cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: పూరి ఆలయ భండార వివాదం

ఎమ్బీయస్‍:  పూరి ఆలయ భండార వివాదం

గ్రేట్ ఆంధ్ర వెబ్‌సైట్‌లోనే జనవరి 5న ‘‘ఇదే పని జగన్ చేస్తే..’’ పేరుతో ఒక వ్యాసం వచ్చింది. విదేశాల నుంచి విరాళాలు అందుకుంటున్న సామాజిక సంస్థలపై కేంద్రం తీసుకున్న చర్యల కారణంగా మదర్ థెరిస్సా ట్రస్టుకు నిధుల రాక ఆగిపోయి, బెంగాల్‌లో అనేకమంది రోగులు అవస్థ పడుతున్నారని మమతా బెనర్జీ అన్నారు. ఆ ట్రస్టుకు సంబంధించి ఒడిశాలో 13 సంస్థల్లో 900 మందికి భోజనాది వసతులు ఆగిపోతే సిఎం నవీన్ పట్నాయక్ రూ.79 లక్షలు మంజూరు చేశారని, అదే పని జగన్ చేసి వుంటే క్రైస్తవ కోణంలో చూసి నానా యాగీ అయివుండేదని దానిలో సూచించారు. ఈ సందర్భంగా దాదాపు నాలుగేళ్లగా నలుగుతున్న పూరీ జగన్నాథాలయంలోని రత్నభండారం తాళం చెవుల మిస్టరీ గుర్తుకు వస్తోంది. అదే ఆంధ్రలో జరిగి వుంటే ఎంత దుమ్మెత్తి పోసేవారో కదానిపించింది.

దాదాపు 900 ఏళ్ల చరిత్ర వున్న పూరి జగన్నాథాలయానికి ఎన్నో ఆస్తులున్నాయి. ఎంతో సంపద వుంది. ఒడిశాను ఏలిన రాజులందరూ జగన్నాథ భక్తులే. వాళ్లే కాదు, ప్రజలూ ఎన్నో విలువైన కానుకలు, కోట్లాది విలువ చేసే నగలూ యిచ్చారు. వాటిని ఆలయంలోనే రత్నభండారంలో దాచారు. వాటి జాబితా తయారు చేసి, కనీసం నాలుగైదేళ్ల కోసారైనా జాబితా ప్రకారం ఉన్నాయా లేదాని చెక్ చేయాలి. కానీ దానిని 1978 తర్వాత ఆ చెకింగ్ జరగలేదు. అప్పటి లెక్క ప్రకారం 120 కిలోల బంగారం, 221 కిలోల వెండి వుంది. భండారాన్ని ఆఖరిసారిగా 1984లో తెరిచారు. 2018లో మళ్లీ తెరవబోతే మధ్యలో తాళంచెవులు మారిపోయాయని తెలిసింది. అప్పటినుంచి యిప్పటిదాకా అవేమయ్యాయో తేలలేదు. తేల్చడం గురించి ఒడిశా ప్రభుత్వం కాళ్లీడుస్తోంది తప్ప గట్టి చర్యలు తీసుకోవడం లేదు.

రత్నభండారంలో 7 గదులున్నాయి. బయటి మూడిటిలో స్వామివారి నిత్యసేవలకు సంబంధించిన వస్తువులన్నీ పెడతారు. వాటిలో వజ్రవైఢూర్యాలు, వెండి బంగారాలు కూడా వుంటాయి. తక్కిన లోపలి నాలుగు గదుల్లోనూ అత్యంత విలువైన వజ్రాలూ అవీ పెడతారు. వాటిలో 150 రకాల స్వర్ణాభరణాలు ఉన్నాయట. ఆర్కియాలజీ డిపార్టుమెంటు 2016 నుంచి పూరీ గుడిని పరిశీలిస్తూ అవసరమైతే మరమ్మత్తులు చేస్తూ వచ్చింది కానీ రత్నభండారం జోలికి పోలేదు. ఆ డిపార్టుమెంటు పనులను పర్యవేక్షిస్తున్న హైకోర్టు ‘రత్నభండారం స్ట్రక్చర్ బలంగా వుందో, లేదో చూసి, అవసరమైతే దాన్ని పటిష్టం చేయడానికి చర్యలు సూచించండి’ అని ఆదేశించడంతో 2018 ఏప్రిల్‌లో ఆర్కియాలజీ డిపార్టుమెంటుకు సంబంధించిన 17 మంది అధికారుల బృందం భండారంలోకి అడుగుపెట్టింది.

వాళ్లకు గుడివాళ్లు యిచ్చిన తాళం చెవులతో భండారం లోపలి నాలుగు గదుల తాళాలు తెరవబోతే తెరుచుకోలేదు. వీటిని కితం సారి ఎప్పుడు వాడేరు అని చూడబోతే 34 ఏళ్లయిందని తెలిసింది. ఇన్నేళ్లలో ఎవరు తాళాలు మార్చాశారో తెలియదు. ఇంకేం చేయలేక వెనక్కి వచ్చేశారు. బయట వేచి వున్న మీడియా వాళ్లతో గుడి చీఫ్ ఎడ్మినిస్ట్రేటర్ ప్రదీప్ జేనా ఐఏఎస్ ‘రత్నభండారం లోపలకి వెళ్లవలసిన అవసరం కనబడలేదు, సెర్చ్‌లైట్ల సహాయంతో స్ట్రక్చర్ పటిష్టంగా వుందని కనిపెట్టేశాం.’ అని చెప్పేశాడు. కానీ వెనువెంటనే జరిగిన మేనేజింగ్ కమిటీ మీటింగులో పెద్ద గొడవ జరిగింది. ఆలయ ప్రధాన సేవకుడిగా చెప్పుకునే గజపతి రాజు దివ్యసింగ్ దేవ్ తాళంచెవుల సంగతి తేలాల్సిందే అని గట్టిగా పట్టుబట్టారు.

గుడి ప్రతిష్ఠ పోతుందని ఆ విషయం దాచిపెట్టారు కానీ రెండు నెలల తర్వాత ఒడిశా టీవీ బయట పెట్టేసింది. తెరవాల్సిన అవసరం లేకపోతే మరి తమ వెంట తాళం చెవులు ఎందుకు పట్టుకెళ్లారు? అవి పనిచేయలేదని తేలిన తర్వాత యిలాటి కబుర్లు చెప్తున్నారు అని దులిపేసింది. ‘ఏ కారణంగానైనా తాళాలు బిగిసిపోయి, చెవి పనిచేయకపోతే వెంట తీసుకెళ్లిన గ్యాస్ కట్టర్లను ఉపయోగించవచ్చు కదా! లోపలకి వెళ్లి హైకోర్టు ఆదేశాలను మన్నించి వుండవచ్చుగా’ అని జగన్నాథ సేన అనే సామాజిక సంస్థ ప్రతినిథి ప్రశ్నించారు. అంతమంది సభ్యుల సమక్షాన కట్ చేసి, తెరిచి మళ్లీ తాళాలు బిగించడానికి అయ్యే ఖర్చు కొన్ని వందల్లో వుంటుంది. ఆ పని చేయకుండా తాళం చెవులెలా పోయాయో కనిపెట్టండి అంటూ ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. దాని ఖర్చు 2019 నాటికే రూ. 22 లక్షలు!

తాళంచెవులు మిస్సింగ్ అనగానే భండారంలోంచి భారీగా చోరీ జరిగివుంటుందన్న పుకార్లు షికారు చేశాయి. నిరసన ప్రదర్శనలు వెల్లువెత్తాయి. దాంతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రదీప్ జేనాను బదిలీ చేసేసి, రిటైర్డ్ హైకోర్టు జజ్ రఘువర్ దాస్ నేతృత్వంలో విచారణకు ఆదేశించాడు. 2018 జూన్ 14న జిల్లా అధికారులు మా దగ్గర డూప్లికేట్ కీస్ వున్నాయి అనడంతో మరో వివాదం తలెత్తింది. గుడి ఎడ్మినిస్ట్రేషన్ యొక్క మాజీ సభ్యులు ‘ఒరిజినల్ కీస్ పూరి జిల్లా కలక్టరేట్‌ లోని ట్రెజరీలో దాచి వుంచుతారు. డూప్లికేట్ కీస్ ప్రసక్తే లేదు’ అన్నారు. ‘వజ్రాల గదికి డూప్లికేట్ కీస్ వుండడానికి గుడి నియమాలు ఒప్పుకోవు. ఇవి ఎక్కణ్నుంచి వచ్చాయి?’ అని చరిత్రకారులు అడిగారు. వీటి మధ్య రఘువర్ దాస్ తన 324 పేజీల రిపోర్టును 2018 నవంబరు 30న హోం శాఖకు అందచేశారు. దాన్ని ప్రభుత్వం బయటపెట్టలేదు. అసెంబ్లీలోనే సమర్పిస్తాం అన్నారు. 8 నెలల తర్వాత కాంగ్రెసు లీడరు దాని గురించి అసెంబ్లీలో ప్రశ్నిస్తే ‘ప్రభుత్వం ఆ రిపోర్టును పరిశీలిస్తోంది. పరిశీలన పూర్తి కాగానే సమర్పిస్తాం’ అన్నాడు మంత్రి.

రత్నభండారం తెరిచి, దానిలో వున్న వస్తువుల జాబితా తయారు చేయించమని 2019 అక్టోబరులో ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రికి లేఖ రాశాడు. ఇప్పటిదాకా ప్రభుత్వ కదలకుండా, మెదలకుండా కూర్చుంది. తాళంచెవుల మాట ఎలా వున్నా అసలు రత్నభండారం భద్రంగా వుందా లేదా అన్న సందేహం రావడంతో ఒక సమాచార హక్కు కార్యకర్త ప్రశ్న అడిగాడు. 2021 ఆగస్టులో వచ్చిన సమాధానంలో ‘తేమ కారణంగా భండారం శిథిలావస్థలో వుంది. గోడల్లో పగుళ్లు వచ్చి అనేక చోట్ల సున్నం రాలిపోయింది. సీలింగుకు సపోర్టుగా వున్న యినుప చువ్వలు చాలా చోట్ల మాయమై పోయాయి. దన్నుగా నిలబడిన రాతిస్తంభాలు అక్కడక్కడ విరిగిపోయాయి.’ అని వుంది. 2021 నవంబరులో మరో వార్త వచ్చింది.

మరో ఆర్‌టిఐ (సమాచార హక్కు) కార్యకర్త దిలీప్ కుమార్ బరాల్ వేసిన ప్రశ్నకు సమాధానంగా పూరి జిల్లా ట్రెజరీ ఆఫీసరు ‘మా స్ట్రాంగ్ రూము రిజిస్టర్‌ను 1970 నుంచి క్షుణ్ణంగా పరిశీలించాం. మా దగ్గర ఒరిజినల్ కానీ డూప్లికేట్ కీస్ కానీ డిపాజిట్ చేసినట్లు రికార్డులో లేదు.’ అని జవాబిచ్చారు. అంటే తాళంచెవుల సంగతి ఎవరికీ ఏమీ తెలియదా? వాటిని ఎక్కడ భద్రపరుస్తున్నారు? ఎవరి అజమాయిషీలో వుంటోంది? ఎవరికైనా దుర్బుద్ధి పుట్టి కొన్ని పట్టుకుపోతే కనిపెట్టడం ఎలా? ఎవరిని బాధ్యుల్ని చేయాలి? ప్రభుత్వం ఏమీ చేయకుండా ఎందుకుంది? తవ్వడం మొదలుపెడితే అనేక అస్తిపంజరాలు బయటపడతాయని భయపడుతోందా? బయటపడితే 21 ఏళ్లగా సిఎంగా వున్న నవీన్‌దే ప్రధాన బాధ్యత అవుతుందని బెదురా? రిపోర్టు బయట పెట్టకపోవడం వింతగా లేదా?

ఇదే సంఘటన ఆంధ్రలో జరిగి వుంటే జగన్‌పై ఎంత దుమారం రేగేదో ఊహించవచ్చు. క్రైస్తవుడు కాబట్టే ఉదాసీనంగా వుంటూ గుడి వ్యవహారాలు చక్కబెట్టలేదని అనేవారు. చంద్రబాబు హయాంలో తిరుపతి గుడిలో లంకెబిందెల కోసం తవ్వకాలు జరిగాయని జగన్ మీడియా నానా హడావుడి చేసింది. గులాబీ రంగు వజ్రం చోరీ అయిపోయిందని పెద్ద గలభా చేసింది. పూజారులు కూడా అసత్యారోపణలు చేస్తున్నారని కొందరన్నారు. ఆరోపణల్లో నిజం వుందని వైసిపి నమ్మి వుంటే అధికారంలోకి రాగానే విచారణకు ఆదేశించి స్వామిపై భక్తిని నిరూపించుకోవాల్సింది. గుడికి సంబంధించి ఏదైనా అనుమానం రగలగానే దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూడడం తప్ప, పరిస్థితిని చక్కదిద్దాలని తోచదు యీ నాయకులకు. అన్నట్లు తిరుపతి గుడి ఖజానా ఇన్వెన్టరీ ఎప్పుడు తీసుకున్నారు? 2020 జనవరిలో రీవెరిఫికేషన్ జరిగినట్లు, కొన్ని మిస్ అయితే సంబంధిత అధికారి నుంచి రాబడుతున్నట్లు నెట్‌లో చూశాను.

మళ్లీ పూరి దగ్గరకు వస్తే, వెరిఫికేషన్ జరిగితే కానీ ఎన్ని ఉన్నాయో, ఎన్ని పోయాయో తెలియదు. కానీ జరగనివ్వటం లేదు. ఈ గొడవ యిలా నడుస్తూండగానే మరో వివాదం యిటీవలే బయటకు వచ్చింది. ఫైనాన్స్ డిపార్టుమెంటు వాళ్లు గుడికి 2003-21 మధ్యలో రూ.142 కోట్ల నిధులు యిచ్చారట. అవి ఎలా వినియోగమయ్యాయో చూపే యుసి (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) గుడి ఎడ్మినిస్ట్రేషన్ సబ్మిట్ చేయలేదట. డిసెంబరు 2న ప్రభుత్వ న్యాయశాఖ వాటి గురించి అడుగుతూ 2003-21 కాలంలో జరిగిన ఖర్చుల వివరాలు డిసెంబరు 10లోగా తెలపండి అని కూడా అడిగింది. ‘ఇన్నేళ్లగా వీళ్లు యివ్వకపోవడం తప్పే. కానీ యిప్పటిదాకా అడగకపోవడం వాళ్లదీ తప్పే కదా’ అంటున్నాడు ఆర్‌టిఐ కార్యకర్త దిలీప్ బరాల్. ‘అబ్బే, మేం ప్రతీ ఏడాదీ యిస్తూనే వున్నాం. కావాలంటే వాటి కాపీలు మా దగ్గరున్నాయి.’’ అంటున్నాడు గుడి ఎడ్మినిస్ట్రేటర్ అజయ్ జేనా.

ఇదే కాకుండా యింకో ప్రశ్న కూడా వచ్చింది. స్వామివారికి రోజూ అర్పించే ‘కోఠా భోగ’ (రాజభోగ) నైవేద్యానికై ఏటా రూ. 55 లక్షలు ప్రభుత్వం యిస్తోంది. దానిలో ప్రధాన ఐటమ్స్‌లో ఒకదాన్ని గత ఐదు నెలలుగా ఆపేశారట. ఆ మేరకు గ్రాంటును కూడా తగ్గించాలిగా అని అడుగుతున్నారు కొందరు. ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్తారు? లోగుట్టు పెరుమాళ్ల కెరుక అంటారు. జగన్నాథుడు కూడా పెరుమాళ్లే. ఆయనకే తెలియాలి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

mbsprasad@gmail.com

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు