ఈ మాట అంటోంది వేరెవరో కాదు, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇండస్ట్రీలో ఏదో అయిపోతుందనే భయం తనకు లేదంటోంది ఈ ముద్దుగుమ్మ. అలా భయంతో బ్రతకడం తనకు ఇష్టం లేదంటోంది.
“భయంతో బ్రతికే టైపు కాదు నేను. ఎందుకంటే ఇక్కడికొచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు. కానీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను. ఎంతోమంది అవకాశాల కోసం ఎదురుచూస్తున్న టైమ్ లో నాకు ఛాన్సులొస్తున్నాయి. నా కలను నేను సాకారం చేసుకున్నాను. ఇంతకంటే ఇంకేం కావాలి.”
ఇలా తన మనసులో ఆనందాన్ని బయటపెట్టింది రకుల్. ప్రస్తుతం నటిగా తృప్తికరమైన స్టేజ్ లో ఉన్నానంటున్న రకుల్.. తన సినిమా సెలక్షన్ ఎప్పటికప్పుడు మారిపోతుందని చెప్పుకొచ్చింది.
“కథ లేదా క్యారెక్టర్ బట్టి సినిమాలు ఎంచుకుంటానని చెప్పలేను. ఓసారి కథ నచ్చుతుంది. అందులో తప్పనిసరిగా భాగం అవ్వాలనిపిస్తుంది. మరోసారి నా పాత్ర నచ్చుతుంది. ఇంకోసారి మంచి డైరక్టర్ సినిమా పడొచ్చు, లేదంటే పెద్ద హీరో సినిమా పడొచ్చు. ఇలా ప్రాజెక్టులు అంగీకరించే విషయంలో ఏ సినిమాకు ఆ సినిమా ప్రత్యేకం.”
లక్షల మంది ప్రేక్షకులు చూస్తున్నారనే ఆలోచనే తనను ముందుకు నడిపిస్తుందని, తను నటించిన సినిమా బాగుందని ఎవరైనా చెబితే చాలా ఉత్సాహం వస్తుందని అంటోంది రకుల్. ఎప్పటికప్పుడు ఉత్సాహంగా పనిచేయడానికి ఇదే కారణమని చెబుతోంది.