A2 టీవీ5.. A3 ఏబీఎన్

ఎంపీ రఘురామకృష్ణంరాజును ఇన్నాళ్లూ పావుగా వాడుకున్న టీవీ5, ఏబీఎన్ ఛానెళ్లపై సీఐడీ దృష్టి పెట్టింది. రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి, అతడ్ని సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు.. ఆయన చెప్పిన వివరాలు ఆధారంగా ఏ2 గా…

ఎంపీ రఘురామకృష్ణంరాజును ఇన్నాళ్లూ పావుగా వాడుకున్న టీవీ5, ఏబీఎన్ ఛానెళ్లపై సీఐడీ దృష్టి పెట్టింది. రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేసి, అతడ్ని సుదీర్ఘంగా విచారించిన సీబీఐ అధికారులు.. ఆయన చెప్పిన వివరాలు ఆధారంగా ఏ2 గా టీవీ5 ఛానెల్ ను, ఏ3 గా ఏబీఎన్ ఛానెల్ ను చేరుస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.

ఈ రెండు ఛానెళ్లు కలిసి కావాలనే కుట్రపూరితంగా రఘురామకృష్ణంరాజును రెచ్చగొట్టాయని.. ప్రభుత్వంపై వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసేలా ఉసిగొల్పాయని సీఐడీ అధికారులు నిర్థారించారు. రఘురామ విద్వేషపూరిత వ్యాఖ్యల వెనక ఈ రెండు ఛానెళ్లు ఉన్నాయని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఏబీఎన్, టీవీ5 ఛానెళ్లపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

ముఖ్యమంత్రి జగన్ పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రఘురామకృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యల కేసును తాము సుమోటాగా తీసుకున్నామని సీఐడీ అధికారులు ప్రకటించారు. ప్రజల మధ్య విద్వేషాల్ని రెచ్చగొట్టేలా రెబల్ ఎంపీ వ్యాఖ్యలు చేశారని.. రెడ్డి, క్రిస్టియన్ సామాజిక వర్గాల్ని లక్ష్యంగా చేసుకొని వర్గాల మధ్య చిచ్చు రేపడానికి ఆయన ప్రయత్నించారని సీఐడీ పేర్కొంది.

ఈ వ్యాఖ్యల్ని ప్రసారం చేసి ప్రజల్లో అలజడి రేపేందుకు టీవీ5, ఏబీఎన్ ఛానెళ్లు ప్రయత్నించాయని.. ఈ మేరకు రఘురామరాజు నుంచి తీసుకున్న సమాచారం మేరకే ఆ ఛానెళ్లపై కేసులు నమోదు చేసినట్టు అధికారులు స్పష్టంచేశారు. కేవలం వివాదాస్పద వ్యాఖ్యల్ని ప్రసారం చేసేందుకే ఈ ఛానెళ్లు ప్రత్యేకంగా స్లాట్స్ కేటాయించిన విషయాన్ని గుర్తించామన్నారు.

మరోవైపు ఈ అరెస్ట్ కు సంబంధించి దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తయింది.. రఘురామ వేసిన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసింది. బెయిల్ కోసం హైకోర్టు వరకు రావాల్సిన అవసరం లేదని, ముందుగా సెషన్స్ కోర్టుకు వెళ్లాలని సూచించింది. 

కేసు తీవ్రత దృష్ట్యా నేరుగా హైకోర్టుకు వచ్చామంటూ రఘురామ తరఫు లాయర్ వాదించినప్పటికీ.. ఆ వాదనతో హైకోర్టు ఏకీభవించలేదు. హౌజ్ మోషన్ పిటిషన్ ను కొట్టేసింది. సెషన్స్ కోర్టుకు ముందుగా వెళ్లాలని సూచించింది. ఈ మేరకు ఎంపీని సీఐడీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.