ఎమ్బీయస్‌ : ముసుగువీరుడు బిశ్వాస్‌

బెంగుళూరులో సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఎపార్ట్‌మెంటులో పట్టుబడిన 24 ఏళ్ల మెహదీ మస్రూర్‌ బిశ్వాస్‌ అందర్నీ ఒక్కసారి ఉలిక్కిపడేట్లు చేశాడు. అతనికి రెండు ముఖాలున్నాయి. పగలు అతను ఐటిసి ఫుడ్స్‌ అనే మల్టీ-నేషనల్‌ కంపెనీలో ఏటా…

బెంగుళూరులో సింగిల్‌ బెడ్‌రూమ్‌ ఎపార్ట్‌మెంటులో పట్టుబడిన 24 ఏళ్ల మెహదీ మస్రూర్‌ బిశ్వాస్‌ అందర్నీ ఒక్కసారి ఉలిక్కిపడేట్లు చేశాడు. అతనికి రెండు ముఖాలున్నాయి. పగలు అతను ఐటిసి ఫుడ్స్‌ అనే మల్టీ-నేషనల్‌ కంపెనీలో ఏటా రూ. 5.30 లక్షల వేతనం పొందే ఉద్యోగి. రాత్రి వర్చువల్‌ ప్రపంచం ద్వారా మతయుద్ధం చేసే జిహాదీ టెర్రరిస్టు. తక్కిన జిహాదీల్లా అతను యితర దేశాలకు వెళ్లి టెర్రరిస్టులను కలిసి వారి వద్ద తర్ఫీదు పొందిన వ్యక్తి కాదు. అపరిచితుడు సినిమా హీరోలా తన మేధోశక్తితో సమాచారాన్ని సేకరించి, దాన్ని వ్యాప్తి చేస్తాడు. అతను బెంగాల్‌కు చెందినవాడు. తండ్రి బెంగాల్‌ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేశాడు. ఇద్దరు అక్కలు. 2003లో ఎలక్ట్రికల్‌ యింజనీరింగు చదువుతూండగా అతను ముస్లిం టెర్రరిజంవైపు మొగ్గాడు. లెవాంట్‌ ప్రాంతపు (లెబనాన్‌, సిరియా, పాలస్తీనా, జోర్డాన్‌, ఇజ్రాయేలు, టర్కీ) రాజకీయాలు, అక్కడి పరిణామాలు అన్నీ కక్షుణ్ణంగా తెలుసుకోసాగాడు. ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐయస్‌) అభిమానిగా మారి వారి ఆత్మాహుతి దళంలో చేరడం కంటె స్ట్రాటజిస్టుగా వుండి, వారి పోరాటానికి ప్రచారం కల్పించి కొత్తవారు దానిలో చేరేట్లా చేయాలనుకున్నాడు. ఇంట్లో ఒంటరిగా వుంటూ  2009లో బిశ్వాస్‌ 60 జిబి బ్రాడ్‌బ్యాండ్‌ కనక్షన్‌ తీసుకుని ట్విట్టర్‌ ఖాతా తెలిచాడు. అతనికి 17 వేల మంది ఫాలోయర్స్‌ వున్నారు. ఇప్పటివరకు 1,29,000 ట్వీట్లు చేశాడు. అరబిక్‌ నేర్చుకుని అరబ్బీ భాషలో వున్న ట్వీట్స్‌ను యింగ్లీషుకి తర్జుమా చేసేవాడు. ఆ విధంగా ఇంగ్లీషు మాత్రమే తెలిసిన టెర్రరిస్టులకు ఆత్మీయుడయ్యాడు. ఆసియా దేశాలను లక్ష్యంగా చేసుకున్న ఐయస్‌ కార్యకలాపాలకు యిది వూతం యిచ్చింది. తన రహస్యం ఎప్పటికీ బయటపడదన్న విశ్వాసంతో వున్న విశ్వాస్‌ తన కార్యకలాపాల గురించి బ్రిటిషు టీవీ ఛానెల్‌ 4కు యింటర్వ్యూ యిచ్చాడు.   ఆ ఛానెల్‌ వాళ్లు అతనెవరో ఎవరికీ తెలియనివ్వలేదు. కానీ ఆ ప్రసారం చూసిన బ్రిటన్‌ యింటెలిజెన్సు, సెక్యూరిటీ ఏజన్సీలు సొంతంగా విచారణ జరిపి బెంగుళూరు పోలీసులను హెచ్చరించారు. ''మీ వూళ్లోనే వున్నాడతను'' అని. అప్పుడు వాళ్లు ఒక స్పెషల్‌ టీము ఏర్పరచి వెతక నారంభించారు. ఫోన్లు ట్యాప్‌ చేయసాగారు. ఇదేమీ తెలియని ఛానెల్‌ 4 మళ్లీ బిశ్వాస్‌కి ఫోన్‌ చేసి మరో యింటర్వ్యూ యిస్తారా? అని అడిగింది. ఆ సంభాషణ విన్న స్పెషల్‌ టీము పశ్చిమ బెంగుళూరులోని జలహళ్లిలో తన ఎపార్టుమెంటులో వున్న అతనిపై డిసెంబరు 12 అర్ధరాత్రి దాడి చేసి పట్టుకున్నారు.

ఇంగ్లండ్‌ పోలీసులు చెప్పేదాకా మీరేం చేస్తున్నారు? అన్న ప్రశ్న బెంగుళూరు పోలీసులే కాదు సైబర్‌ క్రైమ్‌ పర్యవేక్షించే అందరూ ఎదుర్కోవలసి వచ్చింది. 2010లో కశ్మీర్‌లో ఒక నకిలీ ఎన్‌కౌంటర్‌ జరిగిందనీ, ఇరాక్‌లో అమెరికన్‌ సైనిక దళాలు కొరాన్‌ను దగ్ధం చేశాయనీ అబద్ధపు వార్తలు సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం చేసి కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించారు. ఈజిప్టులోని అరబ్‌ స్ప్రింగ్‌ ఉద్యమకారులు సోషల్‌ మీడియాను ఎలా వుపయోగించుకున్నారో గమనించిన పాకిస్తాన్‌ అనుకూల కశ్మీరీ జహాదీలు అల్లరి మూకలు ఒక నిశ్చితమైన సమయానికి ఒక చోట చేరేట్లు చేసి వాళ్లు రాళ్లు విసిరి గొడవలు చేసేట్టు చేయగలిగారు. అప్పుడు భారతదేశపు యింటెలిజెన్సు వర్గాలు సోషల్‌ మీడియాపై నిఘా పెట్టడం గురించి గట్టిగా ఆలోచించి, అదుపు చేశాయి. పోనుపోను శ్రద్ధ తప్పిందని తాజా ఘటనలు నిరూపించాయి. ఇంటెలిజెన్సు బ్యూరో హోం శాఖ కింద పనిచేస్తుంది. దాని వద్ద నిపుణులున్నారు కానీ వాళ్లకు యింటర్నెట్‌పై పట్టు లేదు. నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ కింద పనిచేసే నేషనల్‌ టెక్నికల్‌ రిసెర్చి ఆర్గనైజేషన్‌కు యింటర్నెట్‌పై పూర్తి అవగాహన వుంది. కానీ దానికి నిర్మాణ వ్యవస్థ లేదు. ఇప్పుడు బిశ్వాస్‌ పట్టుబడ్డాక నేషనల్‌ సెక్యూరిటీ ఎడ్వైజర్‌గా వున్న అజిత్‌ దోవల్‌ వివిధ ఇంటెలిజెన్సు వర్గాల నుండి ప్రతినిథులను తీసుకుని జాయింట్‌ టాస్క్‌ ఫోర్సు ఏర్పాటు చేశాడు. కానీ యీ లోపునే  ఐయస్‌ స్లీపర్‌ సెల్స్‌ మేల్కొన్నాయి. బిశ్వాస్‌ అరెస్టయిన మర్నాడే మరో ట్విటర్‌ ఖాతా ప్రారంభమైంది. 'బిశ్వాస్‌ను అరెస్టు చేసిన గోయల్‌ అనే డిసిపిపై పగ తీర్చుకుంటాం' అని ట్వీట్‌ పెట్టారు బిశ్వాస్‌ సహచరులు. సాంకేతికతో కూడుకున్న యీ గేమ్‌ ఆడటంలో మన పోలీసులు టెర్రరిస్టు యువకులతో పోటీ పడినపుడే విజయం సిద్ధిస్తుంది. ఏ మాత్రం ఏమరపాటు కనబరిచినా మరో పదిమంది బిశ్వాస్‌లు పుట్టుకుని వస్తారు. 

ఎమ్బీయస్‌ ప్రసాద్

[email protected]