ఇప్పటికే కరోనాకు విరుగుడుగా 2డీజీ డ్రగ్ తో సంచలనం సృష్టించింది డీఆర్డీవో. ఇప్పుడీ సంస్థ నుంచి మరో ఆవిష్కరణ వచ్చింది. కరోనా కేసుల్లో కీలకంగా భావిస్తున్న యాంటీ బాడీస్ కు సంబంధించి కొత్త కిట్ ను కనుగొంది డీఆర్డీవో.
కరోనా చికిత్సలో యాంటీబాడీస్ అత్యంత కీలకమనే విషయం తెలిసిందే. శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటే కరోనా తొందరగా తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఎక్కువ రోజులు ఇబ్బంది పెడుతుంది. ఈ క్రమంలో ఊపిరితిత్తుల్లోకి వైరస్ చేరితే ప్రాణాపాయం కూడా సంభవిస్తున్న సంగతి తెలిసిందే.
డీఆర్డీవో తయారుచేసిన ''డిప్ కొవాన్'' అనే కిట్ శరీరంలో కరోనా వైరస్ తీవ్రతను కనిబెడుతుంది. వైరస్ తీవ్రత స్థాయిని ఇది 97 నుంచి 99 శాతం కచ్చితత్వంలో పసిగట్టినట్టు సైంటిస్టులు చెబుతున్నారు. ఇక శరీరంలో కరోనై వైరస్ ను ఎదుర్కొనే యాంటీ బాడీస్ స్థాయిని కూడా ఇది చెబుతుంది. ఢిల్లీలో వెయ్యి మంది కరోనా రోగులపై పరీక్షలు జరిపి దీని విశ్వసనీయతను నిర్థారించారు.
ఈ టెస్ట్ కేవలం 75 నిమిషాల్లో పూర్తవుతుంది. అంతేకాదు.. శరీరంలో ఇతర రోగాలతో సంబంధం లేకుండా టెస్ట్ ప్రక్రియను పూర్తిచేయవచ్చు. దీని రేటు కూడా అందుబాటులోనే ఉంది. ఒకసారి పరీక్షించుకోవడానికి అయ్యే ఖర్చు 75 రూపాయలు మాత్రమే. ఒక కిట్ తో వంద పరీక్షలు చేయొచ్చు.
డ్రగ్ కంట్రోల్ బోర్డు అనుమతి పొందిన ఈ కిట్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోంది. డీఆర్డీవో తయారుచేసిన ఈ కిట్ ను వాన్ గార్డ్ సంస్థ ఉత్పత్తి చేయబోతోంది. జూన్ నాటికి వంద కిట్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఈ వంద కిట్స్ తో 10వేల పరీక్షలు చేయొచ్చు. ప్రస్తుతం ఈ కంపెనీ నెలకు 500 కిట్స్ వరకు తయారుచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
ఈ కిట్ అందుబాటులోకి వస్తే సీటీ స్కాన్ ఆవశ్యకత తగ్గుతుంది. అలా కరోనా బాధితుడికి వేల రూపాయల ఖర్చు కలిసొస్తుంది. పైగా ఇలా ముందుగానే శరీరంలో యాంటీబాడీస్, కరోనా తీవ్రతను అంచనా వేయగలిగితే.. మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించవచ్చు.