ఊ అనడు.. అచ్చెన్న ఉఊ అనడు..!

ఊ అనాలన్నా, ఊఊ అనాలన్నా.. అసలు మనం చెప్పేది వినాలి. కానీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అస్సలు ఎవరి మాటా వినేలా లేరు, ఎవరు ఏం చెప్పినా వినపడనంత దూరంలో ఉన్నారు.  Advertisement…

ఊ అనాలన్నా, ఊఊ అనాలన్నా.. అసలు మనం చెప్పేది వినాలి. కానీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అస్సలు ఎవరి మాటా వినేలా లేరు, ఎవరు ఏం చెప్పినా వినపడనంత దూరంలో ఉన్నారు. 

తన నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటంలేదట. టెక్కలి టీడీపీ కేడర్ అంతా ఇప్పుడు ఇదే విషయంపై కంప్లయింట్ చేస్తోంది. అచ్చెన్నాయుడు అందనంత దూరంలో ఉంటున్నారంటూ వాపోతోంది.

అసెంబ్లీకే దూరమా..? అందరికీ దూరమా..?

నేను సీఎం అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టబోనంటూ శపథం చేసి మరీ బయటకెళ్లిపోయారు చంద్రబాబు. బాబుతో పాటే మేము కూడా అంటూ అసెంబ్లీ నుంచి వాకవుట్ చేశారు అచ్చెన్నాయుడు. అంటే అసెంబ్లీకి వెళ్లే పని తప్పిపోయిందని ఆయన సంబరపడిపోతున్నట్టు తెలుస్తోంది. 

అంతే కాదు. అసెంబ్లీకే వెళ్లనప్పుడు, ఇక సొంత నియోజకవర్గానికి వెళ్లడం ఎందుకనుకున్నారేమో.. విజయవాడ లేదా విశాఖలో కాలం గడిపేస్తున్నారు అచ్చెన్న.

తుమ్మితే ఊడిపోయే పదవి అయినా సరే..

అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీకి అధ్యక్షుడు. అంతమాత్రాన ఆయన చేతిలో ఏవో విశేష అధికారాలుంటాయని, ఏపీ టీడీపీ కేడర్ అంతా ఆయన చేతుల్లో ఉంటుందని, ఆయన మాట చెల్లుబాటు అవుతుందని అనుకోలేం. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే ఆ మాత్రానికే ఆయన సొంత నియోజకవర్గాన్ని వదిలిపెట్టారు. విజయవాడలో సెటిలయ్యారు, లేదంటే విశాఖలో ఉంటున్నారు.

టీడీపీ నుంచి గెలిచిన 23మంది ఎమ్మెల్యేలలో అచ్చెన్నాయుడు కూడా ఒకరు. అంటే రాష్ట్రమంతా వైసీపీ ఫ్యాన్ గాలి వీచినా.. టెక్కలి ప్రజలు మాత్రం తమ నాయకుడిగా అచ్చెన్నాయుడే ఉండాలనుకున్నారు. కానీ ఆ నమ్మకాన్ని అచ్చెన్న వమ్ము చేస్తున్నారు. ఏకంగా అచ్చన్నాయుడే రెండుసార్లు జైలుకెళ్లొచ్చే సరికి కేడర్ కూడా భయపడుతున్నారు. కనీసం వైరి పక్షాలను ఎదుర్కునే ధైర్యం చేయలేకపోతున్నారు. అందుకే స్థానిక ఎన్నికల్లో కూడా ఎవరూ పోటీకి మొగ్గు చూపలేదు.

అటు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలిలో పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఆయనకు ఎదురెళ్లేందుకు టీడీపీ నేతలు సాహసం చేయడం లేదు. ఒకరకంగా అచ్చెన్నాయుడు నియోజకవర్గాన్ని గాలికొదిలేశారని, అక్కడ పార్టీ పరిస్థితి, పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటున్నారు. 

గతంలో ఎర్రన్నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నా కూడా జిల్లాలో పార్టీని బలపరిచేందుకు కృషిచేసేవారని, ప్రతి ఒక్కరికీ సమయం కేటాయించేవారని, కార్యకర్తలను బాగా చూసుకునేవారని గుర్తు చేసుకుంటున్నారు. అచ్చెన్నాయుడి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉందని గుసగుసలాడుకుంటున్నారు.