ఏమాత్రం తేడా లేదు. ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ గెలవాల్సిన మ్యాచ్‌ని టీమిండియా చేజార్చుకుని, ఇప్పటికే వెనుకబడ్డ టీమిండియా మరోమారు పరాజయాన్ని చవిచూసింది. తొలి మ్యాచ్‌లో ఎలాగైతే బౌలర్లు, బ్యాట్స్‌మన్ సమిష్టిగా విఫలమయ్యారో.. రెండో మ్యాచ్‌లోనూ అదే జరిగింది.
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాకి ఆధిక్యం దక్కిందంటే అది భారత బౌలర్ల పుణ్యమే. టీమిండియా చెత్త ఫీల్డింగ్ కారణంగా ఆస్ట్రేలియా టెయిలెండర్లు కూడా చెలరేగిపోయారు. ఇక, రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 61 పరుగులతో ఈ రోజు ఆట మొదలు పెట్టిన టీమిండియా, చకచకా వికెట్లు పారేసుకుంది. టెయిల్ ఎండర్లతో కాస్సేపు శిఖర్ ధావన్ పోరాడినా ఉపయోగం లేకుండా పోయింది. 224 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యింది టీమిండియా.
128 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తక్కువ టార్గెట్ కావడంతో తేలిగ్గానే టార్గెట్‌ని ఛేదించింది. ఆరు వికెట్లు ఆస్ట్రేలియా కోల్పోయినప్పటికీ, అదేమీ భారత బౌలర్ల ప్రతిభ అనుకోడానికి వీల్లేని పరిస్థితి. 250 పరుగుల టార్గెట్‌ని టీమిండియా ఆసీస్ ముందుంచితే, రెండో టెస్ట్‌లో టీమిండియా గెలిచేందుకు అవకాశాలుండేవేమో.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో టీమిండియా వైఫల్యం కొనసాగుతుండడంతో, ఆసీస్ వరుసగా టీమిండియాపై రెండో విజయం నమోదు చేసింది.