కోత గ్యారెంటీ: కావాల్సింది కూడా అదే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనకు సంబంధించి బుధవారం ఒక కొత్త పరిణామం జరగబోతుంది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించ తలచుకుంటే… అందులో చర్చించవలసిన విషయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్క్రీనింగ్ చేసి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనకు సంబంధించి బుధవారం ఒక కొత్త పరిణామం జరగబోతుంది. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించ తలచుకుంటే… అందులో చర్చించవలసిన విషయాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్క్రీనింగ్ చేసి ఏవి చర్చార్హం ఏవికాదు తెలియ చెప్పబోతున్నారు. రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ద్వారా జరుగుతున్న పాలన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతనెల రోజులుగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదే పదే ఆయన నిర్ణయాలను తప్పు పడుతున్నారు.

ఎన్నికల కమిషన్ అధికారాలను ప్రశ్నిస్తున్నారు. ఈసీ అనేది కేంద్ర ప్రభుత్వం వ్యవహారాలలో ఒక తీరుగా… రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాలలో మరో తీరుగా వ్యవహరిస్తున్నదని.. వారికి పక్షపాత వైఖరిని అంటగట్టడానికి నానాపాట్లు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తాజాగా చంద్రబాబు ప్రభుత్వం నిర్వహించగల చేసుకున్న కేబినెట్ సమావేశం మరోసారి చర్చకు దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. ఈసీ అనుమతి లేకుండా ఏపీ ప్రభుత్వం కేబినెట్ సమావేశం నిర్వహించడానికి వీల్లేదని చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం స్పష్టంచేసిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం తలొగ్గక తప్పలేదు.

చీఫ్ సెక్రటరీ సూచించిన పద్ధతిలోనూ కేబినెట్ సమావేశానికి రూపొందించిన ఆయన పరిశీలనకు పంపారు. ఈనెల 23 తర్వాత ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంటుందో ఏమో.. తన పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో… అనే సంశయంలో కొట్టుమిట్టాడుతున్న చంద్రబాబు నాయుడు… తాను ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే మహాద్భుతమైన నాయకుడిగా కీర్తిగడించడానికి చివరి కేబినెట్ సమావేశంగా దీనిని భావిస్తున్నారు. ఇందులో అనేకానేక కీలక, సంక్షేమ నిర్ణయాలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసుకుని ఉంటే ఆశ్చర్యంలేదు.

అయితే విపత్తు నిర్వహణ, అత్యవసర నిర్ణయాల విషయంలో తప్ప సాధారణ పరిపాలనకు సంబంధించిన అంశాలు కేబినెట్ అజెండాలో ఉంటే వాటిని చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు. పర్యవసానంగా తాను సంక్షేమ నిర్ణయాలు తీసుకోదలచుకుంటే చీఫ్ సెక్రటరీ వాటికి అడ్డం పడుతున్నాడు… అని చంద్రబాబునాయుడు గొడవ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో చీఫ్ సెక్రటరీకి ముడిపెట్టిన చంద్రబాబు నాయుడు తాను సంకల్పించిన సంక్షేమ పథకాలకు జగన్మోహన్ రెడ్డి అడ్డం పడుతున్నాడు అంటూ తేల్చేయవచ్చు.

మరోరకంగా చెప్పాలంటే రోగి కోరుకున్నదే వైద్యుడు అందించాడని అనవచ్చు. చంద్రబాబు నాయుడుకు సంక్షేమం కంటే… కేబినెట్ సమావేశం రచ్చరచ్చ కావడమే ప్రధానం అని కొందరు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే చీఫ్ సెక్రటరీ తన పనికి అడ్డం పడుతున్నారంటూ ప్రజల దృష్టిలో సానుభూతి సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడు, కేబినెట్ సమావేశం ఎజెండాలో కొత్తగా కోతలు పడితే గనుక ఆ విషయాన్ని రాద్ధాంతంగా మార్చడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు.

పార్టీల ప్రభుత్వాల భవితవ్యం తేలడానికి మహా అయితే పదిరోజుల వ్యవధి మాత్రమే ఉన్న నేపథ్యంలో కూడా… ఇంతగా ప్రతి అంశాన్ని పొలిటికల్ మైలేజీ కోసం మలుపులు తిప్పడం అనేది చంద్రబాబు నాయుడుకు మాత్రమే చేతనైన విద్య అని పలువురు భావిస్తున్నారు.

వర్మపై అంత దాష్టికం అవసరమా బాబు