ఒక్క బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ తర్వాత కాశ్మీర్ లోయలో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. వెయ్యి మందికి పైగా గాయాలపాలయ్యారు. ఎందుకిలా.? ఓ తీవ్రవాది కోసం ఇంత మారణహోమం అవసరమా.! లెక్కలు చూస్తే, ఈ ప్రశ్న ఎవరి మదిలో అయినా మెదలడం సహజమే. కానీ, కశ్మీర్ లోయలో అల్లర్లకు కారణమవుతున్నవారు, తమ ప్రాణాల్ని సైతం లెక్క చేయడంలేదు. వారి మదిలో తీవ్రవాదం అనే విష భావజాలం అలా వేళ్ళూనుకుపోయింది మరి.
అల్లర్లు జరుగుతున్న సమయంలో, తుపాకీలు పేల్చడం ద్వారా ప్రాణాలు కోల్పోతున్నాయి గనుక.. పెల్లెట్ గన్స్ వినియోగం షురూ చేశారు కొంత కాలం క్రిందట. అయితే, వాటి కారణంగా తీవ్రగాయాల పాలవుతున్న ఆందోళనకారులు – వారిని చూసి మిగతా వారు మరింతగా రెచ్చిపోతున్న సందర్భాలనేకం. దాంతో పెల్లెట్ గన్స్ స్థానంలో చిల్లీ గన్స్ ప్రాచుర్యంలోకొచ్చాయి. ఏం చేసినాసరే, కాశ్మీర్ లోయలో 'శాంతి' అన్న మాటకు అర్థమే లేకుండా పోయింది.
కాశ్మీర్‌ని వదిలేస్తే తప్ప, ఈ ప్రాంతంలో శాంతి వుండదన్నది వేర్పాటువాదుల వాదన. అదెలా కుదురుతుంది.? కాశ్మీర్, భారత్‌లో అంతర్భాగం. కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో కాశ్మీర్‌ని వదులుకునే ఛాన్సే లేదు. కానీ కాశ్మీర్లో శాంతి నెలకొల్పాలి. కొంత ప్రాంతం, కొంతమంది ఆందోళనకారులు.. ఇక్కడ ఇంకాస్త తెలివిగా వ్యవహరిస్తే, మేటర్ వీలైనంత త్వరగా క్లియర్ అయిపోతుంది. సైన్యం, ఇప్పుడదే పనిలో బిజీగా వుంది.
ఓ అధికారి పక్కా వ్యూహం రచించారు. ఆందోళనకారుల్నే పట్టుకుని, తమ వాహనానికి కట్టేసి, 'మానవ కవచంగా' వాడితే.? అన్న ఆ ఆలోచన సత్ఫలితాన్నిచ్చింది. దీన్ని 'ఇన్నోవేటివ్ ఐడియా'గా సైన్యం కీర్తించింది. 'ముందు ముందు ఇలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్'ని అమల్లో పెడతామని సైన్యం చెబుతోంది. ముల్లుని ముల్లుతోనే తీయడం అన్ని సందర్భాల్లోనూ కరెక్ట్ కాకపోవచ్చుగాక. ముళ్ళబాట ఎదురవుతున్నప్పుడు, ఆ ముళ్ళని మట్టిలో కప్పెయ్యడం తేలికే కదా.!
ఓ పక్క సుతిమెత్తటి వ్యూహాలు, ఇంకోపక్క ఎన్కౌంటర్లు.. వెరసి, సైన్యం చేస్తోన్న కొత్త ప్రయోగాలు సత్ఫలితాలిస్తున్నాయనే చెప్పాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.. సైన్యం వ్యూహాలకు వేర్పాటువాదులు డైలమా పడ్డ ఈ పరిస్థితుల్లోనే కాశ్మీర్లో 'హింస'ని అంతమొందించెయ్యాలి. ఏమాత్రం ఆస్కారమిచ్చినాసరే, తీవ్రవాదం అనే వైరస్‌కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చినట్లవుతుంది. సైన్యం త్యాగాలు వృధా కాకూడదు. అందాలకాశ్మీరంలో ఇకపై ఎప్పటికీ నెత్తుటి మరకలు కన్పించకూడదంతే.