రఘురామ నోటికి ‘సుప్రీం’ తాళం

తీర్పు ఎప్పుడైనా ఒకరికి అనుకూలంగా వస్తుంది. మరొకరికి వ్యతిరేకంగా వస్తుంది. కానీ రఘురామ కృష్ణంరాజు కేసుకు సంబంధించి మాత్రం తీర్పు ఇరుపక్షాలకు అనుకూలంగా వచ్చింది. అటు రఘురామ హ్యాపీ, ఇటు ఏపీ సర్కారు కూడా…

తీర్పు ఎప్పుడైనా ఒకరికి అనుకూలంగా వస్తుంది. మరొకరికి వ్యతిరేకంగా వస్తుంది. కానీ రఘురామ కృష్ణంరాజు కేసుకు సంబంధించి మాత్రం తీర్పు ఇరుపక్షాలకు అనుకూలంగా వచ్చింది. అటు రఘురామ హ్యాపీ, ఇటు ఏపీ సర్కారు కూడా హ్యాపీ.

పలు అభియోగాల పైన అరెస్టైన రఘురామ కృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఎంపీ స్థాయి వ్యక్తిని కస్టడీలోకి తీసుకొని మరీ ప్రశ్నించేంత పెద్ద కేసు కాదని అత్యున్నత ధర్మాసనం అభిప్రాయపడింది. మరీ ముఖ్యంగా మెడికల్ రిపోర్టు పరిశీలించిన తర్వాత, రఘురామ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అతడికి బెయిల్ ఇవ్వడమే సమంజసమని తేల్చింది.

మరోవైపు ఇదే కేసులో ఏపీ ప్రభుత్వానికి ఊరట కలిగించే తీర్పు కూడా వెలువడింది. రఘురామకు బెయిల్ ఇచ్చిన సుప్రీంకోర్టు.. అతడి నోటికి తాళం వేసింది. ఏ తరహా మీడియాలో ఆయన మాట్లాడకూడదని ఆదేశించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియానే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా రఘురామ మాట్లాడ్డానికి వీల్లేదని తేల్చిచెప్పింది.

తాజా ఘటనతో ఎల్లో మీడియా ఖంగుతింది. రఘురామకు బెయిల్ రావడం ఖాయమనే విషయం అందరికీ తెలుసు. ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. ఎల్లో మీడియా కూడా దీనికోసమే ఎదురుచూసింది. రఘురామ బయటకొచ్చిన తర్వాత జగన్ సర్కార్ పై మరింత బురదజల్లేందుకు కథనాలు, స్క్రిప్టులు, స్క్రీన్ ప్లేలు రెడీ చేసి పెట్టుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతో పరోక్షంగా ఎల్లో మీడియా నోటికి కూడా తాళం పడినట్టయింది.

మరోవైపు ప్రభుత్వానికి ఊరటనిచ్చేలా మరో వెసులుబాటు కూడా కల్పించింది కోర్టు. రఘురామకు ప్రస్తుతానికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ, ఆయన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు విచారించుకోవచ్చని చెప్పింది. కాకపోతే ఒక రోజు ముందు నోటీసుచ్చి, లాయర్ సమక్షంలో ఎంక్వయిరీ చేసుకోవచ్చని చెప్పింది.

ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన నివేదికపై కూడా అత్యున్నత ధర్మాసనం నర్మగర్భంగా వ్యాఖ్యలు చేసింది. రఘురామకు గాయాలున్న మాట వాస్తవమేనని, హాస్పిటల్ రిపోర్ట్ తో ఏకీభవిస్తున్నామని తెలిపిన కోర్టు.. ఆ దెబ్బలు ఎలా తగియాలో, ఎన్ని రోజుల కిందట తగిలాయో రిపోర్ట్ లో లేవని చెప్పింది.  

సుప్రీం తాజా తీర్పుతో అటు రఘురామ నోటికి తాళం పడ్డంతో పాటు, ఈ విషయంలో ప్రభుత్వ దూకుడు కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది. ఇకపై ఆయన ప్రభుత్వంపై, జగన్ పై నోటికొచ్చినట్టు చెత్త వాగుడు వాగలేరు.