టీమిండియా- ఇంగ్లండ్ జట్ల మధ్యన చెన్నై లో జరుగుతున్న తొలి టెస్టులో పర్యాటక జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ టెస్టు సీరిస్ లో ఇంగ్లండ్ ను టీమిండియా చిత్తు చేస్తుందనే అంచనాలకు విరుద్ధంగా తొలి మ్యాచ్ సాగుతూ ఉంది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు భారీ స్కోరును సాధించి నిలిచింది. రూట్ అద్భుత డబుల్ సెంచరీతో 578 పరుగుల భారీ స్కోరును సాధించిన బ్రిటీష్ జట్టు.. ఆ తర్వాత బౌలింగ్ విభాగంలోనూ రాణించడం విశేషం.
పలువురు భారత బ్యాట్స్ మెన్ పేలవమైన షాట్లను ఆడి పెవిలియన్ చేరారు. పుజరా, పంత్, వాషింగ్టన్ సుందర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు. రోహిత్ శర్మ, కొహ్లీ, రహనేలు దారుణమైన ఆటతీరుతో అభిమానులను నిరాశపరిచారు. దీంతో భారత జట్టు ఫాలో ఆన్ ఆడాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే.. టీమిండియాను ఫాలోఆన్ ఆడించలేదు ఇంగ్లండ్ జట్టు. మళ్లీ తనే బ్యాటింగ్ కు దిగింది. చివరి రోజు పిచ్ బౌలింగ్ కు అనుకూలించవచ్చు అనే లెక్కలతో వీలైనంత టార్గెట్ ను టీమిండియా ముందు పెట్టి.. చివరి రోజు భారత బ్యాట్స్ మెన్ ను ఆడించాలనే వ్యూహంతో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ కే మొగ్గు చూపింది.
ప్రస్తుత సమీకరణాల మధ్యన అయితే ఈ మ్యాచ్ లో టీమిండియాకు విజయం దాదాపు అసాధ్యం అనే రీతిలో ఉంది. ఇంగ్లండ్ సుమారు 240 పై స్థాయి లీడ్ లో ఉంది. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ఓ మోస్తరుగా రాణించినా.. ఆ జట్టు సేఫ్ జోన్లో ఉంటుంది. టీమిండియాకు మాత్రం కఠినమైన ఐదు సెషన్స్ ఎదురుకాబోతున్నాయి.