రివ్యూ: డిక్టేటర్
రేటింగ్: 2.5/5
బ్యానర్: ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్
తారాగణం: బాలకృష్ణ, అంజలి, సోనాల్ చౌహాన్, రతి అగ్నిహోత్రి, సుమన్, పృధ్వీ, హేమ, షకలక శంకర్, రఘుబాబు, వెన్నెల కిషోర్, అజయ్, రాజీవ్ కనకాల తదితరులు
కథ, కథనం: కోన వెంకట్, గోపీ మోహన్
మాటలు: ఎం. రత్నం
రచన: శ్రీధర్ సీపాన
సంగీతం: తమన్
కూర్పు: గౌతరరాజు
ఛాయాగ్రహణం: శ్యామ్ కె. నాయుడు
నిర్మాణం: ఈరోస్ ఇంటర్నేషనల్
కథనం, దర్శకత్వం: శ్రీవాస్
విడుదల తేదీ: జనవరి 14, 2016
ఏదో చిన్న పని చేసుకుంటూ, ఏదో కారణం చేత ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ కాలం గడిపే హీరో. అతనికో ఫ్లాష్‌బ్యాక్ ఉంటుంది. కానీ అదేంటనేది తెలీదు. ఒకానొక సందర్భంలో హీరోలో ఆవేశం కట్టలు తెచ్చుకుంటుంది. ఆ క్రమంలో అతని ఐడెంటిటీ బయటపడుతుంది. ఎక్కడో ఉన్న వాళ్లకి అతని ఆచూకీ తెలిసి… 'అసలు అతను ఎవరనుకుంటున్నావు?' అంటూ వచ్చి పెద్ద బ్యాంగ్‌తో అతనెవరనేది రివీల్ చేసినప్పుడు ఇంటర్వెల్. ఇక ఫ్లాష్‌బ్యాక్‌లో అతని గొప్పతనంకి సంబంధించిన విశేషాలు, ఆపై అజ్ఞాత వాసం చేయడానికి కారణాలు. కట్ చేస్తే తిరిగి పూర్వపు గెటప్‌తో, వదిలేసి వచ్చిన చోటికి వెళ్లి దుష్టసంహారం. సమరసింహారెడ్డి నుంచి బాలకృష్ణ చేసిన చాలా సినిమాల్లో కథావస్తువు ఇదే. ఈ సబ్జెక్ట్‌నే కాస్త అటు ఇటు చేసి, ఒకటే క్యారెక్టర్‌కి రెండు గెటప్స్ వేసి, లేదా డ్యూయల్ రోల్ చేయించి తొంభై శాతం బాలకృష్ణ సినిమాల్లో ఇదే చూపిస్తున్నారు. బాలకృష్ణ మార్కు పవర్ఫుల్ ఎమోషన్స్ పండి, హీరోయిజమ్ ఎలివేట్ అయ్యే సీన్లు పడితే సినిమాలు హిట్ అవుతున్నాయి. లేదంటే మిస్‌ఫైర్ అవుతున్నాయి. గత అయిదారేళ్ల కాలంలో అయితే బాలకృష్ణ ఇమేజ్‌కి తగ్గ విధంగా ఫార్ములా సినిమాలు తీసి మాస్‌ని అలరించింది మాత్రం బోయపాటి శ్రీను ఒక్కడే. అతనికి తెలిసిన కిటుకుని మిగతా దర్శకులు మాత్రం పట్టలేకపోతున్నారు. బాలయ్యని సింహాలో, లెజెండ్‌లో చూపించినంత ఫెరోషియస్‌గా చూపించడం మిగతా వాళ్ల వల్ల కావడం లేదు.
డిక్టేటర్ సినిమాకి కూడా పైన చెప్పిన కథావస్తువునే శ్రీవాస్ ఎంచుకున్నాడు. బాలకృష్ణ మార్కు మాస్ సినిమాకి కోన వెంకట్, గోపీమోహన్ బ్రాండ్ కామెడీని జోడించడంతో బాలయ్య నుంచి కొత్తరకం సినిమా వస్తుందని ఆశిస్తే అదేం జరగలేదు. అటు బాలకృష్ణ సినిమాల్లో ఉండాల్సిన స్థాయిలో ఎమోషన్లు లేక, ఇటు కోన, గోపీల చిత్రాల్లో ఉండే కామెడీ పేలక 'డిక్టేటర్' సగటు బాలకృష్ణ సినిమాగా మిగిలిపోయింది. బాలకృష్ణ అభిమానులు హర్షించే సంభాషణలని రత్నం రాసాడు. బాలకృష్ణ అద్భుతంగా పండించే రౌద్ర రసానికి తగ్గ డైలాగుల్ని కొన్ని సీన్స్‌లో రత్నం బాగా రాయడంతో అక్కడక్కడా డిక్టేటర్‌కి ఊపొచ్చింది. కానీ టెంపో మెయింటైన్ చేయడంలో డైరెక్టర్ శ్రీవాస్ పూర్తిగా విఫలమయ్యాడు. కథ చాలా బలహీనంగా ఉండడానికి తోడు కథనం అంతకంటే పేలవంగా ఉండడంతో డిక్టేటర్ ఏ దశలోను యావరేజ్ స్థాయిని దాటి పైకి వెళ్లలేకపోయింది. బాలకృష్ణ సినిమాల్లో హిట్ అయిన వాటిలో విలన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారు. అలాంటి వారి మీద బాలయ్య ఆధిపత్యం చూపించడమే మాస్‌ని బాగా అలరిస్తుంది. డిక్టేటర్లో చాలా మంది విలన్స్ ఉన్నారు కానీ ఒక్కరు కూడా బాలయ్యని ఛాలెంజ్ చేసేలా కనిపించలేదు. రతి అగ్నిహోత్రితో చేయించిన లేడీ విలన్ క్యారెక్టర్ పేలవంగా తయారైంది. ఆమె నటన కూడా అదే విధంగా ఉండడంతో డిక్టేటర్ పాత్రకి ఎలివేషన్ లేకుండా పోయింది.
డిక్టేటర్లో చెప్పుకోతగ్గ అంశమేమిటంటే, సహజంగా బాలకృష్ణతో చేయించే పవర్ఫుల్ క్యారెక్టర్ని ఏ సీమ ఫ్యాక్షనిస్టుగానో, పల్లెటూరి పెద్దగానో, లేదా మీసాల ఆసామిగానో చూపిస్తుంటారు. డిక్టేటర్ పాత్రని మాత్రం స్టయిలిష్‌గా, రిచ్‌గా తీర్చిదిద్దారు. ఈ గెటప్‌లో బాలకృష్ణ చాలా బాగున్నారు. కానీ అంత మంచి లుక్ సెట్ చేసి మరీ ఆ క్యారెక్టర్ని పండించే సన్నివేశాలు రాసుకోకుండా నాసిరకం సీన్లతో డిక్టేటర్ లుక్, టైటిల్ అన్నీ వృధా చేసారు. గోపీచంద్ లాంటి మాస్ హీరోని సక్సెస్‌ఫుల్‌గా ప్రెజెంట్ చేయగలిగిన శ్రీవాస్‌కి బాలకృష్ణ సినిమాని మెప్పించేలా తీయడం చేతకాలేదు. దీనికి ముందు చేసిన తొంభై ఎనిమిది సినిమాల్లో బాలకృష్ణ ఎన్నో పవర్ఫుల్ మాస్ క్యారెక్టర్లు చేసారు. అందుకే ఆయనపై మళ్లీ మాస్ పాత్ర పండాలంటే ఎమోషన్లు తారాస్థాయిలో ఉండాలి. ఆ మీటర్‌ని బోయపాటి శ్రీను క్యాచ్ చేయగలిగాడు కానీ మిగతావాళ్లు మాత్రం ఆ ఇంటెన్సిటీ మ్యాచ్ చేయలేకపోతున్నారు. అందుకే బాలకృష్ణ గత చిత్రం 'లయన్'లా ఇందులో అడపాదడపా కొన్ని మెరుపులు మినహా ఓవరాల్‌గా 'డిక్టేటర్' పవర్ చూపించలేకపోయాడు.
ఫస్ట్ హాఫ్‌లో ఎనభైలు, తొంభైల కాలం నాటి కాలనీ కామెడీ సీన్లు పెట్టి నవ్వించాలని చూసారు కానీ ఈసారి పృధ్వీ కూడా ఫెయిలయ్యాడు. లౌక్యం సినిమాలో ఇదే దర్శకుడు, ఈ రచయితలు కామెడీని బ్రహ్మాండంగా పండించారు. కానీ దీంట్లో హాయిగా నవ్వుకోవడానికి ఒక్క సీన్ అయినా లేకపోయింది. హీరోయిన్లకి కూడా తగిన ప్రాధాన్యం లేకుండా పోయింది. అంజలి చాలా లేట్‌గా ఎంటర్ అయి త్వరగా ఎగ్జిట్ అయిపోతుంది. సోనాల్ చౌహాన్ క్యారెక్టర్ కేవలం ఫస్ట్‌హాఫ్‌లో డిక్టేటర్ ఐడెంటిటీని రివీల్ చేయడానికి మాత్రం పనికొస్తుంది. మిగతా పాత్రల్లో చాలా మంది పేరున్న నటీనటులు ఉన్నా కానీ ఒక్కరికైనా చెప్పుకోతగ్గ సీన్ ఇవ్వలేదు. పాటల్లో ఒకటి రెండు బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సోసోగా ఉంది. సరిగ్గా హీరోని ఎలివేట్ చేసే సీనే లేదు కనుక దీనికి సంగీత దర్శకుడిని తప్పు పట్టలేం. శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రఫీ హైలైట్‌గా నిలుస్తుంది.
టెంప్లేట్ సినిమాలతో కాలక్షేపమైపోతుందనే సగటు మాస్ ప్రేక్షకులని మినహా 'డిక్టేటర్' మిగిలిన వాళ్లని మెప్పించడం కష్టమే. బాలకృష్ణ సినిమాలో ఉండాల్సిన ఎమోషనల్ హైస్ కానీ, రెండున్నర గంటలు కూర్చోబెట్టగలిగే ఎంటర్టైన్మెంట్ కానీ ఇందులో లేదు. సంక్రాంతికి పక్కా మాస్ సినిమా ఇదొక్కటే కనుక ఆ అడ్వాంటేజ్‌ని ఎంతవరకు క్యాష్ చేసుకుంటుందనే దాని మీదే ఫలితం డిపెండ్ అవుతుంది. ఓవరాల్‌గా బాలయ్య అభిమానులు మరోసారి బోయపాటిని మిస్ అవుతారు. బాలకృష్ణ వందవ సినిమాకి అతనే కరెక్ట్ అని హండ్రెడ్ పర్సంట్ ఫిక్స్ అయిపోతారు.
బోటమ్ లైన్: మిస్‌ఫైర్!
– గణేష్ రావూరి