ఇటీవల ప్రజాగ్రహ సభలో చీప్ లిక్కర్ ధరలపై కామెంట్స్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును పూర్తిగా మార్చేశాయి. ఆయనలో పౌరుషం రోజురోజుకూ పెరుగుతోంది. పరువు పోయిన చోటే వెతుక్కోవాలని ఆయన ఉబలాటపడుతున్నట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా జగన్‌కు అనుకూలమనే ముద్ర నుంచే బయటపడేందుకు సోము వీర్రాజు కాస్త దూకుడు పెంచారనే అభిప్రాయాలకు బలం కలిగించేలా ఆయన విమర్శలున్నాయి.
తాజాగా జగన్ ప్రభుత్వానికి ఆయన సవాల్ విసిరారు. ఎవరొస్తారో రాండి చూద్దామంటూ ఆయన ఏపీ ప్రభుత్వంపై కాలు దువ్వడం గమనార్హం. ఇవాళ మీడియాతో సోము వీర్రాజు మాట్లాడుతూ గుంటూరులో జిన్నా టవర్‌తో పాటు విశాఖ కేజీహెచ్ పేరు కూడా మార్చాలని డిమాండ్ చేశారు. ఇకపై జగనన్న కాలనీలను మోదీ కాలనీలుగా మారుస్తామని.. ఎవరొస్తారో చూస్తామని ఆయన హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చుకుని ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. తమ బొమ్మలు వేస్తే వైసీపీ వారికి అన్ని తడిసిపోతాయని సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో కేంద్రం ముఖ్య పాత్ర పోషించిందన్నారు. సోము వీర్రాజు వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు విసురుతున్నారు. జగన్న కాలనీలను మోదీ కాలనీలుగా మారుస్తామని ఏ హక్కుతో చెబుతున్నారో వివరించాలని డిమాండ్ చేస్తున్నారు.
అంత ధైర్యమే ఉంటే జిన్నా టవర్, విశాఖ కేజీహెచ్ పేర్లను ఎందుకు మార్చలేకపోతున్నారని నెటిజన్లు నిలదీస్తున్నారు. వీర్రాజు గారూ ఎందుకీ ఉత్తర కుమార ప్రగల్భాలని దెప్పి పొడుస్తున్నారు. మొత్తానికి ప్రగల్భాల్లో తగ్గేదేలే అనే రీతిలో సోము ఉన్నారనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.