి ఎలాంటి నష్టం లేదు కానీ, పాక్ బోర్డ్ మాత్రం భారత్ తో సిరీస్ లు లేకపోవడంతో కష్టాల్లో పడింది. భారత్ మినహా పాకిస్తాన్ ఏ ఇతర దేశంతో క్రికెట్ ఆడినా కూడా స్థానికులు పెద్దగా ఇష్టపడరు, స్పాన్సర్స్ ఉండరు. అటు పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా అట్టర్ ఫ్లాప్ కావడంతో.. పాక్ క్రికెట్ బోర్డ్ కష్టాల్లోనే ఉంది.

ఇలాంటి టైమ్ లో కరోనా కష్టకాలం వచ్చింది. దీంతో పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ ఓ ప్రపోజల్ ని భారత్ ముందుంచాడు. భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ లు జరిగితే.. వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని కరోనా నివారణకు ఉపయోగించొచ్చు అని షోయబ్ ఓ ప్రతిపాదన తీసుకొచ్చాడు. ఇలా వచ్చే ఆదాయాన్ని వెంటిలేటర్లు, ఇతర వైద్య పరికరాల కొనుగోలుకి ఉపయోగించొచ్చని అన్నాడు. అయితే అక్తర్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. భారత లెజెండ్రీ క్రికెటర్ కపిల్ దేవ్ ఈ ప్రపోజల్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డాడు.

కరోనా నిధుల కోసం ఆటగాళ్ల ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం భారత్ కు లేదని, మ్యాచ్ లు ఆడకుండానే పాకిస్తాన్ కు వెంటిలేటర్లు ఇచ్చే దాతృత్వం భారత్ కు ఉందని గట్టిగా బదులిచ్చాడు కపిల్. సునీల్ గవాస్కర్ కూడా అంతే ఘాటుగా బదులిచ్చాడు. ఐసీసీ టోర్నీల్లో భారత్ తో తలపడాల్సిందే తప్ప.. సిరీస్ ఆడాలనే కల పాక్ కి ఇప్పుడల్లా నెరవేరదని తేల్చి చెప్పాడు. భారత క్రికెట్ బోర్డు అధికారులు కూడా సిరీస్ జరగదని తేల్చి చెప్పారు.

తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ ఎహ్సాన్ మని ఈ వివాదాన్ని మరింత కొనసాగేలా వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నష్టాల్లో ఉందని, అయితే భారత్ కు ఇష్టం లేకపోతే ద్వైపాక్షిక సిరీస్ లు ఆడే ఆలోచన తమకు కూడా లేదని అన్నారు. గతంలో కూడా పలుసార్లు పాక్ తో మ్యాచ్ లు ఆడతామని చెప్పి చివరి నిమిషంలో భారత్ వెనక్కి తగ్గిందని నిందవేశాడు. భారత్ లేకుండానే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మనుగడ కొనసాగించగలదని ధీమా వ్యక్తం చేశారు.

ఒకరకంగా భారత్ పై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాడు ఎహ్సాన్ మని. కరోనాని అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లకు పాకులాడటం మరీ చీప్ గా ఉన్నా.. కష్టాల్లో నుంచి బైటపడటానికి వారికి మరో మార్గం కనిపించడంలేదు. 

జగన్ గారే దేశంలో నెం.1 ముఖ్యమంత్రి