క్రికెట్ చరిత్రలో ఐసీసీ తొలిసారి నిర్వహిస్తున్న వరల్డ్ టెస్ట్ చాంఫియన్‌షిప్ విజయవంతంగా ముగిసేలా లేదు! ఆది నుంచి పలు విమర్శలు ఎదుర్కొన్న ఈ టోర్నీ నిర్వహణ.. ఆఖరి దశలో అనాసక్తిగా మారింది. ప్రత్యేకించి డబ్ల్యూటీసీ ఫైనల్ కు వర్షం ఆటంకంగా మారింది. ఇప్పటికే నాలుగు రోజుల ఆట ముగియగా.. అందులో రెండు రోజుల వ్యవధి సమయం కూడా మ్యాచ్ జరగలేదు!
ఇండియా తొలి ఇన్నింగ్స్ ముగియగా, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించి 50 ఓవర్ల ఆటను కూడా కొనసాగించలేకపోయింది. నిన్నంతా వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడలేదు. దీంతో నాలుగు రోజుల ఆట ముగిసింది. మ్యాచ్ కీలకమైన దశలో ఉండగా కురిసిన వర్షంతో కొనసాగని పరిస్థితి ఏర్పడింది.
ఇక ఐదో రోజు వర్షం ఆటంకం ఉండదని ప్రకటనలు వస్తున్నాయి. ఐదో రోజు అనంతరం కూడా రిజర్వ్ డే ఉంటుంది. స్థూలంగా ఇక రెండు రోజుల ఆట మిగిలి ఉంది. మినిమం 180 ఓవర్ల బౌలింగ్ కు అవకాశం ఉంది. అది కూడా వరుణుడి మీదే ఆధారపడి ఉందని వేరే చెప్పనక్కర్లేదు.
ఇప్పటి వరకూ రెండు జట్ల తొలి ఇన్నింగ్స్ లు అయిపోలేదు. బౌలర్లు అద్భుతాలు చేస్తే తప్ప మిగిలిన రెండు రోజుల్లో ఈ టెస్టు ఫలితం తేలే అవకాశం లేదు. న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ చాలా నిదానంగా ఆడుతున్నారు.
ఓవర్ కు రెండు పరుగుల స్థాయి రన్ రేట్ తో వారు చాలా డిఫెన్సివ్ మోడ్ లో ఆడుతున్నారు. ఈ మందగమనం ఫలితంగా.. ఈ టెస్టు ఫలితం వచ్చే అవకాశాలు మరింత తగ్గిపోతున్నాయి.