ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు అక్కసు వెళ్లగక్కారు. జగన్‌ను చరిత్ర ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు. అలాగే అసెంబ్లీపై చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. తాను తిరిగి ముఖ్యమంత్రిగా తప్ప, అసెంబ్లీలో అడుగు పెట్టే ప్రశ్నే లేదని చంద్రబాబు ఇటీవల శపథం చేసిన సంగతి తెలిసిందే. అసెంబ్లీని బహిష్కరించడానికి దారి తీసిన పరిస్థితులు ఆయన్ను నీడలా వెంటాడుతున్నట్టున్నాయి. అందుకే మరోసారి అసెంబ్లీ సమావేశాలపై మండిపడ్డారు.
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలతో విస్తృతస్థాయి సమావేశం చేపట్టారు. ఇందులో భాగంగా చంద్రబాబు ఆవేశంతో ఊగిపోయారు. రాష్ట్రానికి వైసీపీ గ్రహణం పట్టిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని అధికార పార్టీ ధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో బూతులు తప్ప ఏమీ లేవన్నారు. న్యాయ వ్యవస్థపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించారని ఆరోపించారు. టీడీపీకి అధికారం కొత్తకాదని, ప్రతిపక్షం కొత్త కాదని చెప్పుకొచ్చారు. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకున్న పరిస్థితులు మాత్రం ఈ సమాజానికే కొత్తవని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
జగన్‌రెడ్డికి వ్యక్తిత్వం లేదని, అంతకంటే విశ్వసనీయత అసలే లేదని చంద్రబాబు విమర్శించారు. ఒకవేళ జగన్‌ను ప్రజలు మర్చి పోయినా చరిత్ర ఎప్పటికీ క్షమించదని శపించారు. ఇలాంటి మూర్ఖపు సీఎంని తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు. మార్చి 29నాటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్లు అవుతుందని చెప్పారు. ఎన్టీఆర్ వందేళ్ల జయంతి ఉత్సవాల్ని చేసుకోబోతున్నామన్నారు. సుపరిపాలన అందించిన ఘనత టీడీపీదేనన్నారు.
ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన వైనాన్ని చరిత్ర క్షమిస్తుందని చంద్రబాబు ఎలా అనుకుంటున్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. భారతదేశ రాజకీయ చరిత్రలో వెన్నుపోటు చాప్టర్లో చంద్రబాబుకు ఎప్పటికీ అగ్రస్థానం దక్కుతుందని ఆయన ప్రత్యర్థులు సెటైర్స్ విసురుతున్నారు. ఇంతకూ తన పార్టీకి పట్టిన గ్రహం, తన కుటుంబంలోనే ఉన్నాడని బాబు గ్రహిస్తున్నారా? లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.