ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అని సామెత! సాక్షాత్తూ ప్రభుత్వాధినేత అర్థం పర్థంలేని విశ్లేషణలు వినిపిస్తూ.. ఇతరుల మీద నిందలు వేసేసి పబ్బం గడుపుకోవాలని చూస్తోంటే.. ఆయన అనుచరులు కూడా అదే బాటలోనే చెలరేగిపోవడం చాలా సహజం. ప్రస్తుతం తెలంగాణలో అదే పరిస్థితి కనిపిస్తోంది.
అంతర్జాతీయ కుట్ర జరిగి క్లౌడ్ బరస్ట్ ద్వారా తెలంగాణలోనే వర్షాలు కురిసే దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ వ్యాఖ్యానించి నవ్వుల పాలు అయి, కొన్ని వారాలు కూడా గడవక ముందే.. మరో తెలంగాణ మంత్రి.. అంతకంటె చిత్రమైన వ్యాఖ్యలు చేసి నవ్వులపాలు కావడంలో తానేం తక్కువ తినలేదని నిరూపించే ప్రయత్నంలో ఉన్నాడు.
తెలంగాణ లో కురిసిన భారీ వర్షాలకు భద్రాచలం ప్రాంతం నీటమునిగిపోతే.. అదంతా కేవలం పోలవరం డ్యాం నిర్మాణం ఎత్తు పెంచడం వల్లనే జరుగుతున్నదంటూ వ్యాఖ్యానించి.. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొత్త కామెడీ ఎపిసోడ్ కు శ్రీకారం చుట్టారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఖమ్మం జిల్లాకే చెందిన మంత్రి. ఆయన నిత్యం అనేక వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు. మొత్తానికి కేసీఆర్ ను విపరీతంగా పొగుడుతూ మంత్రి పదవిని మాత్రం కాపాడుకుంటూనే వస్తున్నారు. అలాంటి పువ్వాడ ఇప్పుడు పోలవరం ఎత్తు గురించి విలపిస్తున్నారు.
భద్రాచలం ప్రాంతంలో వరదతీవ్రత పెరగడానికి.. పోలవరం మీద నిందలు వేస్తున్నారు. విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. పోలవరం డ్యాం పూర్తయితే.. భద్రాచలంలో నిత్యం 45 అడుగుల మేర వరద ఉంటుందని కొత్త భయాలు సృష్టిస్తున్నారు. భద్రాచలంలో రాముడు మునిగిపోకుండా చూడాల్సిన బాధ్యత.. ఏపీ ప్రభుత్వానికి కూడా ఉన్నదని సుద్దులు చెబుతున్నారు.
భద్రాచలం దెబ్బతినడానికి సంబంధించి నిందలన్నీ ఏపీ ప్రభుత్వం మీదికి నెట్టేస్తే.. ప్రజలను ఆ రకంగా మభ్యపెట్టగలిగితే.. కేసీఆర్ సర్కారు తనను ప్రత్యేకమైన ప్రేమతో ఆదరిస్తుందనే అపోహలతో మంత్రి పువ్వాడ బతుకుతున్నట్టుగా కనిపిస్తోంది.
మంత్రి పువ్వాడకు ఏపీ మంత్రులు బొత్స, అంబటి రాంబాబు.. ఘాటైన కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏడు మండలాలను తిరిగి అడుగుతున్న పువ్వాడ.. హైదరాబాదు నగరాన్ని తిరిగి ఏపీకి ఇచ్చేందుకు ఓకేనా.. అని ఏపీ మంత్రులు అడిగారు.
హైదరాబాదును అడగడం అర్థరహితం అని ఆయనకు అనిపిస్తోంది. హైదరాబాదు నగరం తెలంగాణకు ఏ రకంగా వెన్నెముక లాంటిదో.. ఆంధ్రపదేశ్ రాష్ట్రానికి పోలవరం కూడా అలాంటిదే. కొన్ని లక్షల జీవితాలను బాగుచేసే ప్రాజెక్టు అది. పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు దక్కకుండా , వాటికి విఘాతం కలిగించేలాగా ఏడు మండలాలు కావాలని పువ్వాడ అడిగితే.. ఆ నష్టానికి భర్తీగా వారు హైదరాబాదును అడగడం తప్పేం కాదు.
వరద విపత్తు నిర్వహణ తమకు చేతకాక ఏపీ మీద, పోలవరం మీద పడి ఏడవడాన్ని పువ్వాడ మానుకోవాలి. లేకుంటే ఆయన పరువు మరింత పోతుంది.