మళ్లీ మంత్రిగా మారి భజన చేయడమేనా?

కొందరి జాతకాలు అంతే. ఎదిగినట్లే ఎదిగి అంతలోనే పాతాళానికి జారిపోతారు. ఆటలో అరటిపండులా, కూరలో కరివేపాకులా మిగిలిపోతారు. ఎందుకలా అయిపోతారనేదానికి 'ఇదీ కారణం' అని చెప్పలేం. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం మళ్లీ పాతాళానికి వెళ్లిపోయారు.…

కొందరి జాతకాలు అంతే. ఎదిగినట్లే ఎదిగి అంతలోనే పాతాళానికి జారిపోతారు. ఆటలో అరటిపండులా, కూరలో కరివేపాకులా మిగిలిపోతారు. ఎందుకలా అయిపోతారనేదానికి 'ఇదీ కారణం' అని చెప్పలేం. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరుశెల్వం మళ్లీ పాతాళానికి వెళ్లిపోయారు. ఎటువంటి రాజకీయ అనుభవం లేని శశికళ నటరాజన్‌ కేవలం దివంగత జయలలిత స్నేహితురాలైనందుకు ముఖ్యమంత్రి అయిపోయారు. ఆమె ఎలాంటి చరిత్ర సృష్టిస్తుందో వెండి తెరపై చూడాల్సిందే. అసలు ఆమె ఎన్నాళ్లు కుర్చీ మీద కూర్చుంటారనేది సందేహమే. ఆమెపై సుప్రీం కోర్టులో అక్రమాస్తుల కేసుతోపాటు మరి కొన్ని కేసులున్నాయి. వీటిల్లో తీర్పులు రావల్సివుంది. సరే…ఆమె రాజకీయం సంగతి అలా పక్కనుంచితే పన్నీరు శెల్వం పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఆయన భవిష్యత్తేమిటి? విక్రమార్కుడు ఎప్పటిమాదిరిగా నే చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని నడిచిపోయినట్లుగా పన్నీరు మళ్లీ మంత్రి పదవి పుచ్చుకొని కొత్త ముఖ్యమంత్రి శశికళకు భజన చేస్తారా? లేదా మరేదైనా ప్రణాళిక ఉందా? చిన్నమ్మ సీఎంగా ఎంపిక కాగానే పన్నీరు శెల్వం విధేయతను బాగా పొగిడారు. ఆయన తనకు కూడా విధేయుడిగా ఉండాలని, ఉంటాడని ఆమె ఉద్దేశం.

ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రిగా చేసి పదవి నుంచి దిగిపోవడం ఇది మూడోసారి. ఒకవేళ 'శశికళ దోషి' అని సుప్రీం కోర్టు తీర్పు ఇస్తే, ఆమె గత్యంతరం లేక పదవి నుంచి దిగిపోతే మళ్లీ ఈయనే మరోసారి తాత్కాలిక ముఖ్యమంత్రి అవుతాడేమో….! అదెలా జరుగుతుందో చెప్పలేంగాని ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలో చేరతారా? బయట ఉంటారా? అనేది ఆసక్తికరం. చర్చనీయాంశం. రామాయణంలో భరతుడి పాత్ర అందరికీ తెలిసిందే. రాముడి స్థానంలో భరతుడిని అయోధ్యకు రాజుని చేయాలని  తల్లి కైకేయి ప్రయత్నించగా, ఆమెను అసహ్యించుకున్న భరతుడు రాముడు వనవాసానికి వెళ్లినప్పుడు ఆయన పాదుకలను సింహాసనం మీద పెట్టి రాజ్య పాలన చేస్తాడు. అప్పటి రాజవంశ సంప్రదాయాల ప్రకారం రాముడే అసలు రాజు కాబట్టి తనను తాను రాజుగా భావించుకోకుండా రాముడి పేరుతోనే రాజ్యం చేస్తాడు. 'విధేయత'కు భరతుడిని తిరుగులేని ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

ఆ భరతుడే మళ్లీ పుట్టాడు. ఆయనే పన్నీర్‌శెల్వం. ఈ 'అభినవ భరతుడు' ఒకప్పుడు రెండుసార్లు కొద్దికాలం (జయలలిత కష్టాల్లో ఉన్నప్పుడు)  తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. జయలలిత చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఆయన మరోసారి తాత్కాలిక ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సీఎం కుర్చీలో కూర్చోగానే ఎక్కువ కాలం ఉండరని అందరూ అనుకున్నదే. కోర్టు కేసుల కారణంగా శశికళ ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు సుముఖంగా లేరనే వార్తలు వచ్చిన నేపథ్యంలో పన్నీరు కొనసాగుతారని అనుకున్నారు. అందులోనూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు అండగా ఉందని, శశికళకు చక్రం అడ్డేస్తుందని అంచనా వేశారు. కాని కథ మరోలా మారింది. జయలలిత తుదిశ్వాస విడిచినట్లు ప్రకటన వచ్చిన మరుక్షణమే 'నేనే ముఖ్యమంత్రినవుతా' అని శశికళ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె ఆ ప్రకటన చేయగానే పన్నీరు శెల్వం గుండెల్లో రాయి పడింది. తన పదవికి ఎసరు పెట్టొద్దని ఆయన చిన్నమ్మను వేడుకున్నారు. 

ఆమెను ప్రధాన కార్యదర్శిగా ఉండమని, తాను సీఎంగా ఉంటానని చెప్పారు. తాను ప్రధాన కార్యదర్శి పదవికే పరిమితమవుతానని ఆమె చెప్పినట్లు వార్తలొచ్చాయి. కాని చాప కింద నీరులా చిన్నమ్మ ప్రయత్నాలు కొనసాగాయి.  పన్నీర్‌ శెల్వంను మంత్రులెవ్వరూ ముఖ్యమంత్రిగా గౌరవించడం కాదు కదా  కనీసం గుర్తించలేదు.  పన్నీరు సీఎం అయినా శశికళ ముందు చేతులు కట్టుకొని నిలబడే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ మంత్రిగా మారి చేతులు కట్టుకొని నిలబడతారా? ముఖ్యమంత్రి పదవి అత్యున్నతమైంది. ఆ పదవి చేశాక మంత్రిగా చేయరు. చేయడానికి మనసొప్పదు కూడా. కాని పన్నీరుశెల్వం రెండుసార్లు తాత్కాలిక ముఖ్యమంత్రిగా చేశాక జయ మంత్రివర్గంలో చేరారు. దీన్ని పరువు తక్కువగా ఆయన భావించలేదు. 

ఆయన తనను తాను ఏనాడూ ముఖ్యమంత్రిగా భావించుకోలేదు కాబట్టి, మంత్రిగా పనిచేయడం చిన్నతనంగా అనుకోలేదు. ఒకప్పుడు ఒక చిన్న టీకొట్టు యాజమాని అయిన పన్నీరుశెల్వం ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం చాలా గొప్ప. కాని మూడుసార్లు అది తాత్కాలికమే అయింది. రెండుసార్లు 'అమ్మ' కష్టాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆమె కష్టాలు తీరగానే తప్పుకున్నారు. ఇది విధేయతతో చేసిన పని. కాని మూడోసారి ముఖ్యమంత్రి అయిన తరువాత అత్యంత అవమానకరంగా దిగిపోవల్సి వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయన్ని దిగిపొమ్మని డిమాండ్‌ చేశారు. చిన్నమ్మకు కిరీటం పెట్టారు. ఎప్పటిమాదిరిగానే ఆయనకు ఎలాంటి ఫీలింగ్స్‌ లేకుండా ఉంటే చిన్నమ్మ దగ్గర మంత్రిగా చేరతారు.