ఎమ్బీయస్‌ : సిపిఎం ఆవిర్భావం – 07

స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నవారందరిదీ ఒక పంథా కాదు. కొందరు హింసామార్గం పట్టారు. వారిని చూపించి బ్రిటిషు ప్రభుత్వం కఠినమైన చట్టాలను తెచ్చి శాంతియుతంగా చేసేవారిని సైతం జైళ్లల్లో కుక్కింది. 'హింసామార్గంలో వెళ్లినవారి వల్లనే యీ గతి…

స్వాతంత్య్రపోరాటంలో పాల్గొన్నవారందరిదీ ఒక పంథా కాదు. కొందరు హింసామార్గం పట్టారు. వారిని చూపించి బ్రిటిషు ప్రభుత్వం కఠినమైన చట్టాలను తెచ్చి శాంతియుతంగా చేసేవారిని సైతం జైళ్లల్లో కుక్కింది. 'హింసామార్గంలో వెళ్లినవారి వల్లనే యీ గతి పట్టింది, వారు పరోక్షంగా బ్రిటిషువారికి సాయపడ్డారు' అనవచ్చా? ప్రపంచయుద్ధాలు వచ్చినపుడు 'యుద్ధసమయంలో మీరు మాతో సహకరించండి, ఆందోళనలు ఆపండి, యుద్ధానంతరం స్వాతంత్య్రం యిస్తాం' అని బ్రిటిషు వాళ్లు అన్నారు. 'వాళ్లు పెద్దమనుషులు, యిచ్చిన మాట నిలబెట్టుకుంటారు, సహకరిద్దాం' అన్నవాళ్లు దేశభక్తులా? దేశద్రోహులా? 'ఈసారికి యిలా కానిద్దాం, అంతగా కాకపోతే వచ్చేసారి చూసుకుందాం' అనుకోవడానికి ప్రపంచయుద్ధాలు మాటిమాటికీ జరుగుతాయని, నిశ్చిత విరామంలో జరుగుతాయనీ గ్యారంటీ వుందా? 

పోరాట సమయంలో ఎన్నో రకాల ఎత్తుగడలు వుంటాయి. కొన్ని ఫలిస్తాయి, కొన్ని దెబ్బ తింటాయి. అంతమాత్రం చేత దురుద్దేశాలు అంటగట్టకూడదు. రెండవ ప్రపంచయుద్ధంలో నేతాజీ సుభాష్‌ బోసు విదేశీయులతో చేతులు కలిపి భారతదేశంపై దాడి చేశాడు. మరి ఆయన దేశభక్తుడు కాడా? 'శత్రువు మిత్రుడు శత్రువు' అనే సిద్ధాంతాన్ని నమ్మాడాయన. నిజంగా ఆ యుద్ధంలో జపాన్‌ వాళ్లు నెగ్గి వుంటే ఇండియాకు స్వాతంత్య్రం యిచ్చేవారా? మనల్ని వలసరాజ్యం చేసుకుని చైనాపై దండెత్తి దాన్నీ తమ వశం చేసుకునేవారు కారా? బ్రిటన్‌లో ఎంతోకొంత ప్రజాస్వామ్యం అఘోరించింది. ప్రజాదరణ కలిగిన, యుద్ధానంతరం అధికారంలోకి వచ్చిన లేబర్‌ పార్టీ భారత్‌కు స్వాతంత్య్రం యివ్వాలని తీర్మానించింది. జపాన్‌లో యుద్ధోన్మాదం ఎక్కువ. చక్రవర్తికి అధికారాలు ఎక్కువ. పొరుగు రాజ్యమైన చైనాపే ఎప్పుడూ కన్నే. వలస రాజ్యాల పట్ల, యుద్ధంలో ఓడిపోయిన దేశాల పట్ల క్రూరంగా ప్రవర్తించారు. ఇంగ్లండును ఓడించి బర్మాను కొంతకాలం తమ అధీనంలో వుంచుకున్నపుడు ఎంత హింస జరిపేవారో రంగనాయకమ్మగారి ''బలిపీఠం'' నవల చదివితే తెలుస్తుంది. 

1942 క్విట్‌ ఇండియా ఉద్యమం విజయవంతమై వుంటే కూడా యిలాగే జరిగేది. ఆ సమయంలో కాంగ్రెసు నాయకులు తీసుకున్న తప్పుడు (నా దృష్టిలో) నిర్ణయమది. రష్యా యుద్ధంలోకి దిగేదాకా కమ్యూనిస్టులు దాన్ని సమర్థించారు. అదీ తప్పే (నా దృష్టిలో) యుద్ధసమయంలో కొత్త ప్రాంతాలు గెలుచుకుంటారు కానీ, వున్నవి ఎవరూ వదులుకోరు. ఇండియా వంటి పెద్ద దేశాన్ని జపాన్‌ పాలు చేస్తే సగం ఆసియాను శత్రువులకు ధారాదత్తం  చేసినట్లే. అందువలన స్వాతంత్య్రయోధులు 'క్విట్‌' అంటే వాళ్లు క్విట్‌ అవరు. అవలేదు. ఆ ఉద్యమమంతా వృథా అయింది. యుద్ధంలో గెలిచాకనే బ్రిటన్‌లో అధికారం చేతులు మారి లేబర్‌ పార్టీ గద్దె కెక్కిన తర్వాత వాళ్ల విధానం ప్రకారం మనకు స్వాతంత్య్రం యిచ్చారు. అదే యుద్ధంలో అక్షరాజ్యాలు నెగ్గి వుంటే మనను జపాన్‌వారు వలసరాజ్యంగా చేసుకుని ఓ పట్టాన వదిలిపెట్టేవారు కారు. 

మనం యిప్పుడు ఏం వ్యాఖ్యానించినా, 'విత్‌ ద బెనిఫిట్‌ ఆఫ్‌ హైండ్‌సైట్‌' సింహావలోకనం చేసుకునే సౌకర్యంతో అంటున్నాం. యుద్ధభూమిలో వుండగా ఏ స్ట్రాటజీ ఫలిస్తుందో, ఏది ఫలించదో ఎవరికీ తెలియదు. కృష్ణుడు జరాసంధుడితో పోరాడినప్పుడు అనేకసార్లు పారిపోయాడు. (ఆయన బిరుదుల్లో ఒకటి రణ్‌ఛోడ్‌) భీమార్జునుల బలం చేకూరాక అప్పుడు జరాసంధుణ్ని మట్టుపెట్టాడు. శివాజీ నిరంతరం ఔరంగజేబుతో పోట్లాడలేదు. మధ్యమధ్యలో రాజీ పడ్డాడు. పురందర్‌ సంధి చేసుకున్నాడు. అతని చక్రవర్తిత్వాన్ని అంగీకరిస్తానని లేఖ రాశాడు. బిజాపూర్‌ నవాబుకి, మొగలాయీలకు యుద్ధం జరిగితే మొగల్‌ సైన్యాలకు మద్దతుగా తన సైన్యాన్ని పంపాడు. ఇలా చేశాడు కాబట్టి శివాజీని మహారాష్ట్ర ద్రోహి అని, ఔరంగజేబుకి తొత్తు అనీ అనగలమా? 

క్విట్‌ ఇండియా ఉద్యమం నడిపి, భారత స్వాతంత్య్రానికి అనుకూలంగా వున్న ఇంగ్లీషువారికి యిబ్బందులు తెప్పించి, స్వాతంత్య్రం రావడం మరింత ఆలస్యం చేశారు కాబట్టి కాంగ్రెసు వారిని దేశద్రోహులని అనకూడదు, ఆ ఉద్యమాన్ని వ్యతిరేకించిన వాళ్లనూ అనకూడదు. ఒక్కోరికి ఒక్కోమార్గం సబబుగా తోస్తుంది. యుద్ధానంతరం కూడా మీరు వెళ్లిపోకండి, యిక్కడే వుండండి అని బ్రిటిషు వాళ్లను కాంగ్రెసు వాళ్లూ బతిమాలలేదు, కమ్యూనిస్టులూ బతిమాలలేదు, హిందూ మహాసభవాళ్లూ బతిమాలలేదు, ముస్లిం లీగు వాళ్లూ బతిమాల లేదు. అందుచేత వీళ్లెవరినీ దేశద్రోహులనడానికి లేదు. దేశద్రోహులైనా, దేశోద్ధారకులైనా భారతరాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించిన పార్టీల గురించి కొంతైనా తెలుసుకోవాలి. తెలుసుకున్నాక ఎవరి అవగాహన ప్రకారం వారు ఒక అభిప్రాయానికి రావచ్చును. ఈ లోగా అరకొర సమాచారంతో తొందరపడ నక్కరలేదు.

రష్యాలో 1917 లో జారిస్టు వ్యతిరేక విప్లవం జరిగి, అంతర్యుద్ధం జరిగి 1922 లో బోల్షివిక్‌లు గెలిచి యుఎస్‌ఎస్‌ఆర్‌ ఏర్పరచి కార్మిక విప్లవం విజయవంతం చేశాక యితర దేశాల్లోని శ్రామికవర్గ నాయకులకు కూడా ఆశ పుట్టింది. ధనికవర్గాలకే కాదు, వలసరాజ్యాలేలుతున్న సామ్రాజ్యవాదులకు కూడా భయం పుట్టింది. ఇలాటి ఆలోచనలు రాకుండా మొగ్గలోనే తుంచేయాలని ప్రయత్నాలు చేశారు. రష్యాకు చాలా బాలారిష్టాలున్నాయి. హిట్లర్‌ ఎదుగుతున్న కాలంలో బ్రిటన్‌ అతన్ని ప్రోత్సహించింది – రష్యాపై పడి దాని పీడ వదులుస్తాడన్న ఆశతో. స్టాలిన్‌తో నిర్యుద్ధ సంధి చేసుకుని తనపైనే బ్లిట్జ్‌క్రీగ్‌ పేరుతో హఠాత్తుగా విమానదాడి జరపడంతో ఉలిక్కిపడింది. రష్యా నాయకులకు యివన్నీ తెలుసు. యావత్‌ ప్రపంచంలో తమది ఏకైక కమ్యూనిస్టు రాజ్యం. తక్కినవి రాజరికంలో, సైనిక నియంతృత్వంలో, వలస పాలనలో వున్నాయి. అతి కొద్ది రాజ్యాలు ప్రజాస్వామ్యంలో వున్నాయి. అందరూ కలిసి తమను అణగదొక్కకుండా చూసుకోవాలంటే అన్ని దేశాల్లో తమ ఆలోచనా విధానంతో ఏకీభవించే నాయకులు బలపడాలని తలపోసింది. అన్ని దేశాల్లో కమ్యూనిస్టు పార్టీ శాఖలు ఏర్పడాలని ప్రణాళికలు రచించి, వారికి ఆర్థిక, హార్దిక సహాయం చేసింది. చైనా వంటి అనేక దేశాల్లో కమ్యూనిజం రావడానికి రష్యా సహకారమే కారణం. పరాయిదేశాల్లో కమ్యూనిజం వ్యాప్తికోసం ఖర్చు పెట్టే క్రమంలో సొంత ప్రజల కడుపు కాల్చడంతో, వాళ్లు కొంతకాలానికి తిరగబడ్డారు. అది తర్వాతి కథ. (సశేషం) 

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2014)

[email protected]

Click Here For Part-1

Click Here For Part-2

Click Here For Part-3

Click Here For Part-4

Click Here For Part-5

Click Here For Part-6