కళ్లెదుటే తండ్రి రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేయడంపై తనయుడు భరత్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అందులోనూ తండ్రి పుట్టిన రోజును సంతోషంగా జరుపుకుంటున్న శుభవేళ….ఏపీ సీఐడీ పోలీసులు చడీచప్పుడు లేకుండా అరెస్ట్ చేసి తీసుకెళ్లడం సహజంగానే ఆయనకు మనస్తాపం కలిగించింది. రఘురామకృష్ణంరాజు అరెస్ట్ అనంతరం ఆయన తనయుడు తీవ్ర ఆవేదనతో మాట్లాడుతూ ఏపీ సర్కార్‌పై ఆక్రోశం వెళ్లగక్కారు.
రాజకీయంగా రఘురామకృష్ణంరాజు ఒక్కొక్కరిగా ఒక్కోలా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ కుటుంబ సభ్యులకు మాత్రం భార్యకు మంచి భర్తగా, పిల్లలకు సుగుణాల తండ్రిగా కనిపిస్తారు. అందుకే రఘురామకృష్ణంరాజు అరెస్ట్ కుటుంబ సభ్యుల్ని, మిత్రుల్ని ఆవేదనకు గురి చేసింది.
తండ్రి అరెస్ట్ అనంతరం భరత్ మీడియాతో మాట్లాడుతూ తన తండ్రికి గుండెలో ఐదు రంధ్రాలున్నాయని, నవంబర్‌లోనే ఓపెన్‌హార్ట్ సర్జరీ జరిగిందని వాపోయారు. లోక్‌సభ సభ్యుడని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రూల్ ఆఫ్ లా అనేది ఉందా… లేదా.. అర్థం కావట్లేదన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. వారు చేస్తున్న తప్పుల్ని వ్యతిరేకిస్తే అరెస్టులు చేస్తారా? అని రఘురామకృష్ణంరాజు తనయుడు భరత్ నిలదీశారు.
రఘురామకృష్ణంరాజు తనయుడి ఆవేదన అర్థం చేసుకోదగింది. అయితే నాణేనికి రెండో వైపు కూడా ఉంటుందని భరత్ గుర్తించాలి. ఇటీవల కాలంలో తన తండ్రి తన పదవికి తగ్గట్టు ప్రవర్తించారా? అనేది ప్రశ్నించుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. రచ్చ బండ పేరుతో రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై వాడిన అభ్యంతరకర పదజాలం సభ్య సమాజం తలదించుకునేలా ఉందంటున్నారు.
“ఇలా మాట్లాడ్డం తప్పు నాన్నా” అని భరత్ ఏదో ఒక సందర్భంలో హితవు చెప్పి ఉంటే… ఈ రోజు పరిస్థితి ఇంత వరకూ వచ్చి ఉండేది కాదని నెటిజన్లు అంటున్నారు. ఓపెన్‌హార్ట్ సర్జరీ చేయించుకున్న తండ్రి విశ్రాంతి తీసుకోకుండా ఢిల్లీ వేదికగా రాజకీయ విమర్శలు చేయడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. చర్యకు ప్రతిచర్య ఉంటుందని తెలుసుకుంటే… ఎవరూ పరిధి మించి ప్రవర్తించరని అంటున్నారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం తప్పు కాదని, కానీ రఘురామకృష్ణంరాజు బూతులను విమర్శలుగా, ప్రశ్నించడంగా ఎవరైనా భావిస్తే అంతకు మించిన అజ్ఞానం ఉందా భరత్ అని నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
తమ దగ్గరికి వస్తే మాత్రం ఎంపీ కాబట్టి గౌరవ మర్యాదలు ఇవ్వాలని, మరి ఒక ముఖ్యమంత్రి, ఆయన సలహాదారుడిపై తమరి తండ్రి వాడిన భాష ఎలాంటి సంస్కారవంతమైందో భరత్ చెబితే తెలుసుకోవాలని అనుకుంటున్నామని ప్రత్యర్థులు అంటున్నారు. ఏం భరత్… వినిపిస్తోందా?