ఏమిటీ పాత కథ? పాతవి వద్దు అనడమేమిటి? పాతవే ముద్దు అని మెచ్చుకోవడం ఏమిటి? ఇవి రెండు పరిణామాలు. మొదటిది తెలంగాణకు సంబంధించింది. రెండోది ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించింది. మొదటిది వివాదం. రెండోది వినూత్నం. నిజాముల కాలం నాటి భవనాలను ‘పాతవి’ అనే పేరుతో కూల్చివేయాలని కేసీఆర్ సర్కారు నిర్ణయించడం కొంతకాలంగా వివాదమవుతోంది. ప్రస్తుతం ఆ జాబితాలో ఉస్మానియా జనరల్ ఆస్పత్రి చేరింది. ఆంధ్రప్రదశ్ ప్రభుత్వం పాతవాటికి పట్టం కట్టాలని నిర్ణయించుకుంది. అయితే అవి పురాతన కట్టడాలు కాదు. ఊళ్ల పేర్లు. ఇప్పుడున్న చాలా ఊరి పేర్లు వాటి అసలు పేర్లు కావు. కాలక్రమంలో మారుతూ వచ్చాయి. అంటే కొత్త పేర్లన్న మాట. వాటిని మార్చేసి వాటి అసలు పేర్లను పునరుద్ధరించాలని, వాటినే అధికారికంగా వాడుకలో పెట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో ఈ చర్య కొత్తది కాకపోయినా తెలుగువారికి సంబంధించినంతవరకు వినూత్నం.
చెప్పింది ఒకటి….చేసేది మరొకటా?
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే తెలంగాణలోని చారిత్రక ప్రాధాన్యంగల పురాతన భవనాలను, వారసత్వ సంపదను (హెరిటేజ్) పరిరక్షిస్తామని చెప్పారు. ఉమ్మడి రాష్ర్టంలో ఆంధ్ర పాలకులు తెలంగాణ చరిత్రను మట్టిలో కలిపారని, అణగదొక్కారని, తెలంగాణ వారికి వారి చరిత్రనే తెలియనీయకుండా చేశారని…ఇలా ఎన్నో మాటలన్నారు. నిజాముల నాటి కొన్ని కట్టడాలను వారసత్వ సంపదగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు కూడా. చూడదగిన ప్రపంచ పర్యాటక స్థలాలున్న నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని గత ఏడాది నవంబరులో నేషనల్ జియోగ్రాఫికల్ వాల్ట్ ఆర్గనైజేషన్ చేసిన సర్వే తేల్చింది. ఈ జాబితాలో తొలి స్థానం శాన్ఫ్రాన్సిస్కోలోని ప్రెసిడియో పార్కు దక్కించుకుంది. స్విట్జర్లాండ్‌లోని జెర్మెట్, వాషింగ్టన్ డీసీలోని నేషనల్ మాల్, ఫ్రాన్స్‌లోని కోర్సికా …ఇలా పలు ప్రదేశాలు పర్యాటకులు తప్పక చూడదగినవి. అయితే వీటన్నింటినీ తలదన్ని హైదరాబాద్ రెండో స్థానం దక్కించుకుంది. 2015లో హైదరాబాద్ ప్రపంచంలోనే చూదదగిన నగరమని ట్రావెలర్ మేగజైన్ తెలియచేసింది. పర్యాటకులకు కనువిందు చేసే చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలు హైదరాబాద్‌లో చాలా ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల రాచరిక పాలనకు హైదరాబాద్ సజీవ సాక్ష్యం. ఇక్కడి నిర్మాణాలు చారిత్రక ప్రాధాన్యం ఉన్నవేకాకుండా ఆర్కిటెక్చర్ పరంగా కూడా అబ్బురపరిచేవిధంగా ఉంటాయి. చార్మినార్, అసెంబ్లీ భవనాలు, ఫలక్‌నుమా ప్యాలెస్, గోల్కొండ కోట, తారామతి బారాదరి, సాలర్జంగ్ మ్యూజియం, హుస్సేన్ సాగర్, జూపార్క్, ఆధునిక నిర్మాణమైన హైటెక్ సిటీ….ఇలా ఎన్నయినా చెప్పుకోవచ్చు. ప్రపంచ పర్యాటక నగరాల్లో హైదరాబాద్ రెండో స్థానంలో వచ్చేసరికి ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని వారసత్వ సంపద గల నగరం (హెరిటేజ్ సిటీ) గా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు.
ఎందుకు పురుగు తొలిచింది?
ఇంతవరకు బాగానే ఉన్నా, ముఖ్యమంత్రి కొన్ని చర్యలు వివాదాస్పదమయ్యాయి. పిచ్చి ఆలోచనలు చేసేవారిని ‘పురుగు తొలిచింది. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాడు’ అంటారు. చెట్టును పురుగు తొలిస్తే అది పాడైపోతుంది. సహేతుకం కాని ఆలోచనల వల్ల హాని జరుగుతుందని అర్థం. చెస్ట్ ఆస్పత్రిని వికారాబాదుకు తరలిస్తానన్నారు. వాస్తు బాగాలేదంటూ సెక్రటేరియట్‌ను మారుస్తానన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పేదలకు ఇళ్లు కడతానన్నారు. హుస్సేన్‌సాగర్ దగ్గర ఆకాశమంత ఎత్తయిన భవనాలు కడతానన్నారు. ఇందిరా పార్కులో చెరువు తవ్విస్తానన్నారు. రవీంద్ర భారతి పనికిరాదని, దాని తాతలాంటి భవనం కనడతానన్నారు. ఆ డిజైన్ కూడా మీడియాకు విడుదల చేశారు. ప్లే గ్రౌండ్లో కళాభారతి కడతానన్నారు. దీంతో కేసీఆర్ ‘పిచ్చి పనులు’ చేస్తున్నారనే అభిప్రాయం జనాలకు కలిగింది. ఈ పిచ్చి తగ్గకముందే ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని కూలగొడతామంటూ చిచ్చు రేపారు. ఇదింకా రగులుతూనే ఉంది. కేసీఆర్ ఏ ఉద్దేశంతో ఉస్మానియా ఆస్పత్రిని కూలగొడతామని అన్నారో స్పష్టంగా ఇప్పటివరకు తెలియదు. ఇప్పటివరకు చెప్పిన కారణం…భవనం పాతబడిపోయింది కాబట్టి ఏ క్షణమైనా కూలిపోతుందని, అప్పుడు రోగుల ప్రాణాలు పోతాయని, కాబట్టి కూలగొట్టి ఎత్తయిన రెండు టవర్ల (ట్విన్ టవర్స్) రూపంలో ఆస్పత్రి నిర్మిస్తామని చెప్పారు. ఈ ఆలోచన చేయగానే రోగులను ఇతర ఆస్పత్రులకు తరలించాలని కూడా ఆదేశించారు. అది కాస్తా గందరగోళంగా మారింది. ఉస్మానియా ఆస్పత్రిని కూలగొట్టాలనే కేసీఆర్ ఆలోచన తెలంగాణ కురుక్షేత్రంలా మారేందుకు దోహదం చేసింది. ఆయన పరిపాలనను వ్యతిరేకించే రాజకీయ పార్టీలు, వ్యక్తులు కూడా సమరభేరీ మోగించారు. కేవలం ఉస్మానియాను మాత్రమే కాకుండా నగరంలోని అన్ని పురాతన నిర్మాణాలను, వారసత్వ సంపదను రక్షించుకోవాలనే ఉద్దేశంతో కొత్త వేదికలు ఏర్పాటయ్యాయి. ఉస్మానియా భవనాలను కూలిస్తే తప్పేమిటి? అని కేసీఆర్, కొందరు మంత్రులు ప్రశ్నిస్తుండగా, కూల్చాల్సిన అవసరం ఏముంది? ప్రత్యామ్నాయం ఉందని ఉస్మానియా పరిరక్షక ఉద్యమకారులు చెబుతున్నారు. ఆస్పత్రి పక్కనే నుంచి 10 ఎకరాల స్థలం ఉందని, ఆస్పత్రి భవనాలు అలాగే ఉంచేసి ఆ భూమిలో కొత్త భవనాలు కట్టొచ్చని సలహా ఇచ్చారు. సుమారు వందేళ్ల క్రితం నాటి ఉస్మానియా భవనాలు ఇంకా గట్టిగానే ఉన్నాయని, రిపేర్లు చేసుకుంటే సరిపోతుందని భవన నిర్మాణ రంగ నిపుణులు కొందరు అంటున్నారు. ఎంత రిపేర్లు చేసినా ఐదారు సంవత్సరాల కంటే ఎక్కువ ఉండదని అనేవారూ ఉన్నారు. బిల్డింగ్ టెక్నాలజీ ఎంతగానే పెరిగిన ఈ కాలంలో ఉస్మానియా భవనాలను కూలకుండా చూడటం కష్టం కాదనేవారూ ఉన్నారు. భవనాలను కూలగొట్టి ఆ స్థలాన్ని తనకు కావల్సిన కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు.
పురాతనమా? హెరిటేజా?
ఉస్మానియా భవనాల కూల్చివేతను వ్యతిరేకిస్తుండగానే ‘అవసరమైతే చార్మినార్‌నూ కూలగొడతాం’ అంటూ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ మరో వివాదం రేపారు. ఈ వాద వివాదాలు కొనసాగుతుండగానే కేసీఆర్ ప్రతి చర్యనూ సమర్ధించే ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఉస్మానియా కూల్చివేతను సమర్ధించింది. పురాతన నిర్మాణాలకు, వారసత్వ (హెరిటేజ్) నిర్మాణాలకు చాలా తేడా ఉందని రాసింది. ఉస్మానియా ఆస్పత్రి భవనాలు పురాతనమైనవి తప్ప హెరిటేజ్ కిందకు రావని, కాబట్టి కూలగొట్టినందువల్ల తెలంగాణ చరిత్రకు కలిగే నష్టం ఏమీ లేదని స్పష్టం చేసింది. హెరిటేజ్ భవనాల్లో కళాత్మక విలువలు కూడా ఉంటాయని, కాని ఉస్మానియా భవనాలు ఆస్పత్రి నిర్వహణ కోసం కట్టించినవి తప్ప కళాత్మక విలువలేవీ లేవని తేల్చింది. చార్మినార్ హెరిటేజ్ నిర్మాణమని, ఆ అర్హత ఉస్మానియాకు లేదని పేర్కొంది. పురాతనమైన ప్రతి నిర్మాణం హెరిటేజ్ కాదనే సంగతి గుర్తు పెట్టుకోవాలని, ఆ లెక్కన చూస్తే హైదరాబాద్ చాలా పురాతన నిర్మాణాలు ఉన్నాయని, వాటిని అన్నింటినీ రక్షించుకోవాలా? అని ప్రశ్నించింది. ప్రస్తుత గాంధీ ఆస్పత్రిని బ్రిటిషువారు 151లో నిర్మించిన భవనాన్ని కూలగొట్టి కట్టారని, అప్పుడు ఎవరూ ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించింది. అది కూడా హెరిటేజ్ కిందనే పరిగణించాలి కదా? మరి నాయకులు పోటీలు పడి కూల్చివేతకు ఎందుకు మద్దతు పలికారని నిలదీసింది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఉస్మానియా చుట్టూ అల్లుకున్నాయి. నిజంగానే కూలగొడితే పెద్ద గొడవలయ్యే ప్రమాదం ఉంది. పాత బస్తీపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న ఎంఐఎం నాయకులు ఊరుకుంటారా? నిజాములను పదే పదే కీర్తించే కేసీఆర్ చివరకు అప్పటి నిర్మాణాలనే వివాదాస్పదం చేసి చరిత్రను అగౌరవపరిచే వ్యక్తిగా ముద్ర వేసుకుంటున్నారు.
ఏపీలో ఊళ్ల పేర్లు మార్పు
ఆంధ్రప్రదేశ్‌లో ఊళ్ల పేర్లు మార్చాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశంలోని అనేక ఊళ్ల పేర్లు నవాబుల, బ్రిటిషువారి పరిపాలనలో మారిపోయాయి. వాటి అసలు పేర్లు పలకడం చేతకాని పాలకులు తమకు అనుకూలంగా మార్పులు చేసుకున్నారు. రాజ్యాలు పోయి, ముస్లింల, బ్రిటిషర్ల పాలన అంతరించినా మనం అవే పేర్లను కొనసాగిస్తున్నాం. తెలంగాణలో, ఆంధ్రలో తెలుగుదనం ఉట్టిపడే చక్కటి పేర్లు ఇస్లామీకరణ జరిగాయి. కొన్ని ఆంగ్ల నుడికారంతో మార్పు చెందాయి. కాబట్టి ఊళ్లకు వాటి అసలు పేర్లనే ప్రాచుర్యంలోకి తీసుకురావాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. పేర్లు మార్చిన చరిత్ర దేశంలో ఉంది కాబట్టి ఇది కొత్త ప్రయోగం కాదు. బొంబాయి ముంబైగా మారింది. మద్రాసు చెన్నయ్‌గా మారింది. కలకత్తా కోల్‌కతగా మారింది. ఒరిస్సా ఒడిశాగా మారింది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేం ఉన్నాయి. ఏపీ రాజధానికి ‘అమరావతి’ అని చక్కటి పేరు ఖాయం చేసిన ప్రభుత్వం అదే దారిలో నడవాలని నిర్ణయించింది. రాజమండ్రి పేరు ‘రాజమహేంద్రవరం’గా, నెల్లూరు పేరు ‘విక్రమసింహపురి’గా మార్చాలని నిర్ణయించింది. ఇవి వాటి అసలు పేర్లు. ఇవి ఈ తరం వారికి తెలియవు. ఇది మంచి ప్రయత్నమే. తెలంగాణలో దాదాపు అన్ని ఊళ్ల పేర్లను ముస్లిం పాలకులు మార్చేశారు. తెలంగాణ వైభవం పునరుద్ధరణలో భాగంగా ఊరి పేర్లు మార్చడం సమంజసం.
నాగ్ మేడేపల్లి