ఆయన అవినీతిపరుడని ప్రచారం ….దాన్నెందుకు బయటపెట్టరు?

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో రాష్ట్రంలో బీజేపీ కల్లోలం రేపుతోంది అందరూ అనుకున్నారు. బండి సంజయ్ అరెస్టుతో బీజేపీ నాయకులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రంకెలు వేశారు. వీరంగం వేశారు. ఢిల్లీ నుంచి…

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో రాష్ట్రంలో బీజేపీ కల్లోలం రేపుతోంది అందరూ అనుకున్నారు. బండి సంజయ్ అరెస్టుతో బీజేపీ నాయకులు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. రంకెలు వేశారు. వీరంగం వేశారు. ఢిల్లీ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆగమేఘాల మీద హైదరాబాదుకు వచ్చారు.

పోలీసులు అడ్డుకున్నా ర్యాలీలు తీస్తామన్నారు. బీజేపీ నాయకుల ప్రకటనలు చూస్తే పోలీసులతో యుద్ధకాండ జరుగుతుందేమోనని అనుమానం కలిగింది. కానీ ఏమీ కాలేదు. సంజయ్ అరెస్టుకు నిరసనగా నడ్డా గాంధీ మాహాత్ముని విగ్రహానికి నివాళులు అర్పించి ఊరుకున్నారు. కొవ్వొత్తుల ర్యాలీ మానుకున్నారు.

బండి సంజయ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. చివరకు నడ్డా చేసిన పనేమిటీ అంటే మీడియా సమావేశం పెట్టి కేసీఆర్ లు అవినీతిపరుడని తిట్టారు. కేసీఆర్ కు మతి తప్పిందని, దుబ్బాక, హుజూరాబాద్ లో బీజేపీ గెలవడంతో ఆయనకు పిచ్చెక్కిందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని. రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని ….ఇలా తీవ్రంగా మండిపడ్డారు నడ్డా.

కేసీఆర్ పెద్ద అవినీతిపరుడని యధా ప్రకారం తిట్లలో దాన్ని కూడా జోడించారు. కేసీఆర్ ను నడ్డా కొత్తగా తిట్టింది ఏమీ లేదు. రాష్ట్ర బీజేపీ నాయకులు రోజూ తిట్టే తిట్లే. కేసీఆర్ అవినీతిపరుడని బీజేపీ నాయకులు రోజూ ప్రచారం చేస్తున్నారు. ఇది ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తున్నదో తెలియదు. కేసీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని అంటుంటారు. 

కానీ కేసీఆర్ ఫలానా అవినీతి పనులు చేశాడని, అవినీతి చేసి  ఇంత సంపాదించాడని ఇప్పటివరకూ ఒక్క ఆధారమూ చూపించలేదు. జగన్ ఏపీ ముఖ్యమంత్రి కాకముందు కేసులు పెట్టినట్లుగా కేసీఆర్ మీద పెట్టారా అంటే అదీ లేదు. కానీ జైలుకు వెళ్లడం ఖాయమని అంటుంటారు. కానీ కేసీఆర్ ఫలానా విధంగా అవినీతికి పాల్పడ్డారు అని చెప్పే ధైర్యం బీజేపీ నాయకులకు లేదనే అనుకోవాలి.