తలపండిన సినీయోధులకే చాలామందికి దాదాసాహెబ్ పాల్కే రాలేదు. మరి ప్రియాంక చోప్రాకు ఎలా వచ్చిందబ్బా.. ఇదేనా మీ సందేహం. ప్రియాంకకు దాదాసాహెబ్ ఫాల్కే వచ్చిన మాట నిజమే. కాకపోతే మెయిన్ అవార్డును ఆమెకు ఇవ్వట్లేదు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులో “అంతర్జాతీయ గుర్తింపు” అనే కేటగిరీని కొత్తగా పెట్టారు. ఆ విభాగంలోనే ప్రియాంకకు అవార్డు దక్కింది.
ఏంటి, చూస్తుంటే ఇదేదో కావాలని ప్రవేశపెట్టిన అవార్డులా ఉందనే అనుమానం మీకు వస్తోందా..? మీకు ఆ అనుమానం వస్తే అది మా తప్పుకాదు. స్వయంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కమిటీ ఈ కేటగిరీ పెట్టి, ప్రియాంకకు అవార్డు ఇస్తున్నట్టు ప్రకటించింది. ఆ కమిటీ ఛైర్మన్ అశోక్ శేఖర్ స్వయంగా ఈ వివరాలు వెల్లడించారు.
క్వాంటికో సిరీస్ తో అంతర్జాతీయంగా పేరుతెచ్చుకొని, బేవాచ్ మూవీతో హాలీవుడ్ లో అడుగుపెట్టిన ప్రియాంక.. ఈ అవార్డుకు బెస్ట్ ఛాయిస్ అంటోంది కమిటీ. మరి ప్రియాంక కంటే ముందు ట్రిపుల్ ఎక్స్ అనే హిట్ హాలీవుడ్ మూవీలో నటించిన దీపిక పదుకోన్ పరిస్థితేంటి..? దీపిక కంటే ముందు హాలీవుడ్ లో నటించి అక్కడి క్రిటిక్స్ మెప్పు కూడా పొందిన ఐశ్వర్యరాయ్, నసీరుద్దీన్ షా, ఓంపురి లాంటి నటీనటులు సంగతేంటి..? అన్నట్టు ఈ అవార్డు అందుకోవడం కోసం అమెరికా విడిచిపెట్టి త్వరలోనే ఇండియాలో అడుగుపెట్టబోతోంది ప్రియాంక.