చేసే పనిలో కాకుండా, వ్యక్తులను బట్టి మంచీచెడులను నిర్ణయించే దురవస్థలో బతుకీడిస్తున్నాం. మంచి ఉద్దేశంతో చేసే పనిలో కూడా దురేద్దేశాల్ని ఆపాదించేలా మన రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టింది. అందుకే మంచి చేయడానికి కూడా చాలా ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తన రాష్ట్రంలోని మదర్ థెరిస్సా చారిటీకి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఒకవేళ ఇదే మంచి పనిని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ చేసి వుంటే…బహుశా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఉద్యమాలు జరిగేవేమో! జగన్ క్రిస్టియానిటీని సాకుగా చూపి మత మార్పిళ్ల కోసం పెద్ద ఎత్తున మదర్ థెరిస్సా చారిటీకి నిధులు మంజూరు చేశారని బీజేపీ నేతృత్వంలో ఏపీలో ప్రతిపక్షాలన్నీ ఏకమై పోరాటాలు చేసేవనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఇటీవల విదేశాల నుంచి మదర్ థెరిస్సా చారిటీకి నిధులు ఆగిపోయాయి. ఎఫ్‌సీఆర్ఏ రెన్యువల్స్‌ను కేంద్ర హోంశాఖ పెండింగ్‌లో పెట్టింది. ఇందుకు టీటీడీ కూడా అతీతం కాదు. కేంద్రహోంశాఖ వైఖరితో టీటీడీకి ఏటా రావాల్సిన రూ.50 కోట్లు నిధులకు అడ్డంకి ఏర్పడింది. దీనిపై విమర్శలొచ్చిన కేంద్రం మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇక మదర్ థెరిస్సా చారిటీ విషయానికి వస్తే…ఈ సంస్థ నేతృత్వంలో ఒడిశాలోని 8 జిల్లాల్లో 13 సంస్థలు నడుస్తున్నాయి. వీటిలో మొత్తం 900 మంది జీవనం సాగిస్తున్నారు. విదేశీ నిధులు రాకపోవడంతో వారికి భోజనం, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తాయి. ఈ విషయం తెలిసి సీఎం నవీన్‌పట్నాయక్ మానవత్వాన్ని చాటుకున్నారు. చారిటీ సంస్థలకు రూ.78.76 లక్షలు మంజూరు చేస్తున్నట్టు ఒడిశా సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఈ నిధులను వాడుకోవాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు.
నవీన్‌పట్నాయక్ స్థానంలో ఒక్కసారి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఊహించుకోండి…ఇంకేమైనా ఉందా? అని ఎవరైనా అంటారు. ఎందుకంటే గుంటూరులో జిన్నా టవర్, విశాఖ కేజీహెచ్ పేర్లను మార్చాలని డిమాండ్ చేస్తున్న రాజకీయ నాయకులను మనం ఆంధ్రాలో చూస్తున్నాం. అందుకే మంచీ, చెడుతో నిమిత్తం లేదు…ఎవరి కోసం అనేది ఆంధ్రాలో ముఖ్యం. ప్రతిదీ రాజకీయమే అయిన చోట విచక్షణకు చోటెక్కడ ఉంటుంది!