తెలుగుదేశం ఏపీ విభాగం అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఆ పదవి నుంచి తొలగిస్తారా? అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లి.. అనుకోని వీడియోతో వివాదంలో చిక్కుకున్నారు అచ్చెన్న. ఆ వీడియోలో తిరుపతి పోలింగ్ తర్వాత 'పార్టీ లేదూ బొక్కా లేదు..' అని వ్యాఖ్యానించి పార్టీపై తన ఉద్దేశాన్ని ఆయన అందరికీ అర్థమయ్యేలా చేశారు. లోకేష్ మీద కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసి అచ్చెన్న అడ్డంగా బుక్ అయ్యారు.
తిరుపతి ఉప ఎన్నిక కోసం చంద్రబాబు నాయుడు, లోకేష్ లు చాలా రోజుల పాటే కష్టపడ్డారు. కరోనా పరిస్థితులను కూడా లెక్క చేయక చంద్రబాబు నాయుడు ఎనిమిది రోజుల పాటు ప్రచారాన్ని నిర్వహించారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ వయసులో చంద్రబాబు నాయుడు పెద్ద సాహసమే చేశారు. అవతల నాలుగు రోజుల పాటు గట్టిగా బయట తిరిగిన చాలా మందికి పాజిటివ్ అనే వార్తలు వస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఎనిమిది రోజుల సుదీర్ఘ ప్రచారం చేశారు. వీధివీధి తిరిగినంత పని చేశారు. చంద్రబాబు వయసు రీత్యా చూస్తే, ఆ వయసు వారు అసలు బయటికే రాకపోవడం మంచిదని వైద్యులు బహిరంగ ప్రకటనలు చేస్తుండటాన్ని గమనిస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో కూడా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ప్రచారం చేశారు.
మరోవైపు లోకేష్ అంతకు మించి ప్రచారం చేశారు. ఏదేదో మాట్లాడినా.. లోకేష్ పక్షం రోజుల వరకూ ప్రచారం చేసినట్టుగా ఉన్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి ఇంకా ఒక రోజు సమయం ఉండగానే ఆయన అక్కడ నుంచి వెళ్లిపోవడం మాత్రం చర్చనీయాంశంగా నిలిచింది.
ప్రచార కార్యక్రమాలు ఇంకా ఒక రోజు మిగిలే ఉన్నా లోకేష్ అంతలోనే తిరుపతి నుంచి వెళ్లిపోయారు. అప్పటికే అచ్చెన్నాయుడు వీడియో వైరల్ గా మారింది. ఏదో నామమాత్రంగా ఒక సారి అచ్చెన్న పక్కన కనిపించి లోకేష్ అక్కడ నుంచి మళ్లీ తిరుపతి దరిదాపుల్లో లేకుండా పోయారు.
ఏతావాతా అచ్చెన్న వీడియో తెలుగుదేశం పార్టీకి భారీ నష్టాన్ని చేసిందని స్పష్టమవుతూనే ఉంది. అది కేవలం తిరుపతి ఉప ఎన్నిక విషయంలోనే కాదు.. అసలే మూలుగుతున్నట్టుగా ఉన్న పరిస్థితుల్లో తాటికాయపడ్డట్టుగా ఆ వీడియో దుమారం రేపింది. ఈ నేపథ్యంలో ఈ పరిస్థితికి అంతా కారణమైన అచ్చెన్నాయుడును ఆ పదవి నుంచి తప్పిస్తారనే ప్రచారం ఊపందుకుంటోంది. తప్పిస్తే అది అచ్చెన్నాయుడు పై క్రమశిక్షణా చర్య తీసుకోడమే అవుతుంది.
కానీ, అంత ధైర్యం ఇప్పుడు చంద్రబాబుకు ఉందా? అనేది కూడా ప్రశ్నార్థకమే. అలా చేస్తే.. లోకేష్ ను ఎదురుమాట్లాడే వాళ్లను బయటకు పంపిస్తున్నారనే అభిప్రాయాలూ కలుగుతాయి. చర్యలు తీసుకోకపోతే అచ్చెన్నాయుడు అభిప్రాయాలకు పార్టీ అధిష్టానం గౌరవాన్ని ఇచ్చినట్టుగా కూడా అవుతుంది. మరి ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేసి తేలుకుట్టిన దొంగల్లే ఉన్నా.. ప్రజల్లో పార్టీ చాలా పలుచన కావడం ఖాయం!