బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన పుష్ప ను రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచన చేస్తున్నారు. ఈ విషయం ఆల్రెడీ బయటకు వచ్చేసింది. సినిమాకు కీలక బాధ్యులు ఎవ్వరూ ఈ విషయం మీద పెదవి విప్పలేదు. అసలు ఎందుకు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకన్నారన్నది ప్రశ్న.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం సినిమా షూట్ ఇంకా చాలా అంటే చాలా వుందని తెలుస్తోంది. ఇప్పటి వరకు అయింది చాలా అంటే చాలా తక్కువ అని టాక్. ఎంత తక్కువ అంటే ఆ మధ్య విడుదల చేసిన టీజర్ కట్ కే సీన్లు వెదుక్కోవాల్సి వచ్చిందని బోగట్టా.
కరోనా రెండో ఫేజ్ వ్యాపించడానికి ముందువున్న అంచనా ప్రకారం ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ కు కానీ రెడీ కాదు. అలాంటిది ఇప్పుడు మళ్లీ ఎప్పుడు షూట్ లు ప్రారంభం అవుతాయో? డేట్ లు ఎలా మారుతాయో తెలియదు.
అంటే బన్నీ సినిమా వచ్చి రెండేళ్లు దాటిపోతుంది. అందుకే వీలయినంత త్వరగా ఓ సినిమా విడుదల చేస్తే బెటర్ అన్న ఆలోచనతో ఈ రెండు భాగాల ఐడియాకు తెరతీసారు. ప్రస్తుతం దీని మీద డిస్కషన్లు సాగుతున్నాయి.
సినిమా షెడ్యూళ్లను పార్ట్ వన్, టూ లు మాదరిగా మార్చి, షూటింగ్ జరిపడం పై సాధ్యా సాధ్యాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రెండు భాగాల డెసిషన్ ను డైరక్టర్ సుకుమార్ కు వదిలేసారు. ఆయన ఎలా అంటే అలా ముందుకు వెళ్తారు.