రోజులు మారాయి, గతంలో పెళ్లికి ముందు ప్రశ్నలనేవి ఏమైనా ఉంటే అవి అబ్బాయి వైపు నుంచి అడేగేవే తప్ప అమ్మాయి డైరెక్టుగా అడిగే ప్రశ్నలంటూ ప్రత్యేకంగా ఉండేవి కావనే అనుకోవాలి. అయితే ఇప్పుడు పెళ్లికి ముందు, కనీసం ఒకర్నొకరు చూసుకోవడానికి ముందే ఫోన్ సంభాషణలు మొదలవుతున్నాయి. పెళ్లి చూపుల ప్రపోజల్స్ విషయంలో అబ్బాయిని చూడటానికన్నా ముందే అతడితో మాట్లాడేసి, ఆ తర్వాతే పెళ్లి చూపులైనా జరగడమా, వద్దా అనే అంశంపై అమ్మాయిలే క్లారిటీ ఇస్తూ ఉన్నారు.
కొన్ని కొన్ని ప్రశ్నలకు అయితే ఏం చెప్పాలో కూడా తెలియక అబ్బాయిలు ఇబ్బంది పడిపోయే పరిస్థితి కూడా సాధారణంగా మారింది. పెళ్లి తర్వాత విదేశాలకు వెళ్లే ఆలోచన ఉందా.. అమ్మాయిలు అడిగే ప్రశ్నకు ఏ సాఫ్ట్ వేర్ అబ్బాయి అయినా ఏం సమాదానం చెప్పగలడు! కంపెనీ ఆన్ సైట్ ఆఫరిస్తే అతడూ వెళ్దామనే ఉన్నా, అమ్మాయి అలాంటి ప్రశ్న అడిగితే, నీ జాబ్ లో అలాంటి అపర్చునిటీ ఉందా లేదా అని ఆరా తీస్తే.. దానికి
సమాధానం ఇవ్వడం తేలికేమీ కాదు! ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న అబ్బాయిలు చాలా మందే ఉండవచ్చు! కేవలం ఇలాంటి ప్రశ్నలే కాదు..అమ్మాయిల అమ్ముల పొదిలే అబ్బాయిలపై సంధించడానికి చాలా పదునైన ప్రశ్నలే ఉన్నాయనేది రిలేషన్ షిప్ కౌన్సెలర్ల మాట!
నీ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి!
ఏ జాబ్ ఇంటర్వ్యూలోనో ఇలాంటి ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. నీకు ఈ జాబ్ ఇస్తే నీ లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటి? షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి? ఈ కెరీర్ లో వచ్చే ఐదేళ్లలో నిన్ను నీవు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నావు? మొదటి 45 రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నావు.. వంటి ప్రశ్నలను జాబ్ ఇంటర్వ్యూల్లో వేస్తూ ఉంటారు. మరి అమ్మాయిలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఆ ప్రశ్నను తమకు కాబోయే వాడి ప్రాబబుల్స్ లో ఉన్న వాడిని కచ్చితంగా అడిగే అవకాశం ఉంది. మరి పెళ్లి చూపులకు వెళ్లాలనుకునే వారు ఈ ప్రశ్నకు సమాధానాన్ని రెడీ చేసుకుని ఉండాలి!
రిలేషన్ షిప్ మీద నీ అభిప్రాయం!
ఇంత పద్ధతిగా అందరూ అడగలేకపోయినా.. వైవాహిక జీవితాన్ని ఎలా చూస్తావు? ఆ రిలేషన్ షిప్ గురించి అభిప్రాయం ఏమిటనే అంశం గురించి అడగడానికి అమ్మాయిల తహతహ ఉంటుంది. అంటే మ్యారిడ్ లైఫ్ విషయంలో ఫిక్సడ్ ఫార్మాట్ ఏమైనా అనుకుంటున్నావా, లేదా ఇలానే ఉండాలనే నియమాలను ఏమైనా సెట్ చేస్తావా, నిబంధనలు ఏమైనా వర్తిస్తాయా.. అనే అంశాలను ఆరా తీసే ఉద్దేశం ఉంటుంది ఈ ప్రశ్న వెనుక!
నా నుంచి ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నావు!
వైవాహిక జీవితంలో తన నుంచి తనకు కాబోయే వాడు ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడో, అది ఎమోషనల్ గా , ఫిజికల్ గా ఎలాంటి ఎక్స్ పెక్టేషన్లతో ఉన్నాడనే అంశాల గురించి క్లారిటీ తీసుకోవడానికి అమ్మాయిలు సదా ప్రయత్నంలోనే ఉంటారు. అయితే ఈ ప్రశ్నలకు కొంత మొహమాటం అడ్డు రావొచ్చు!
స్ట్రెస్ టైమ్ ను ఎలా మేనేజ్ చేస్తావు!
కోప్పడతావా, జాబ్ టెన్షన్ ఇంట్లో చూపిస్తావా, స్ట్రెస్ టైమ్ ను ఎలా మేనేజ్ చేస్తావు.. ఈ ప్రశ్నలు కూడా తదుపరి వరసలో ఉంటాయి!
ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి మాట్లాడదామా!
ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి మాట్లాడటానికి కూడా అమ్మాయిలకు ఈ దశలో చాలా ఆసక్తి ఉంటుంది. ఎంత జీతం వస్తోంది, అందులోకటింగ్స్ ఎంత, ఖర్చులు ఏంటి, పొదుపు ఎంత, లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది.. అనే అంశాల గురించి ఆరాతీయడానికి కూడా వారు చాలా ప్రయత్నాలే చేస్తారు. ఈ దశలో వాస్తవభరితమైన సమాచారాన్నే వారు ఎక్స్ పెక్ట్ చేస్తారు. ఇప్పుడొకటి చెప్పి, ఆ తర్వాత మరోలా ఉంటే మాత్రం.. మోసపోయామనే ఫీలింగ్ తప్పక ఉంటుంది.
ఇంటి పనుల్లో ఎంత సాయం చేస్తావు?
నీకు ఎన్ని పనులున్నా ఫర్వాలేదు నా పనుల్లో నీ సాయం ఎంత అనే అంశంపై కూడా వారు క్లారిటీని ఎక్స్ పెక్ట్ చేస్తారు. పెళ్లైన తొలి వారంలోనే వేరు కాపురంగా ఇద్దరే ఉన్నా.. మొత్తం పనంతా నా మీదేనా..అని ఫీలయ్యే అమ్మాయిలున్న రోజులు ఇవి!