ఎమ్బీయస్‌ : గోడ్సేని ఎలా చూడాలి? – 2

ఇప్పుడు బిజెపి ప్రభుత్వం రావడంతో హిందూత్వ శక్తులకు కొత్త శక్తి వచ్చినట్టయింది. పాత పాత వన్నీ లేవనెత్తి వివాదాలుగా మారుస్తున్నారు. హిందూమహాసభ వాళ్లు గోడ్సేని ఉరి తీసిన దినాన్ని 'హుతాత్మా దివస్‌' (ఆత్మార్పన చేసుకునేవారిని…

ఇప్పుడు బిజెపి ప్రభుత్వం రావడంతో హిందూత్వ శక్తులకు కొత్త శక్తి వచ్చినట్టయింది. పాత పాత వన్నీ లేవనెత్తి వివాదాలుగా మారుస్తున్నారు. హిందూమహాసభ వాళ్లు గోడ్సేని ఉరి తీసిన దినాన్ని 'హుతాత్మా దివస్‌' (ఆత్మార్పన చేసుకునేవారిని మరాఠీలో హుతాత్మా అంటారు) మొన్న నవంబరు 15 న  ముంబయి శివారు పన్వేల్‌లో జరిపారు. గోడ్సే మరణ వాంగ్మూలంలోని కొన్ని భాగాలను చదివారు. ''దేశభక్త్‌ నాథూరామ్‌ గోడ్సే'' పేర గోడ్సేపై సినిమా తీసి తాము ''శౌర్య దివస్‌''గా ప్రకటించిన జనవరి 30 న (గాంధీ హత్య జరిగినది ఆ రోజే) విడుదల చేస్తారట. ఢిల్లీలో అతను గాంధీని హత్య చేసిన చోటికి దగ్గరలో అతని విగ్రహం నెలకొల్పుతారట. దేశంలో మరో నాలుగు నగరాల్లో అతని విగ్రహాలు పెడతామంటూ ప్రభుత్వాన్ని కోరతారట. అనుమతి యిచ్చినా, యివ్వకపోయినా పెట్టి తీరతామంటున్నారు. ఇప్పుడు యుపిలో మేరఠ్‌ వద్ద గుడి కడతారట. మధ్యలో యుపి ఎందుకు? గోడ్సే వూరూ కాదు, హత్య జరిగిన చోటూ కాదు అంటే – మరి హిందూత్వ పేరుపై హిందువులను సంఘటితం చేసి ఓట్లు కొల్లగొట్టవలసినది, తమకు అనుబంధం వున్న పార్టీని బలోపేతం చేయవలసినది అక్కడే కదా! వీళ్లు గుడి కడతామనగానే వీల్లేదంటూ ఉత్తర్‌ ప్రదేశ్‌ నవ్‌నిర్మాణ్‌ సేన 20 గ్రామాల నుండి వచ్చిన వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. దీనిపై తమరు మౌనముద్ర పాటించకుండా ఏదో ఒకటి వ్యాఖ్యానించాలంటూ మోదీని జనవరి 11 న కలిసి కోరతారట. 

ఈ రాజకీయాలు ఎలా మలుపు తీసుకుంటాయో తెలియదు కానీ యీ లోపున మనం గోడ్సే గురించి, అతని ఆలోచనల గురించి, గాంధీ హత్య కేసు గురించి కాస్త తెలుసుకుంటే బాగుంటుంది. గాంధీ హత్య గురించి మనోహర్‌ మళ్‌గావ్‌కర్‌ అనే నవలా రచయిత రాసిన ''ద మెన్‌ హూ కిల్‌డ్‌ గాంధీ'' అనే పుస్తకం 1978లో వెలువడితే అది చదివాను. దాని ఆధారంగా 1995లో ''గాంధీ హత్యలో వీర్‌ సావర్కార్‌ పాత్ర'' అని ఆంధ్రప్రభ వీక్లీకి, 1996లో ''గాంధీపై విఫలమైన హత్యాయత్నం'' అని ఆంధ్రజ్యోతి వీక్లీకి వ్యాసాలు రాశాను. గాంధీ హత్యకు పది రోజుల ముందు ఆయనపై హత్యాప్రయత్నం జరిగిందని చాలా మందికి తెలియదు. అందుచేత దానికి చాలా పేరు వచ్చింది. చరిత్ర అంశాలతో నేను రాసిన ''హిస్టరీ మేడీజీ'' పుస్తకంలో తొలి రచనగా దాన్ని చేర్చాను.  పుస్తకం చదివిన ఒకాయన 'తక్కినవన్నీ సీరియస్‌గా వున్నాయి. ఇది మాత్రం సరదా ధోరణిలో వుందే' అని వ్యాఖ్యానించారు. నిజమే అని ఒప్పుకున్నాను. గోడ్సే వీరుడు, శూరుడు అని యీ రోజు వీళ్లు పొగడవచ్చుగాక, అసలు వీళ్లు హత్య ఎలా ప్లాన్‌ చేశారో తెలుసుకుంటే నవ్వొస్తుంది. ఇటువంటి అమెచ్యూర్‌ల చేతిలో గాంధీ బలై పోయాడే అని బాధ వేస్తుంది. ఆ వ్యాసాన్ని కింద యిస్తున్నాను చదవండి. మీ అంతట మీకే అర్థమవుతుంది. గోడ్సేపై సినిమా తీస్తే మరి యివన్నీ యిలాగే చూపిస్తారో, మార్చి చూపుతారో చూడాలి. 

గాంధీపై విఫలమైన హత్యా ప్రయత్నం

1948 జనవరి 30న జరిగిన హత్యా ప్రయత్నంలో మహాత్మాగాంధి అసువులు బాసారని అందరికీ తెలుసు. కానీ దానికి పది రోజుల క్రితం ఆయనపై వేరొక హత్యా యత్నం జరిగిందనీ, అది విఫలమైందనీ చాలా కొద్దిమందికి మాత్రమే తెలిసి వుంటుంది.

 ఆనాటి కుట్రలో భాగస్తులు ఏడుగురు – 'హిందూ రాష్ట్ర' పత్రికకు సంపాదకుడైన నాథూరామ్‌ గోడ్సే, ఆ పత్రిక మేనేజరైన నారాయణ్‌ ఆప్టే (వీరిద్దరూ ఉరితీయబడ్డారు) దరిమిలా అప్రూవర్‌గా మారిన దిగంబర్‌ బాహ్‌ాడగే, అతని శిష్యుడైన శంకర్‌ కిష్టయ్య (ఏడాదిన్నర జైలు వేసినతర్వాత 'బెనిఫిట్‌ ఆఫ్‌ డౌట్‌'పై విడిచి వేయబడ్డాడు) 1964 వరకు జైల్లో మగ్గిన మదన్‌లాల్‌ పహ్వా, విష్ణు కర్కరే, నాథూరామ్‌ గోడ్సే తమ్ముడు గోపాల్‌ గోడ్సే.

సూత్రధారులుగా చెప్పబడిన నాథూరామ్‌ గోడ్సే, ఆప్టేలు మహాత్ముడ్ని హత్య చేయాలని నిర్ణయించుకోవడానికి కారణం – పాకిస్తాన్‌కి చెల్లింపవలసిన 55 కోట్ల రూపాయిల బకాయి విషయంలో భారత ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి గాంధీ నిరాహారదీక్షకు ఉపక్రమించడం, దేశ విభజనకు బద్ధవ్యతిరేకులైన వారిద్దరూ ముస్లిముల పట్ల గాంధీ చూపించిన ఆదరానికి ఆగ్రహోదగ్రులయ్యారు.

'హిందూ సంఘటన' అనే సంస్థ ద్వారా దేశ విభజన విషయంపై కాంగ్రెస్‌తో విభేదిస్తూ పోరాడిన వీరు 1947, ఆగస్టు 15ను ఒక శోకదినంగానే పరిగణించారు. దేశాన్ని కుదిపి వేయగల సంఘటనల ద్వారా తమ సంతాపాన్ని వ్యక్తీకరించాలని వారు ఎన్నో పథకాలు వేశారు. పాకిస్తాన్‌కు వెళ్లే రైళ్లు కూల్చేయడం, జిన్నానూ అతని అసెంబ్లీ సభ్యులనూ ఒక్క దెబ్బతో తుడిచి పెట్టేయడం, వంతెనలు కూల్చివేయడం, అప్పటికి భారతదేశంలో ఇంకా విలీనం కాని హైదరాబాద్‌ రాష్ట్రంపై కమాండో తరహా దాడులు చేయడం – వంటివి తలపెట్టి తగిన ఆయుధ సామాగ్రి చేరవేయడం సాగించారు (జనవరి 20 నాటి హత్యా ప్రయత్నం వారు నిర్వహించిన తీరు చూస్తే వీటిలో ఏ ఒకటీ సవ్యంగా జరపగలిగేవారు కాదని సులభంగా అర్థమవుతుంది) తన నిరాహారదీక్ష ప్రకటనతో గాంధీ వారికొక మార్గం చూపించినట్టయింది. గాంధీని హత్య చేయడం ద్వారా హిందువుల నిరాశ నిస్పృహలను ప్రపంచం దృష్టికి తేవచ్చని వీరు ఆశించారు.

గోడ్సే, ఆప్టేలు రాజకీయంగా ఏకాభిప్రాయులైనా వారి కుటుంబ నేపథ్యాలలో, వ్యక్తిగత అభిరుచులలో ఎంతో వైరుధ్యముంది. నాథూరామ్‌ తండ్రి వినాయక గోడ్సే మధ్యతరగతి కుటుంబీకుడు. వరుసగా కొడుకులు పుట్టి, చచ్చిపోతుంటే పుట్టబోయే కొడుకును ఆడపిల్లగానే పెంచుతానని ఆయన మొక్కుకున్నాడు. అందువలననే 1910 పుట్టిన రామచంద్ర అనే కొడుకుకి ముక్కు కుట్టించి నత్తు పెట్టించడం జరిగింది. ఆ నత్తు కారణంగానే అతను నాథూరామ్‌గా పేరుబడ్డాడు.(సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2014)

[email protected]

Click Here For Part-1