భారత క్రికెట్ జట్టు సెలెక్టర్లు ఇప్పుడు ఎవరు? అంటే ఎంత క్రికెట్ అభిమానులు కూడా సమాధానం చెప్పడానికి తడుముకోవాల్సిందే! సాధారణంగా క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో సెలెక్టర్ల పేర్లు తరచూ వినిపిస్తూ ఉంటాయి. సెలెక్టర్లు చేసే ప్రకటనలు కూడా వివాదాలు రేపుతూ ఉంటాయి. జాతీయ జట్టుకు సెలెక్టర్లు వ్యవహరించడాన్ని మాజీ ప్లేయర్లు కూడా సూపర్ స్టార్ డమ్ గా భావిస్తారు.
బోర్డు ప్రెసిడెంట్ తో సమానమైన స్థాయిలో వీరికి మీడియాలో ట్రీట్ మెంట్ దక్కుతూ ఉంటుంది. అయితే బీసీసీఐ ప్రెసిడెంట్ గా సౌరవ్ గంగూలీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు భారత క్రికెట్ కు సంబంధించిన ఏ వ్యవహారం అయినా గంగూలీ చెప్పినట్టే అన్నట్టుగా మారింది.
గంగూలీ కేవలం బీసీసీఐ ప్రెసిడెంట్ మాత్రమే. అయితే పరిస్థితి చూస్తుంటే.. భారత క్రికెట్ జట్టుకు సెలెక్టర్ తో సహా షెడ్యూల్స్ ఫిక్స్ చేయడం వంటి అంశాలతో పాటు.. అన్ని అంశాలూ గంగూలీ కనుసన్నల్లోనే జరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. జట్టులో ఎవరు ఉండాలో ఉండకూడదో కూడా గంగూలీ నిర్ణయం మేరకే ప్రాబబుల్స్ ఎంపికలు జరుగుతున్నట్టుగా కనిపిస్తాయి.
గంగూలీ ఏదైనా ప్రకటన చేశాడంటే.. భారత జట్టు ఏ దేశంలో ఉన్నా ఆ మార్పు వెంటనే అమలవుతూ ఉంటుంది. ఫలానా వారికి అవకాశం దక్కడం గురించి గంగూలీ ఏదైనా అన్నాడంటే.. అది వెంటనే అమలవుతూ ఉంది. గతంలో బోర్డు ప్రెసిడెంట్లు ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుని ఉంటారు, డబ్బు వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకుంటూ ఉండే వారు.
ఇలా సెలెక్షన్ వ్యవహారాల్లో తమ జోక్యం ఉందని చాటుకునే వాళ్లు ఎవరూ ఉండేవారు కాదు. అయితే గంగూలీ బోర్డు ప్రెసిడెంట్ గా ఉన్న నేపథ్యంలో.. సెలెక్టర్ల పేర్లు కానీ, వారి స్టేట్ మెంట్ లు కానీ పత్రికల్లో రావడం లేదు! అలాగే ఐపీఎల్ వ్యవహారాల్లో కూడా పూర్తిగా గంగూలీనే స్పందిస్తూ ఉంటారు. మామూలుగా అయితే ఐపీఎల్ కు వేరే కార్యనిర్వహకులు ఉన్నారు.
ఐపీఎల్ నిర్వాహణకు సంబంధించి లలిత్ మోడీ ఖాళీ చేసి వెళ్లిన ప్లేస్ లో బీసీసీఐ తర్వాత వేరే వాళ్లను నియమిస్తూ వెళ్లింది. మామూలుగా అయితే ఐపీఎల్ నిర్వహణ, వాయిదా, తిరిగి నిర్వహణ వంటి అంశాల్లో వారెవరైనా ప్రకటనలు చేస్తూ ఉండాల్సింది. అయితే ఐపీఎల్ వాయిదాతో సహా, దాని నిర్వహణకు సంబంధించి తదుపరి అంశాలన్నీ కూడా గంగూలీనే చెబుతున్నారు. జాతీయ జట్టు షెడ్యూల్ కు సంబంధించి కూడా సౌరవ్ నే మీడియాకు సమాచారం ఇస్తున్నారు.
మొత్తానికి ఇప్పుడు గంగూలీ కెప్టెన్ గా ఉన్న సమయంలో కన్నా ఎక్కువ నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఆ మేరకు గంగూలీ సమర్థత మీద ఎవరికీ అనుమానాలు లేవు. జాతీయ జట్టుకు కుర్రకారును ప్రోత్సహించిన ఘనత ఉన్న కెప్టెన్ కాబట్టి.. ఇప్పుడు కూడా గంగూలీ తీసుకునే నిర్ణయాలు భారత జట్టు విజయం కోసం ఉద్దేశించినవే కావొచ్చు. అయితే.. ఏక వ్యక్తి స్వామ్యం అంత గొప్ప అయితే కాదు.
అందులోనూ లెక్కల ప్రకారం చూస్తే సౌరవ్ పదవీకాలం ఎప్పుడో ముగిసింది. కోర్టు నిర్దేశించిన, లోథా సంస్కరణల ప్రకారం చూస్తే.. గంగూలీ ఇప్పుడు బీసీసీఐ అధ్యక్ష పదవిలో ఉండటానికి అనర్హుడు. క్యాబ్ ప్రెసిడెంట్ గా టర్మ్ లు పూర్తి చేసిన గంగూలీ ప్రస్తుతం కూలింగ్ పిరియడ్ లో ఉండాలి. పాలక పదవులను వదులుకోవాలి. అయితే గంగూలీ విషయంలో లోథా సంస్కరణల అమలు లేదు, అలాగే అమిత్ షా తనయుడు జై షా విషయంలోనూ లోథా సంస్కరణలు అమలు చేస్తున్నట్టుగా లేరు!