ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికతో తను రాజకీయాల్లోకి రాలేదని పదే పదే చెబుతుంటారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రాజకీయాల్లో మార్పుకోసం, ప్రజల్లో చైతన్యం కోసం మాత్రమే పార్టీ పెట్టానని, పాతికేళ్ల భవిష్యత్ ప్రణాళికతో రాజకీయాల్లోకి వచ్చానని అంటుంటారు. తనకు చాలా టైమ్ ఉందని, ప్రతి కార్యకర్తను నాయకుడిగా తయారుచేస్తానని గతంలో అన్నారు. ఎన్నికల సమయంలో ఇన్ని మాటలు చెప్పిన పవన్, పాతికేళ్లు కాకపోయినా ఈ ఐదేళ్లు నిరీక్షించగలరా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న.
ఎన్నికలు ఫలితాలు రాకపోయినా జనసేన స్థానం ఏంటో అందరికీ తెలుసు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ కు కూడా క్లారిటీ ఉంది. తన పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదనే విషయం జనసైనికులతో పాటు జనసేనానికి ఇప్పటికే అర్థమైంది. మరి పవన్ ఇప్పుడేం చేస్తారు? మరో ఐదేళ్ల పాటు నిరీక్షిస్తారా? లేక తిరిగి సినిమాలు చేసుకుంటారా?
తనకు సినిమాలంటే ఇష్టంలేదని, పూర్తిస్థాయిలో రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్పుకుంటున్న పవన్, రాబోయే ఐదేళ్లు ఎలా గడుపుతారో చూడాలి. సినిమాలు చేయకుండా కేవలం ప్రజాక్షేత్రంలోనే పవన్ ఐదేళ్లు కొనసాగాలి. ప్రతిరోజు ప్రజల మధ్య ఉండాలి. వాళ్ల సమస్యలు తెలుసుకోవాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇన్నాళ్లూ జగన్ చేసింది ఇదే. మరి ఇదే పనిని పవన్ చేయగలడా?
ఇప్పటికే పార్ట్ టైమ్ పొలిటీషియన్ అనే పేరు వచ్చేసింది. 10 రోజులు జనాల్లో తిరిగితే 4 రోజులు ఎవరికీ కనిపించకుండా వెళ్లిపోతారనే బ్యాడ్ రిమార్క్ ఉంది. దీనికితోడు మరోసారి సినిమాల్లోకి వెళ్లే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ నుంచి గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. అదే కనుక జరిగితే పవన్ పై ప్రజల్లో ఉన్న ఆ కొద్దిపాటి విశ్వాసం కూడా పోతుంది.
సో.. పవన్ ఈ ఐదేళ్లు ఏం చేశారన్నది అప్రస్తుతం. రాబోయే ఐదేళ్లు ఎలా ఉంటారనేది చాలా ముఖ్యం. దానిపైనే జనసేన భవిష్యత్తు ఆధారపడి ఉంది. మరి పాతికేళ్ల సుదీర్ఘ ప్రణాళికతో వచ్చానని చెబుతున్న పవన్, ఈ ఐదేళ్లు పక్కచూపులు చూడకుండా ఉండగలరా? టీడీపీతో మరోసారి కలిసిపోకుండా, సినిమా రంగంవైపు వెళ్లకుండా ప్రజాక్షేత్రంలోనే కొనసాగగలరా?