రాజేంద్ర ప్రసాద్ ను ఒకసారికే దించేస్తారా?!

ఒకవైపు ప్రస్తుత ‘మా’ కమిటీ.. అద్భుతంగా పని చేస్తోందని కితాబులిచ్చుకుంటూనే, కొత్త కమిటీ ఎన్నిక గురించి ఆసక్తి కరమైన ప్రకటనలు చేస్తున్నారు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు. రెండేళ్ల కిందట నటకిరీటీ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన…

ఒకవైపు ప్రస్తుత ‘మా’ కమిటీ.. అద్భుతంగా పని చేస్తోందని కితాబులిచ్చుకుంటూనే, కొత్త కమిటీ ఎన్నిక గురించి ఆసక్తి కరమైన ప్రకటనలు చేస్తున్నారు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులు. రెండేళ్ల కిందట నటకిరీటీ రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఏర్పడిన ‘మా’ కమిటీ పదవీ కాలం పూర్తి కావొస్తోంది. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షడు, ప్యానల్ లోని ఇతర పదవుల ఎన్నిక గురించి ఆసక్తికరమైన ప్రకటనలు వస్తున్నాయి.

వీటి సారాంశం ఏమనగా.. నూతన అధ్యక్ష బాధ్యతల్లో రాజేంద్రప్రసాద్ వద్దనేది! ఆ స్థానంలో నటుడు శివాజీరాజాను అధ్యక్షుడిగా, సీనియర్ నటుడు నరేష్ ను జనరల్ సెక్రటరీగా ఎన్నికోవాలనేది! మరి ఈ ప్రకటనలు చేసింది మరెవరో కాదు.. వాళ్లిద్దరే! ఈ విషయంలో తమకు సీనియర్ల మద్దతు ఉందని కూడా వారు చెప్పేశారు. దాసరి నారాయణరావు, కృష్ణలు ఇదే విషయాన్ని చెప్పారని శివాజీరాజా, నరేష్ లు ప్రకటించుకున్నారు.

ఒకవేళ వీరి తరపున  ఇలాంటి ప్రకటనలు మరెవరైనా చేసి ఉంటే.. ‘మా’లో యూనిటీ ఉందని స్పష్టం అయ్యేది. అయితే తదుపరి అధ్యక్షుడిని నేనే అని శివాజీ రాజా, జనరల్ సెక్రటరీ నేనే అని నరేష్ అంటున్నారు. అంతేకాదు.. క్రితం సారిలా వచ్చేసారి మా అధ్యక్ష ఎన్నిక రసభసగా, రసవత్తరం కాకూడదనేది వీరి అభిలాష. ఏకగ్రీవంగా ఎన్నిక ఉండాలని కూడా అనేశారు!

ఒకవైపు ప్రస్తుత కమిటీ అద్భుతంగా పని చేస్తోంది, రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఎన్నో సాధించాం.. అని చెప్పుకొంటూ, మరోవైపు రెండో సారి మాత్రం రాజేంద్రుడు అధ్యక్షుడిగా వద్దనే శ్లేష చాలా స్పష్టంగా వినిపిస్తోంది. మరి మా అధ్యక్షుడిగా వరసగా రెండో సారి పదవి చేపట్టకూడదు అనే నియమం ఏమీ లేనట్టుగా ఉంది. వెనుకటికి మురళీమోహన్ వరసగ పర్యాయాల్లో అధ్యక్ష బాధ్యతల్లో ఉండినాడు. 

మరి రాజేంద్రుడిని మాత్రం ఒకేసారికి నిరాశ పరుస్తారా? అధ్యక్ష పదవి మీద శివాజీ రాజా పెట్టుకున్న కోరిక నెరవేరుతుందా? నిజంగానే.. ఈ సారి  ‘మా’ అధ్యక్ష ఎన్నిక ఎలాంటి పోటీ లేకుండా సాధ్యం అవుతుందా? క్రితం సారిలా పోటాపోటీగా ఉండదా? సినిమా వాళ్లలో ఉన్నఫలంగా అంత ఐక్యత వస్తుందా? త్వరలోనే ఈ అంశాలపై స్పష్టత వస్తుందిలే!