ఆంధ్రప్రదేశ్ సినిమా ధరల నియంత్రణ విషయంలో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ చేస్తున్న వాదన రాంగ్ రూట్‌లో వెళుతోంది. తన వాదనను నెగ్గించుకునే క్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిపై హద్దు దాటి ప్రవర్తించారనే అభిప్రాయాలు ఇండస్ట్రీ నుంచే వ్యక్తం కావడం గమనార్హం. గత రెండు రోజులుగా ఏపీ ప్రభుత్వంపై సోషల్ మీడియాతో పాటు వివిధ వేదికల మీదుగా వర్మ తన మార్క్ దాడికి పాల్పడుతున్నారు.
ఏపీ ప్రభుత్వానికి వర్మ పది ప్రశ్నలు సంధించడం, వాటికి మంత్రి పేర్ని నాని దీటైన సమాధానాలు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో పేర్ని నానికి రీట్వీట్ చేస్తూ… వర్మ పరుష వ్యాఖ్యలను ప్రయోగించడం అధికార పార్టీకి తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. ఒక వైపు నాని డిగ్నీతో సామరస్యం పాటించాలని వర్మ ట్విటర్‌లో ధన్యవాదాలు చెబుతూనే, మరో వైపు ఆయన ఆ సంప్రదాయాన్ని పాటించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. వర్మ తాజా ట్వీట్స్‌ను పరిశీలిద్దాం.
‘పేర్ని నాని గారు మీ పార్టీ లో కొందరు మిగతా లీడర్ల లాగా అడ్డంగా తిట్లతోనో పర్సనల్ విషయాల మీద దూకడం కాకుండా డిగ్నిటీతో సామరస్యం పాటించినందుకు ఇంకొక్కసారి నా ధన్యవాదాలు. ఒక అంగీకారం అనేది లాజిక్ ఇచ్చిపుచ్చుకున్నప్పుడే వస్తుంది’
అలాగే పేర్ని నాని ఇచ్చిన ఏ సమాధానంపై వర్మ తన పరిధిని అతిక్రమించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు’ అని నాని చెబితే…వర్మ అభ్యంతరకర ట్వీట్ ఏంటో చూద్దాం.
‘నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వంలో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్‌కి కూడా తేడా లేదా?’…ఇది నిజంగా ఏపీ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడానికి ఉద్దేశ పూర్వకంగానే నానిని అవమానించేలా ట్వీట్ చేశారని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు.
వైసీపీ నేతల్లా పర్సనల్ విషయాల మీద దూకకుండా ఎంతో హూందాగా సమాధానం ఇచ్చారని పేర్ని నానిని అభినందిస్తూనే, తాను చేసిందేమిటి? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పేర్ని నానిని డ్రైవర్‌తో జమ కట్టాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలొస్తున్నాయి. తన దగ్గర సమాధానం లేకపోవడం వల్లే వ్యక్తిగత దాడికి వర్మ దిగజారారని, ఇది చిత్ర పరిశ్రమకు లాభమో, నష్టమో వారే ఆలోచించుకోవాలని నెటిజన్లు హితవు చెబుతున్నారు.