ఆప్ గెలుపు ఎవరూ కనీవిని ఎరుగరు అనే మాట తప్పు. సిక్కింలో సిక్కిం డెమోక్రాటిక్ ఫ్రంట్ 1989లో, 2009లో 32కు 32 సీట్లు తెచ్చుకుంది. అయితే అప్పుడది అధికారంలో వుంది. ప్రతిపక్షంలో వుండి 95% సీట్లు తెచ్చుకోవడం అనే ప్రత్యేకతే ఆప్‌ది.
ఇవాళ్టికి ఓటింగు శాతాలు కరక్టుగా వచ్చాయి. 2013 అసెంబ్లీలో బిజెపికి 34%, ఆప్‌కు 29.5%, కాంగ్రెస్‌కు 24.6%, 2014 లోకసభ నాటికి బిజెపి 46.6%, ఆప్ 33.0%, కాంగ్రెస్ 15.1%, 2015 అసెంబ్లీకి బిజెపి 32.7%, ఆప్ 54.3%, కాంగ్రెస్ 9.7%. అంటే అరవింద్ 49 రోజుల తర్వాత గద్దె వదిలి వెళ్లిపోయినా ఢిల్లీలో ఆప్ తరఫున పెద్ద అభ్యర్థులు లేకపోయినా, అరవింద్ అనవసరంగా వారణాశిలో యిరుక్కుపోయినా, ఢిల్లీతో సహా దేశమంతా మోదీ హవా వీస్తున్నా 3.5% ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఇది మోదీ-అమిత్ గమనించి ఎందుకైనా మంచిదన్నట్లు ఎన్నికలలో దిగి వుంటే బాగుండేది. కానీ మోదీ స్వభావం అది కాదు. ప్రత్యర్థికి ఏ మాత్రం పొలిటికల్ స్పేస్ యివ్వకుండా సాంతం అణచిపారేయాలనే తత్వం అతనిది. పార్టీలో తనను ఆమోదించనివారితోనే కఠినంగా వ్యవహరించాడు. పాతికేళ్లగా భాగస్వాములుగా వున్నవారితో కూడా కటువుగా వ్యవహరించాడు. ఇక వారణాశిలో తనకు వ్యతిరేకంగా నిలబడిన అరవింద్‌ను క్షమిస్తాడా? ఎలాగైనా సరే బుద్ధి చెప్పాల్సిందే అన్న కసితో ఢిల్లీ ఎన్నికలలో కౌరవసైన్యమంత జనాన్ని మోహరించాడు. నిజానికి యిది మోదీ పాలనపై రిఫరెండం కాదు, మోదీ రంగంలోకి దిగకుండా అమిత్‌పై వదిలేసి వుంటే ఓటమి భారం అతను మోసేవాడు. కానీ కక్షపూని వ్యవహరించినట్లు ప్రధాని పదవికి వుండవలసిన హుందాతనాన్ని విస్మరించి అరవింద్‌ను నానా మాటలూ అన్నాడు. ఇది ఓటర్ల దృష్టిని దాటిపోలేదు. నిజానికి చాలామంది ఓటర్లు చివరి క్షణంలో బయటకు వచ్చి ఓటేయడానికి కారణం అరవింద్ మొహం చూసి!
పార్లమెంటు ఎన్నికల సమయంలో మోదీ చాయ్‌వాలా! అందలం ఎక్కాడమ్మా, అందకుండా పోయాడమ్మా అన్నట్లు 8 నెలల తర్వాత చూస్తే అతను పదిలక్షల సూట్‌వాలా! అప్పుడు పఠించిన అభివృద్ధి మంత్రం యిప్పుడు మారిపోయింది. ఢిల్లీ బాగుపడాలంటే నేను చెప్పినవాడికే ఓటేయండి అనడం ప్రారంభమైంది. ఈలోగా మోదీ సర్కారు నడిచిన తీరును కూడా ఓటర్లు పరిగణనలోకి తీసుకున్నారు. మోదీ ఇతర పక్షాలను పూచికపుల్ల కంటె అన్యాయంగా చూస్తున్నారు. కాంగ్రెసుకు ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయినా యిచ్చి ఔదార్యం చాటుకుని వుండవచ్చు – ఇప్పుడు అరవింద్ చేసినట్లు! కానీ శత్రుశేషం వుంచకూడదన్న పాలసీ మోదీది. కాంగ్రెస్ ముక్త్ భారత్‌ని నిజంగా అమలు చేద్దామని చూశాడు. ఈరోజు బిజెపి ముక్త్ ఢిల్లీ అయిపోయింది. భూసేకరణ చట్టం కానీ, విదేశీ పెట్టుబడుల విషయంలో కాని, ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి 8 నెలలైనా దాని ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయని విషయంలో కాని, పెట్రోలు ధరలు అంతర్జాతీయంగా తగ్గుతున్నాయి కాబట్టి ఆ బెనిఫిట్‌ను సామాన్యుడికి అందించే విషయంలో కాని – ఎవర్నీ అడిగేది లేదు, పెట్టేది లేదు. పోనీ అలాగని పేదలకు ఏమైనా చేస్తున్నాడా అంటే ఏమీ లేదు. ఢిల్లీ కార్పోరేషన్ వారి చేతిలోనే వుంది. ఢిల్లీ ప్రభుత వారి చేతిలోనే వుంది. ఈలోగా నాలుగు మంచిపనులు చేసి వుంటే పేదలు గుర్తు పెట్టుకునేవారు. జస్ట్ ఎన్నికలకు ముందు క్రమబద్ధీకరణ అంటే వాళ్లు నమ్మలేదు. పైగా కిరణ్ బేదీ వంటి పోలీసు అధికారిణి సిఎంగా వచ్చిందంటే వీళ్లందరినీ లేపేయ్ అంటుందేమోనని భయపడి, గుడిసెవాసులంతా ఆప్‌కీ జై అన్నారు. మోదీ పాలనతో కార్పోరేట్‌లకు మాత్రమే అచ్ఛే దిన్ వచ్చాయని ప్రజలంతా నమ్ముతున్నారని ఢిల్లీ ఎన్నికలు చెప్పాయి.
పార్లమెంటు ఎన్నికలలో మీడియా మేనేజ్‌మెంట్‌తో, ఆరెస్సెస్ కార్యకర్తల బలంతో అఖండ విజయం సాధించాం కాబట్టి పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అనుకున్నారు. కానీ ప్రచారం అతిగా చేస్తే గతి చెడుతుందని 2004 నాటి 'ఇండియా షైనింగ్' అనుభవం చెప్పింది. ఇప్పుడు 70 సీట్ల ఢిల్లీ కోసం హోర్డింగులపై ఎంత ఖర్చు పెట్టిందో చూడండి. పత్రికల్లో ఫుల్‌పేజీ యాడ్స్ గుప్పించింది. దానికి వ్యతిరేకంగా ఆప్ హోర్డింగులకు దూరంగా వుంది. దాని వాలంటీర్లు 40 బై 10 బ్యానర్లు పట్టుకుని వంతెనలపై, ఎత్తయిన ప్రదేశాల్లో కొన్ని గంటలపాటు నిలబడ్డారు. ఆటోల వెనక ప్రచారమే. తామేదో పవిత్రుల మన్నట్లు ఆప్‌వారికి హవాలా మార్గాల ద్వారా విరాళాలు అందాయని బిజెపివారు ఆరోపించారు. నిజానికి 20 వేలకు పైబడి విరాళాలు యిచ్చిన వాళ్ల వివరాలు ఎన్నికల కమీషన్‌కు 2013-14 సంవత్సరానికి బిజెపి యింకా యివ్వలేదు. జాతీయపార్టీల్లో అదొక్కటే అలా యివ్వనిది. అంతేకాదు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ 6 జాతీయ పార్టీలకు తమ పార్టీ కార్యకలాపాల గురించి ఆర్‌టిఐ (సమాచార హక్కులు) ప్రశ్నలకు సమాధానమిచ్చే వ్యవస్థ ఏర్పాటు చేయమని అడిగింది. బిజెపితో సహా ఎవ్వరూ ఆ పని చేయలేదు. 2014 నవంబరులో ఆ పార్టీలను నిలదీయడానికి సమావేశం ఏర్పాటు చేస్తే ఎవరూ హాజరు కాలేదు. వీళ్లు ఆప్‌పై బురద చల్లుదామని చూస్తే ఎలా? నిజానికి ఆప్ రూ. 30 కోట్ల టార్గెట్ పెట్టుకున్నా 20 కోట్లే వచ్చాయి. వాళ్లు కార్పోరేట్ కాదు, కమ్యూనిటీ ఫండింగ్ నమ్ముకున్నారు. వాళ్ల అభ్యర్థుల ఆస్తిపాస్తుల సంగతికి వస్తే 2013 ఎన్నికలలో నెగ్గి 2015లో మళ్లీ పోటీ చేస్తున్న ఎమ్మెల్యేల ఆస్తులు (ప్రకటించినవి) లెక్కవేస్తే బిజెపి, కాంగ్రెసు ఎమ్మెల్యేల సగటు ఆస్తి రూ. 10 కోట్లు వుంటే ఆప్ అభ్యర్థి సగటు ఆస్తి రూ.1 కోటి వుంది.
ఓటర్లలో పార్టీ పట్ల అభిమానం వున్నా వారిని బూత్‌లకు వద్దకు తీసుకుని వచ్చే కార్యకర్తలుండాలి. కార్యకర్తలున్నంత మాత్రాన ఎన్నిక గెలిచేయరు. అన్ని ప్రాంతాల నుండీ కార్యకర్తలను తెచ్చేశామని అమిత్ భుజాలు చరుచుకున్నారు కానీ బూత్‌లోపలికి వెళ్లినవాళ్లు బిజెపికి ఓటేయలేదు. బిజెపి లోకసభ ఎన్నికలలో 38.38 లక్షల ఓట్లు తెచ్చుకుంటే యీ ఎన్నికలలో 28.91 లక్షల ఓట్లు తెచ్చుకుంది. అంటే సుమారు 9 లక్షల ఓట్లు తగ్గాయి – మోదీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని మిషన్ 44 అని నినాదం యిచ్చి బిజెపి నాయకులందరినీ దింపినా! 'వరుసగా వచ్చిన 8 ఎన్నికలలో 7టిలో నెగ్గాం. ఒక్కటే పోయింది' అంటున్నారు వెంకయ్యనాయుడు. కరెక్టే. అంతేకాదు, 2013 ఎన్నికలతో పోలిస్తే 1.3% మాత్రమే తగ్గాయి అని కూడా చెప్పుకోవచ్చు. కానీ అప్పుడు మోదీ వంటి గ్లామర్ బాయ్ లేడు. ఇప్పుడు మోదీ వున్నాడు. తనకు వీసా నిరాకరించిన అమెరికా దేశపు అధ్యకక్షుడు ఒబామాను తన వద్దకు రప్పించుకుని తన అహాన్ని చల్లార్చుకున్న మోదీ ఢిల్లీలో తన బలప్రదర్శన చేసిన తర్వాత పార్లమెంటు ఎన్నికలతో పోల్చి చూడాలి. అలా చూస్తే 13.9% తగ్గిందనాలి. కాంగ్రెసు చాలా థాబ్దాలపాటు దేశాన్ని పాలించాక ప్రతిపక్షాలకు అర్థమైంది – తామంతా కలిస్తే కాంగ్రెసును ఓడించవచ్చని! అలా చేసి గెలిచారు. ఇప్పుడు బిజెపి వచ్చిన 8 నెలల్లోనే ప్రతిపక్షాలకు దాన్ని ఓడించే మార్గం తెలిసిపోయింది. మళ్లీ మళ్లీ యిలాటి ట్రిక్కులు మిగతా ప్రాంతాల్లో కూడా వేస్తే పార్టీ గతేమిటి? అని ఆలోచించుకుని అప్పుడు మాట్లాడాలి. ''నేను తప్పులు చేశాను, క్షమించండి'' అని క్షమాపణ అడిగి అరవింద్ ప్రజలను దగ్గర చేసుకున్నాడు. మోదీ కానీ, అమిత్ కానీ అలాటి స్టేటుమెంటు ఏమీ యివ్వలేదు, యిస్తారని కూడా అనుకోను. కానీ బిజెపి పార్టీలోనైనా యీ ఓటమిపై నిష్కర్షమైన అంతర్గత చర్చ జరుగుతోందా అన్నదే ప్రశ్న. (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఫిబ్రవరి 2015)