140 సీట్లున్న కేరళ అసెంబ్లీకి 2016 మే లో జరిగిన ఎన్నికల్లో ఎన్నికల్లో నెగ్గిన ఎల్‌డిఎఫ్‌కి సారథి ఐన సిపిఎం తరఫున విపరీతంగా ప్రచారం చేసిన అచ్యుతానందన్ సిఎం అవుతాడనుకుంటే ఆయనా కాలేదు. పార్టీ విజయన్‌ను ముఖ్యమంత్రిగా చేసింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన యుడిఎఫ్ బలం 72 నుంచి 47కి పడిపోయి ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. లెక్క ప్రకారం యుడిఎఫ్ సారథి ఐన కాంగ్రెసు తరఫున ముఖ్యమంత్రిగా పనిచేసిన ఊమెన్ చాండీ ప్రతిపక్ష నాయకుడు కావాలి. కానీ కాలేదు. చాండీ గ్రూపు అభ్యర్థులు చాలామంది ఓడిపోవడంతో చాండీకి అచ్యుతానందన్‌కు పట్టిన గతే పట్టింది. కాంగ్రెసు తరఫున రమేశ్ చెన్నితలను ప్రతిపక్ష నాయకుణ్ని చేశారు. అప్పణ్నుంచే చాండీ కష్టాలు పెరిగాయి.
కేరళలో కాంగ్రెసు వర్గాలుగా విడిపోయిందని జగమెరిగిన సత్యం. మాజీ ముఖ్యమంత్రి, పార్టీని చాలాకాలం నడిపించిన కరుణాకరన్ విధేయుల గ్రూపును 'ఐ' గ్రూపుగా పిలుస్తారు. ఇప్పుడు ప్రముఖంగా వున్న ఆ గ్రూపుకి నాయకుడు రమేశ్ చెన్నితల. కరుణాకరన్‌ను మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న నాయకుడు ఎకె ఆంటోనీ. అతని పేర అతని అనుయాయుల గ్రూపును 'ఎ' గ్రూపు అని పిలుస్తారు. చాండీ ఆ వర్గానికి చెందినవాడు. ఇవి ఎప్పణ్నుంచో వున్నవి కాగా యిటీవలి కాలంలో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సుధీరన్‌కు కూడా హై కమాండ్ మద్దతుతో ఒక గ్రూపు ఏర్పడింది. పార్టీ టిక్కెట్లు కానీ, పదవులు కానీ యీ మూడు గ్రూపులే పంచుకుంటూ వచ్చాయి. పంపకాలు తెగకపోతే వెన్నుపోట్లు తప్పవు. ఈ గ్రూపుల మధ్య అంతఃకలహాలతోనే పార్టీ ఓడిపోయిందనే భావంతో రాహుల్ గాంధీ గత జూన్‌లో చాండీ, సుధీరన్, రమేశ్‌లను కూర్చోబెట్టి గ్రూపిజాన్ని కట్టిపెట్టమని కోరాడు. తను సుధీరన్‌కు ఓ పక్క బలం సమకూరుస్తూ తక్కినవాళ్లని గ్రూపు రాజకీయాలు మానుకోమంటే మానుకుంటారా? ..కోరు. అదే జరిగింది.
ఆర్నెల్లు వేచి చూసిన రాహుల్ గాంధీకి విసుగేసింది. కేరళలో 'ఐ' గ్రూపు, 'ఎ' గ్రూపులను తొక్కేసి హై కమాండ్ గ్రూపు మాత్రమే వుండాలని నిశ్చయించుకున్నాడు. అందువలన డిసెంబరులో కేరళ లోని 14 జిల్లాలకు జిల్లా అధ్యక్షులందరినీ మార్చేసి ఏ ఎన్నికా లేకుండా, సీనియర్లకు కబురూ కాకరకాయా లేకుండా, కొత్త వాళ్లను నామినేట్ చేసేశాడు. పాతతరానికి బుద్ధి చెప్పడాని కన్నట్లు, కొత్త తరానికి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులకు యీ బాధ్యతలు అప్పగించాడు. వీళ్లందరూ – ఒక్కరు తప్ప – 50 ఏళ్ల లోపు వాళ్లే. ఏ గ్రూపుతోనూ గట్టి బాంధవ్యం లేదు. 'వీళ్లందరిదీ ఒకటే గ్రూపు, హై కమాండ్ గ్రూపు' అంటున్నారు పరిశీలకులు. కరుణాకరన్ మరణం తర్వాత రాష్ట్రంలో చాండీయే కాంగ్రెసు పక్షాన పెద్ద నాయకుడిగా ఎదిగాడు. ఇప్పుడు రాహుల్ అతని తోక కత్తిరించే పనిలో వున్నాడు. కొత్త అధ్యక్షుల్లో 5గురు మాత్రమే చాండీ ఒకప్పటి అనుచరులు. ఇప్పుడు వాళ్లు అతన్ని ఖాతరు చేయటం లేదు. నిజానికి యీ 14 మందిని రాజకీయాల్లో ప్రవేశపెట్టినది చాండీయే. అయినా తమ నియామకాల గురించి వారెవ్వరూ చాండీతో ముందుగా చెప్పలేదు. చాండీ సొంత జిల్లా అయిన కొటాయంలో నియామకం కూడా చాండీకి తెలియకుండానే జరిగింది.
ఇది సహజంగానే చాండీని బాధించింది. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం మానేశాడు. అదేమిటని పాత్రికేయులు అడిగితే 'అబ్బే వాళ్ల పని వాళ్లు చేసుకుంటున్నారు. ప్రతీ మీటింగుకి నన్ను పిలవడం, నేను వచ్చేదాకా వెయిట్ చేస్తూ కూర్చోవడం, యిదంతా వద్దని చెప్తున్నాను. ఈ 14 మందికి నా ఆశీర్వాదాలున్నాయి.' అన్నాడు. అంటూనే 'రాహుల్ డిసెంబరులో సంస్థాగత ఎన్నికలు పెడతానని అంటూ వచ్చారు. ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నాను. నిజానికి నేను చేసే డిమాండ్ అది ఒక్కటే, దాని వలన పార్టీ నిర్మాణం బలపడుతుంది.' అని కూడా అన్నాడు. ఇక్కడ చిన్న మెలిక ఏమిటంటే పార్టీ వ్యవస్థపై చాండీ కున్న పట్టు తక్కిన ఎవరికీ లేదు. ముఖ్యంగా యీ 14 మందికి అసలు లేదు. ఎన్నికలు జరిగితే హై కమాండ్ సపోర్టు వున్న సుధీరన్ గ్రూపుతో సహా ఎవరికీ పదవులు దక్కవు. చాండీ గ్రూపే గెలుస్తుంది. ఇది తెలిసిన సుధీరన్ 'ఆర్గనైజేషన్ ఎన్నికలకు, డిసిసి అధ్యక్షుల నియామకానికి సంబంధం లేదు. ఎన్నికలకు తొందరేమీ లేదు. ఏఐసిసి షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు జరిగితే అప్పుడే జరుగుతాయి' అంటున్నాడు. 'ఐ' గ్రూపుకి చెందిన రమేశ్ చెన్నితల యీ నియామకాలను ఆహ్వానించాడు. 'స్థానిక అంశాలను లెక్కలోకి తీసుకుని చేసిన యీ పోస్టింగులకు నేను 80% మార్కులు వేస్తాను' అన్నాడు అతని గ్రూపు మనిషి.
ఏ గ్రూపుకీ చెందనివారికి జిల్లా బాధ్యతలు అప్పగించానని రాహుల్ సంతోషిస్తూ వుంటే అది ఎక్కువకాలం నిలిచేట్లు లేదు. కరుణాకరన్ కుమారుడు, చాండీ వర్గంలో నాయకుడు ఐన కె మురళీధరన్ తన తండ్రి స్మారకసభలో మాట్లాడుతూ 'లెఫ్ట్ ఫ్రంట్ కేరళనే కాదు, ప్రతిపక్షాలను కూడా పాలిస్తోంది. కాంగ్రెసు నాయకులు ఎవరికి వారు విడివిడిగా టీవీ ఛానెళ్లకు యింటర్వ్యూలలో కనబడడానికి, ప్రకటనలు గుప్పించడానికి ఎగబడుతున్నారు తప్ప కలిసి పోరాడటం లేదు. వాళ్లను అదుపు చేసే స్థితిలో రాష్ట్ర యూనిట్ లేదు.' అంటూ కాంగ్రెసు నాయకత్వాన్ని విమర్శించాడు. యుడిఎఫ్‌లో భాగస్వామి ఐన ఆర్‌ఎస్‌పి (రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ) ముస్లిం లీగు నాయకులు 'అవును ప్రతిపక్షం బలహీనంగా వుంది' అని వంత పాడారు. ఈ విసుర్లు అసెంబ్లీలో బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమైన ఐ వర్గానికి తగలడంతో బాటు రాష్ట్ర యూనిట్ అధ్యక్షుడు సుధీరన్ వర్గానికీ తగిలింది. సుధీరన్ వర్గ నాయకుడైన, పార్టీ అధికార ప్రతినిథి అయిన రాజమోహన్ ఉన్నితాన్ మురళీధరన్‌ను తిట్టిపోసి, నిరసనగా అతను తన పదవికి రాజీనామా చేశాడు. తర్వాత పార్టీ సభకై కొల్లమ్ వెళితే అతని కారుపై కోడిగుడ్ల వర్షం కురిసింది. అతన్ని తన్నబోయారు కూడా. ఇదంతా మురళీధరన్ చేయించినదే అని ఆరోపించాడతను. నేను బెదురుతానని అనుకుంటే పొరబడినట్లే అని హెచ్చరించాడు కూడా. చాండీకి సన్నిహితుడైన మాజీ మంత్రి కెసి జోసెఫ్, మురళీధరన్ మాటల్లో తప్పులేదంటూ, రాజమోహన్‌ను తప్పుపడుతూ సుధీరన్‌కు ఉత్తరం రాశాడు. చూడబోతే కాంగ్రెసు కేరళ యూనిట్‌లో అంతర్యుద్ధాలు యిప్పట్లో ఆగేట్లు లేవు.
ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2017)