ఇక మీడియం రేంజ్ సినిమాలదే హవా

రెండేళ్లుగా పట్టి పీడించిన కరోనా/లాక్ డౌన్ వల్ల పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడిన సినిమాలన్నీ ఈ 3 నెలల కాలంలో వరుసగా క్యూ కట్టాయి. భీమ్లానాయక్ నుంచి మొదలుపెడితే.. రాధేశ్యామ్,…

రెండేళ్లుగా పట్టి పీడించిన కరోనా/లాక్ డౌన్ వల్ల పెద్ద సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. అలా వాయిదా పడిన సినిమాలన్నీ ఈ 3 నెలల కాలంలో వరుసగా క్యూ కట్టాయి. భీమ్లానాయక్ నుంచి మొదలుపెడితే.. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, ఆచార్య, సర్కారువారి పాట.. ఇలా పెద్ద సినిమాలన్నీ మినిమం గ్యాప్స్ లో వచ్చేశాయి. ఈ నెలాఖరుతో పెద్ద సినిమాల హవా ముగుస్తోంది.

ఎఫ్3 థియేటర్లలోకి వచ్చేస్తే, పెద్ద సినిమాల జాబితా ముగిసినట్టే. ఇక జూన్ నుంచి మీడియం రేంజ్ సినిమాల మధ్య పోటీ మొదలుకాబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు.. దాదాపు మిడ్ రేంజ్ హీరోలంతా రాబోయే 3 నెలల్లో సందడి చేయబోతున్నారు.

జూన్ లో మేజర్, అంటే సుందరానికి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా అడివి శేష్ నటిస్తున్న మేజర్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అలాగే నాని నటిస్తున్న అంటే సుందరానికి సినిమా కూడా టీజర్, సాంగ్స్ తో అంచనాలు పెంచుతుంది. ఇక రవితేజ హీరోగా నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీపై ఓ మోస్తరు అంచనాలున్నాయి.

ఇక జులైలో ఈ పోటీ మరింత పెద్దది కానుంది. గోపీచంద్ నటించిన పక్కా కమర్షియల్, వైష్ణవ్ తేజ్ చేసిన రంగరంగ వైభవంగా, రానా-సాయిపల్లవి నటించిన విరాటపర్వం సినిమాలు ఒకే రోజు (జులై 1న) విడుదలకాబోతున్నాయి. ఇక జులై 8న నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమాను విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

జులై 14న రామ్ హీరోగా నటిస్తున్న ది వారియర్ సినిమాను, జులై 22న నిఖిల్ హీరోగా నటిస్తున్న కార్తికేయ2 సినిమాను విడుదల చేయబోతున్నారు. వీటితో పాటు జులై ఎండింగ్ లో హిట్-2 కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇక ఆగస్ట్ లో బింబిసార, మాచర్ల నియోజకవర్గం లాంటి సినిమాలు ఉండనే ఉన్నాయి. ఇలా రాబోయే 3 నెలల్లో మిడ్ రేంజ్ హీరోలంతా సందడి చేయబోతున్నారు. మధ్యమధ్యలో చిన్న హీరోల సినిమాలు వస్తూనే ఉంటాయి.